ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలకు సరిగ్గా 25 రోజుల సమయం మాత్రమే ఉంది. సరిగ్గా ప్రచారానికి కేవలం మూడు వారాల సమయం మాత్రమే ఉంది. తెలుగుదేశం, వైసీపీ కొన్ని హామీలను ప్రకటిస్తున్నా ఆ హామీలు ఏపీ ప్రజలను పూర్తిస్థాయిలో సంతృప్తిపరచడం లేదు. ఏపీ ప్రజలు కోరుకుంటున్న హామీలు కొన్ని ఉండగా ఆ హామీలను నెరవేర్చే సీఎం అభ్యర్థి ఉన్నారా అనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
 
ఏపీలోని చాలా పల్లెలలో నేటికీ సరైన తాగునీటి వసతి లేదు. చాలా ప్రాంతాలలో ప్రజలు డబ్బులు చెల్లించి మరీ మినరల్ వాటర్ కొనుక్కుంటున్న పరిస్థితులు ఉన్నాయి. టీడీపీ హయాంలో ఏపీలోని పలు ప్రాంతాల్లో మినరల్ వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేసి 2 రూపాయలకే మినరల్ వాటర్ అందించడం జరిగింది. అయితే పూర్తిస్థాయిలో రాష్ట్రవ్యాప్తంగా ప్రజలందరికీ స్వచ్చమైన నీరు అందేలా హామీ ప్రకటిస్తే బాగుంటుందని ప్రజలు భావిస్తున్నారు.
 
సంవత్సరం సంవత్సరానికి పంటల పెట్టుబడులు అంతకంతకూ పెరుగుతున్నాయి. రైతుభరోసా, అన్నదాత లాంటి స్కీమ్స్ కు బదులుగా ఎరువులు, పురుగుమందులు తక్కువ ధరకే లభించేలా సరికొత్త పథకాలను అమలులోకి తెస్తే వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగించే వాళ్ల జీవితాలు మారిపోతాయి.
 
రాష్ట్రంలోని చాలామంది విద్యార్థులకు ప్రైవేట్ పాఠశాలల్లో చదవాలని ఉన్నా వేర్వేరు కారణాల వల్ల చదవడం లేదు. అమ్మఒడి తరహా స్కీమ్స్ ద్వారా వస్తున్న డబ్బులను చాలా కుటుంబాలలో వ్యక్తిగత ఖర్చులకు వాడుకుంటున్నారు. ఏ పేరుతో ఈ స్కీమ్ అమలు చేసినా విద్యార్థులకు చదువు కోసమే ఆ డబ్బు ఖర్చు అయ్యేలా అడుగులు వేస్తే పిల్లల భవిష్యత్తుకు బెనిఫిట్ కలుగుతుంది.
 
వ్యాపార రంగంలో విజయం సాధించాలనే కోరిక యువతలో చాలామందిలో ఉన్నా పెట్టుబడి సమస్య వల్ల వెనక్కు తగ్గుతున్నారు. తక్కువ వడ్డీకే రుణాలు అందేలా రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త స్కీమ్స్ ను అమలు చేస్తే వ్యాపార రంగంలో రాణించాలని భావించే వాళ్లు సొంతకాళ్లపై నిలబడే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.
 
ఏపీలో అందుబాటులో ఉన్న మద్యం బ్రాండ్ల వల్ల ఎంతోమందికి కొత్త ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. ప్రజల ఆరోగ్యానికి హాని చేసే బ్రాండ్లను అందుబాటులోకి ఉంచకుండా అడుగులు వేస్తే మంచిది. అందుబాటులో ఉన్న బ్రాండ్స్ వల్ల కాలేయ సంబంధిత సమస్యలతో ఆస్పత్రులలో చేరే వారి సంఖ్య పెరుగుతోంది.
 
రెండు తెలుగు రాష్ట్రాలలో కోట్ల సంఖ్యలో మహిళలు డ్వాక్రా గ్రూప్ లలో ఉన్నారు. అయితే లోన్ పొందిన సమయంలో, ఏవైనా స్కీమ్స్ అమలవుతున్న సమయంలో కొంతమంది రిసౌర్స్ పర్సన్ లు వాళ్ల నుంచి కొంత మొత్తాన్ని కమిషన్ రూపంలో పొందుతున్నారు. ప్రభుత్వం నుంచి వేతనాలు పొందుతూ గ్రూప్ సభ్యుల నుంచి కమీషన్ కోరే ఆర్పీల విషయంలో కఠినంగా వ్యవహరిస్తే డ్వాక్రా మహిళలు పూర్తిస్థాయిలో బెనిఫిట్స్ పొందుతారు.
 
ఏపీలోని యువతలో చాలామంది స్టార్టప్ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నారు. ఇలాంటి వాళ్లను ప్రోత్సహిస్తే ఏపీలో తక్కువ సమయంలోనే ఎక్కువ సంఖ్యలో స్టార్టప్ కంపెనీలు ఏర్పాటయ్యే అవకాశం ఉంది. భారీ సంఖ్యలో సాఫ్ట్ వేర్ కంపెనీలు, పరిశ్రమలు ఏర్పాటు అయ్యే దిశగా అడుగులు పెడితే ఏపీ యువత ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాలపై ఆధారపడాల్సిన అవసరం లేదు.
 
ఏపీలోని కొన్ని ఏరియాలలో ఉన్న రోడ్ల వల్ల ప్రతిరోజూ ప్రయాణం చేసే ప్రయాణికులు నరకం అనుభవిస్తారు. రోడ్లకు సంబంధించిన సమస్యలను సత్వరమే పరిష్కరించి రోడ్ల వల్ల ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చేస్తే ప్రజలకు ఎంతో బెనిఫిట్ కలుగుతుంది.
 
రాష్ట్రంలో అర్హత లేకపోయినా కొంతమంది యథేచ్చగా ఉచిత పథకాలను పొందుతున్నారు. అలాంటి వారిని గుర్తించడంతో పాటు అర్హత ఉన్నా  బెనిఫిట్స్ పొందని వారికి మేలు జరిగేలా ఏపీలో అధికారంలోకి వచ్చే ప్రభుత్వం అడుగులు వేయాల్సి ఉంది.
 
ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో చదివే విద్యార్థులు బాల్యం నుంచి ఇంగ్లీష్ లో అనర్ఘళంగా మాట్లాడేలా ఏర్పాట్లు చేయాలి. ఆంగ్లంలో ప్రావీణ్యం సంపాదిస్తే ఆ విద్యార్థులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. ఏపీ ప్రజలు కోరుకుంటున్న ఈ హామీలను నెరవేర్చే సీఎం అభ్యర్థి ఉన్నారా అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: