- మెజార్టీ అసెంబ్లీ సీట్ల‌లో కూట‌మికే ఆధిక్యం
- రాజ‌ధాని మార్పు ప్ర‌భావం వైసీపీకి గ‌ట్టి ఎదురు దెబ్బే
- త‌మ్ముడు చిన్ని జోరు.. అన్న నాని బేజారే..!


( అమ‌రావ‌తి - ఇండియా హెరాల్డ్ )
ఆంధ్రప్రదేశ్ రాజధానికి అమరావతి విస్తరించి ఉన్న ఎన్టీఆర్ జిల్లాలో.. ఈసారి రాజకీయ వాతావరణం ఎలా ఉంది.. ఎవరు తమ పట్టు సాధిస్తారో.. అన్నది ఆసక్తిగా కనిపిస్తోంది. కీలకమైన విజయవాడ పార్లమెంటు సీటు నుంచి సొంత అన్నదమ్ములే పోటీ చేస్తున్నారు. వైసీపీ నుంచి నిన్నటి వరకు టీడీపీలో ఉన్న సిట్టింగ్ ఎంపీ కేసీనేని నాని, టీడీపీ నుంచి నాని తమ్ముడు కేశినేని చిన్ని పోటీలో ఉన్నారు. వైసీపీ కేటాయించిన ఏకైక కమ్మ సామాజిక వర్గ పార్లమెంటు సీటు విజయవాడ కావటం విశేషం. ఎన్టీఆర్ జిల్లాలో అధికార వైసీపీ అటు కూటమి పరిస్థితి ఎలా ఉంది ? అన్నది ఇండియా హెరాల్డ్ గ్రౌండ్ రిపోర్ట్ ప్రకారం చూస్తే కూటమికి స్పష్టమైన ఆధిక్యం కనిపిస్తోంది. రాజధాని మార్పు ప్రభావం ఎన్టీఆర్ జిల్లాలో చాలా ఎక్కువగా ఉంది.


నియోజకవర్గాల వారీగా చూస్తే విజయవాడ తూర్పులో కమ్మ సామాజిక‌ వర్గానికి చెందిన దేవినేని అవినాష్, గద్దె రామ్మోహన్ ఇద్దరి మధ్య గట్టి పోటీ ఉంది. గత రెండు ఎన్నికల్లో వరుసగా గెలిచిన టీడీపీ సీనియర్ గద్దె.. ఈసారి అవినాష్ దెబ్బకు చెమటలు కక్కుతున్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో మాత్రం బొండా ఉమాకు గెలుపు అవకాశాలు స్ప‌ష్టంగా ఉన్నాయి. వెస్ట్‌ నియోజకవర్గం వైసీపీకి పూర్తి వన్ సైడ్ గా ఉంటుందని అనుకున్నా.. అనూహ్యంగా బీజేపీ నుంచి పోటీ చేస్తున్న సుజనా చౌదరి పుంజుకున్నారు. వెస్ట్ నియోజకవర్గంలో సుజన అంచనాలకు మించి దూసుకుపోతున్నారు.దీంతో వెస్ట్ లో కూడా వైసీపీకి గెలుపు అంత సులువుగా అయితే లేదు.


మైలవరంలో వసంత కృష్ణ ప్రసాద్‌కు వ్యక్తిగతంగా కూడా మంచి పేరు ఉంది. దీనికి తోడు వైసిపి అభ్యర్థితో పోలిస్తే ఆర్థికంగా చాలా బలవంతుడు కావడం.. వర్గాలు, పార్టీలకు అతీతంగా వసంత్‌కు మంచి పేరు ఉండటంతో.. ఇక్కడ ప్రస్తుతానికి టీడీపీ లీడ్‌లో ఉంది. జగ్గయ్యపేటలో వైసీపీ అభ్యర్థి ఉదయభాను టీడీపీ అభ్యర్థి శ్రీ రామ్ తాతయ్య మధ్య హోరాహోరీ పోరు ఉన్న ప్రస్తుతానికి అయితే టీడీపీకి మొగ్గు కనిపిస్తోంది. ఇక నందిగామ నియోజకవర్గంలోనూ ఈసారి కచ్చితంగా టీడీపీ గెలుస్తుంది అన్న అంచనాలే ఎక్కువగా వినిపిస్తున్నాయి.


ఒక్క తిరువూరు నియోజకవర్గంలో మాత్రం వైసీపీకి కాస్త ఆధిక్యత కనిపిస్తోంది. వైసీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాసు.. టీడీపీ నుంచి అమరావతి జేఏసీలో కీలకంగా వ్యవహరించిన గుంటూరు జిల్లాకు చెందిన కొలికిపూడి శ్రీనివాసరావు పోటీ చేస్తున్నారు. స్వామిదాస్‌కు తిరువూరు కొట్టినపిండి. పైగా లోకల్.. కొలికిపూడిది నాన్ లోకల్. కొలికిపూడి అనుకున్న స్థాయిలో టీడీపీ శ్రేణులతో సమన్వయం చేసుకో వడం లేదన్న విమర్శలు తీవ్రంగా ఉన్నాయి. ఇటు పార్లమెంటు వరకు చూసుకున్న కేశినేని నానికి వ్యక్తిగత ఇమేజ్ ఉన్నా కూడా పార్లమెంటు పరిధిలో కూటమి బలంగా ఉండటం.. రాజధాని మార్పు ప్రభావం వైసీపీ ప్రభుత్వం వచ్చాక నగరం అనుకున్న స్థాయిలో అభివృద్ధి చెందకపోవడం లాంటి కారణాలతో ఇక్కడ జనాలు కూటమి ఎంపీ అభ్యర్థి చిన్ని వైపు చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: