- భార‌తి ఎంట్రీతో క‌డ‌ప మారుతుందా? అంద‌రి చ‌ర్చా ఇదే..!
- పులివెందుల‌, క‌డ‌ప పార్ల‌మెంటు ప్ర‌చారం బాధ్య‌త అంతా భార‌తిదే
- భార‌తి ష‌ర్మిల‌ను టార్గెట్ చేస్తారా... జ‌గ‌న్ సంక్షేమం హైలెట్ చేస్తారా..?

( రాయ‌ల‌సీమ - ఇండియా హెరాల్డ్ )
క‌డ‌ప‌- వైఎస్ కుటుంబానికి కంచుకోట‌. ఇక్క‌డ ప్ర‌త్య‌ర్థుల‌కు ఛాన్స్ లేదు. జిల్లా వ్యాప్తంగా వైఎస్ పేరు మారిపోతుంది. గ‌త ఎన్నికల్లో రెండు పార్ల‌మెంటు స్థానాలు (రాజంపేట‌, క‌డ‌ప‌), ప‌ది అసెంబ్లీ స్థానాల్లో వైసీపీనే విజ‌యం ద‌క్కించుకుంది. ప్ర‌త్య‌ర్థులు క‌నీసం పోటీ కూడా ఇవ్వ‌ని నియోజ‌క‌వ‌ర్గంగా పులివెందు ల రికార్డుల మోత మోగించింది. ఇలాంటి జిల్లాలో ఇప్పుడు వైఎస్ కుటుంబ‌మే ప్ర‌త్య‌ర్థులుగా మారిపో యింది. అన్న‌పై చెల్లి ష‌ర్మిల క‌త్తులు దూస్తున్నారు. మ‌రో చెల్లి, వివేకా కుమార్తె సునీత విరుచుకుప‌డుతు న్నారు.


ఒక‌ప్పుడు వైఎస్‌ను, ఆయ‌న కుటుంబాన్ని ఓడించ‌మ‌ని ప్ర‌త్య‌ర్థి పార్టీలు ప్ర‌చారం చేస్తే.. ఈ డ్యూటీ ష‌ర్మిల‌, సునీత లు తీసుకున్నారు. ఎండ‌ల‌ను మించిపోయిన సెగ‌తో ఇక్క‌డ రాజ‌కీయాలు వేడెక్కాయి. ఇలాంటి చోట‌.. ఇప్పుడు సీఎం జగ‌న్ స‌తీమ‌ణి వైఎస్ భార‌తి అరంగేట్రం చేస్తున్నారు. పులివెందుల అసెంబ్లీతో పాటు క‌డ‌ప పార్ల‌మెంటు సీటును గెలిపించే ప్ర‌చార బాధ్య‌త మొత్తాన్ని జ‌గ‌న్ భార‌తికి అప్ప‌గించారు. ఆమె గ‌త ఎన్నిక‌ల్లోనూ ఇంటింటికీ తిరిగారు. జ‌గ‌న్తోపాటు.. వైసీపీ నాయ‌కుల‌ను గెలిపించాల‌ని కోరారు.ఇప్పుడు కూడా అదే ప‌ని పెట్టుకున్నారు. కానీ, అప్ప‌టికి ఇప్ప‌టికీ చాలా మార్పు వ‌చ్చింది.


కీల‌క‌మైన వివేకానంద‌రెడ్డి హ‌త్య చుట్టూ క‌డప రాజ‌కీయం గిరికీలు కొడుతోంది. ఇలాంటి స‌మ‌యంలో సొంత అన్న‌ను ఓడించాల‌ని చెల్లెళ్లు ఇద్ద‌రూ యాత్ర‌లు చేస్తున్నారు. వీరి ప్రచారం ముగిసిన మ‌రుక్ష ణం.. భార‌తి ఎంట్రీ ఇస్తున్నారు. ఎన్నిక‌లు అయ్యే వ‌ర‌కు ఆమె ఈ జిల్లాలోనే తిష్ట వేయ‌నున్నారు. ఇంటింటికీ తిరిగి ప్ర‌చారం చేస్తారు. దీంతో భార‌తి వివేకా హ‌త్య‌ను ప్ర‌స్తావిస్తారా?  ఒక వేళ ప్ర‌స్తావిస్తే.. ఏం చెబుతారు?  సొంత మ‌ర‌ద‌లు. ష‌ర్మిల‌ను ఆమె టార్గెట్ చేస్తారా? అనేవి చ‌ర్చ‌కు వ‌స్తున్నాయి.


ష‌ర్మిల‌ను టార్గెట్ చేయ‌డం వ‌ల్ల‌.. భార‌తి లేనిపోని అంశాల‌ను కెలుక్కున్న‌ట్టే అవుతుంద‌నే చ‌ర్చ సాగుతోంది. అలా కాకుండా.. అస‌లు ఈ విష‌యాన్ని తెలియ‌న‌ట్టే వ‌దిలేసి.. ప‌థ‌కాలు.. జ‌గ‌న్ ఇమేజ్‌.. కూటమి పార్టీల ఎత్తుగ‌డ‌లు.. ఒక్క‌డిని చేసి ఇంత మంది వ‌స్తున్నార‌నే అంశాల‌ను ఆమె ప్ర‌స్తావించే అవ‌కాశం ఎక్కువ‌గా ఉంద‌ని వైసీపీ కీల‌క నాయ‌కులు అంచ‌నా వేస్తున్నారు. ఏదేమైనా క‌డ‌ప గ‌డ‌ప‌లో భార‌తి ప్ర‌చారం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇక‌, ప్ర‌స్తుతం వేసుకున్న షెడ్యూల్ ప్ర‌కారం.. భార‌తి.. బ‌స్సు యాత్ర‌, రోడ్ షో.. గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు తిర‌గ‌నున్నారు. మ‌రి ఏమేర‌కు ఆమె ప్ర‌భావం చూపిస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: