ఏపీలో రాజకీయాలు రోజురోజుకూ రసవత్తరంగా మారుతున్నాయి. అధికార పక్షం వైసీపీ వ్యూహాలకు ప్రతిపక్షాలు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నాయి. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఏర్పడకుండా పెద్ద ఎత్తున విమర్శలు చేసిన వైసీపీ ఇప్పటికే ఎన్నికల ప్రచార రంగంలోకి దూకింది. ఆ పార్టీ అధినేత, సీఎం వైఎస్ జగన్ రాష్ట్రం అంతా బస్సు యాత్ర చేస్తున్నారు. ఇక ఏపీలో అభ్యర్థుల నామినేషన్లు దాఖలు చేయడానికి కేవలం 2 రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఈ తరుణంలో ప్రస్తుత ఎన్నికల్లో అందరి దృష్టిని జనసేన పార్టీ ఆకర్షిస్తోంది. జనసేనతో కలిసి కూటమిగా ఏర్పడ్డాకే టీడీపీ మరింత బలం పుంజుకుందనేది వాస్తవం. ఇక కూటమి కోసం ఎలాంటి త్యాగాలకు అయినా సిద్ధపడతానని ప్రకటించిన పవన్ కళ్యాణ్ చివరికి మాట మీద నిలిచాడు. తాను తక్కువ ఎమ్మెల్యే సీట్లు, ఎంపీ సీట్లు తీసుకున్నప్పటికీ బీజేపీ కోసం మరింత తగ్గాడు. తనకు కేటాయించిన కొన్ని సీట్లను బీజేపీకి పవన్ అందించాడు. అయితే తాము పోటీ చేస్తున్న 21 ఎమ్మెల్యే సీట్లు, 2 ఎంపీ సీట్లలో ఖచ్చితంగా గెలవాలని పవన్ టార్గెట్ పెట్టుకున్నారు. ఇదిలా ఉండగా మే 13న ఏపీలో పోలింగ్ జరగనుంది. అయితే ఏప్రిల్ 18న అంటే కేవలం రెండు రోజుల్లో నామినేషన్ల పర్వం ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు.

ఏపీలో ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులకు నామినేషన్లు సమర్పించడానికి తుది గడువు ఈ నెల 25. అదే రోజున వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ పులివెందులలో తన నామినేషన్ సమర్పించనున్నారు. ఇక టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు కూడా అదే రోజు తమ నామినేషన్ వేయనున్నారు. పిఠాపురం నుంచి పోటీలో ఉన్న పవన్ కళ్యాణ్ కూడా ఈ నెల 25న తన నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ నేపథ్యంలో తమ పార్టీ అభ్యర్థులందరికీ మంగళగిరిలోని జనసేన ప్రధాన కార్యాలయంలో బీఫారాలను పవన్ కళ్యాణ్ అందించనున్నారు. పాలకొండ-నిమ్మక జయకృష్ణ, నెల్లిమర్ల- లోకం మాధవి, విశాఖపట్నం సౌత్- వంశీకృష్ణ యాదవ్, అనకాపల్లి- కొణతాల రామకృష్ణ, పెందుర్తి- పంచకర్ల రమేష్ బాబు, యలమంచిలి- సుందరపు విజయ్ కుమార్, కాకినాడ రూరల్- పంతం నానాజీ, రాజానగరం- బత్తుల బలరామకృష్ణ, పి.గన్నవరం- గిడ్డి సత్యనారాయణ, రాజోలు- దేవ వరప్రసాద్, నిడదవోలు- కందుల దుర్గేష్, భీమవరం- పులపర్తి రామాంజనేయులు, తాడేపల్లిగూడెం- బొలిశెట్టి శ్రీనివాస్‌, ఉంగుటూరు- పత్సమట్ల ధర్మరాజు, నరసాపురం- బొమ్మిడి నాయకర్‌, పోలవరం- చిర్రి బాలరాజు, అవనిగడ్డ- మండలి బుద్ధప్రసాద్, తెనాలి- నాదెండ్ల మనోహర్, తిరుపతి- ఆరణి శ్రీనివాసులు, రైల్వే కోడూరు- అరవ శ్రీధర్ ఎమ్మెల్యే అభ్యర్థులుగా ఉన్నారు. కాకినాడ నుంచి ఉదయ్ శ్రీనివాస్, మచిలీపట్నం నుంచి వల్లభనేని బాలశౌరి ఎంపీలుగా పోటీ చేయనున్నారు. వీరంతా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ చేతులు మీదుగా బీఫారాలు తీసుకోనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: