ఏపీ సీఎం జ‌గ‌న్‌పై జ‌రిగిన రాయి దాడి ఘ‌ట‌న రాష్ట్ర వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన విష‌యం తెలిసిం దే. విజ‌య‌వాడ శివారులో జ‌రిగిన ఈ ఘ‌ట‌న వ్య‌క్తిగ‌తంగా జ‌గ‌న్కు ఇబ్బందే. అదేస‌మ‌యంలో ప్ర‌తిప‌క్షాలు లేవనెత్తే అనేక ప్ర‌శ్న‌ల‌కు కూడా ఆయ‌న స‌మాధానం చెప్పాల్సి ఉంటుంది. శ‌త్రుదుర్భేధ్యంగా ఉండే సీఎం ప‌ర్య‌ట‌న‌లో ఇలా ఆక‌తాయిలు వ‌చ్చారంటే.. రాళ్లు రువ్వారంటే కార‌ణం ఏంట‌నేది పైనుంచి కింది స్తాయి వ‌ర‌కు అంద‌రినీ జ‌వాబు దారి చేసేదే.


సీఎం జ‌గ‌న్‌పై కాబ‌ట్టి స‌రిపోయింది.. అదే ప్ర‌తిప‌క్ష నాయ‌కులపై ఇదే త‌ర‌హా దాడి జ‌రిగి ఉంటే.. రాష్ట్రం లో శాంతి భ‌ద్ర‌త‌ల వ్య‌వ‌హారం.. దేశంలోనే చ‌ర్చ‌గా మారిపోయి ఉండేది. కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి ఫిర్యా దుల‌పై ఫిర్యాదులు వెళ్లేవి. స‌రే.. ఈ విష‌యం ఎలా ఉన్నా.. ఇప్పుడు జ‌గ‌న్‌పై దాడిని వైసీపీకి సానుభూతి ఓట్లు రాలుస్తుందా?  ఈదిశ‌గా వైసీపీ కూడా ప్ర‌చారం చేస్తుందా? అనేది ప్ర‌శ్న‌. 2019 ఎన్నిక‌ల‌కు ముందు ఇలానే కోడిక‌త్తి దాడి జ‌రిగింది.


దానిని ఎన్నిక‌ల్లో వినియోగించుకున్నారు. ఇక‌, ఇప్పుడు రాయి దాడి. దీంతో ఈ విష‌యాన్ని కూడా ఎన్నిక ల్లో సానుభూతి కోసం వాడుకుంటారా? అనేది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌. అయితే.. ఇదే క‌నుక జ‌రిగితే వైసీపీకి మంచి క‌న్నా చెడే ఎక్కువ‌గా వ‌స్తుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇన్నాళ్లుగా ప్ర‌జ‌ల కోసం చేసిన ప‌థ‌కాలు, కార్య‌క్ర‌మాలు అన్నీ తెర‌మ‌రుగు అయిపోయి.. ఇప్పుడు కేవ‌లం సానుభూతి రాజ‌కీయం న‌మ్ముకుంటే.. ప‌రిస్థితి బాగుండ‌ద‌నే అంచ‌నాలు కూడా వ‌స్తున్నాయి.


కానీ, మ‌రోవైపు.. మాజీ మంత్రుల నుంచి మంత్రుల వ‌ర‌కు కూడా.. జ‌గ‌న్‌పై జ‌రిగిన రాయి దాడిని.. సానుభూతి కోణంలోనే ప్ర‌చారం చేస్తున్నారు. అంతేకాదు.. దున్న‌ ఈనిందంటే..  అన్న‌ట్టుగా ఈ ఘ‌ట‌న‌ను టీడీపీ పైనా నెట్టేస్తున్నారు. ఇది రాజ‌కీయాల్లో స‌హ‌జ‌మేఅయినా.. ఎన్నిక‌ల‌కు ముందు మాత్రం ఆచితూచి వ్య‌వ‌హ‌రించాలి. ఇలా చేయ‌డం స‌రికాద‌నే వాద‌న ఉంది. సానుభూతి క‌న్నా.. ఎన్ని దెబ్బ‌లు తిన్నా.. తాను ప్ర‌జ‌ల్లోనే ఉంట‌న్నాన్న స్ఫూర్తిని తీసుకువెళ్తేనే మేలు జ‌రుగుతుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

మరింత సమాచారం తెలుసుకోండి: