- మంత్రి అప్ప‌లరాజుతో ఢీ అంటే ఢీ అంటోన్న శిరీష‌
- గౌతు వార‌సురాలిగా.. సింపుల్ విమెన్‌గా మంచి క్రేజ్‌
- ఈ సారి గెలిస్తేనే రాజ‌కీయ భ‌విష్య‌త్తు..!

( ఉత్త‌రాంధ్ర - ఇండియా హెరాల్డ్ )

రాజకీయాల్లో సుదీర్ఘ చరిత్ర ఉన్న కుటుంబం. ఉత్తరాంధ్రలో తాతల కాలం నుంచి రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబమే. తాత, తండ్రి నుంచి రాజకీయ వారసత్వాన్ని కాదని తనదైన శైలిలో దూసుకెళ్తున్నారు. ఓ మహిళగా రాణిస్తున్న ఆమె గౌతు శిరిష. స్వాతంత్ర్య సమరయోధుడు సర్థార్‌ గౌతు లచ్చన్న మనవరాలిగా, మాజీ మంత్రి గౌతు శ్యామ్‌ సుందర్‌ శివాజీ రాజకీయ వారసత్వం ఆమె సొంతం. 1948 నుంచి శ్రీకాకుళం జిల్లా సోంపేట నియోజకవర్గాన్ని ఏకఛత్రాధిపతిగా ఏలిన కుటుంబం. 2009లో నియోజకవర్గాల పునర్‌ విభజన కారణంగా సోంపేట రద్దు కావటంతో.. పలాస నియోజకవర్గానికి మారాల్సి వచ్చింది. 2014 ఎన్నికల్లో గౌతు శివాజీ గెలిచారు.


వయోభారం కారణంగా రాజకీయాల నుంచి శివాజీ తప్పుకోవడంతో... తెరపైకి వచ్చారు శిరీష. ఉత్తరాంధ్రలో అత్యంత సాధారణ జీవితం గడుపుతున్న నేతల్లో శిరీష ఒకరనే చెప్పాలి. తొలిసారి 2019లో ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసిన శిరీష... అనూహ్యంగా ఓడిపోయారు. ఆ తర్వాత ఆమెపై ప్రస్తుత మంత్రి సీదిరి అప్పల్రాజు ఎన్నో ఆరోపణలు చేశారు. అక్రమ కేసులు కూడా పెట్టారు. ఇవన్నీ తట్టుకుని నిలబడటమే కాకుండా... ప్రతి ఆరోపణను కూడా ధీటుగానే జవాబిచ్చారు శిరీష.


ప్రస్తుత ఎన్నికల్లో మరోసారి పలాస నుంచే శిరీష పోటీ చేస్తున్నారు. అయితే ఈసారి మాత్రం అనుకున్నంత ఈజీగా శిరీషకు టికెట్‌ దక్కలేదు. పొత్తులో భాగంగా ఈ స్థానాన్ని జనసేన పార్టీకి కేటాయించాలని ముందుగా భావించారు. డాక్టర్‌ దానేటి శ్రీధర్‌ ను అభ్యర్థిగా జనసేన పార్టీ ప్రచారం కూడా చేసింది. అయితే పలాస టికెట్‌ విషయంలో చివ‌ర‌కు చంద్ర‌బాబు గౌతు వార‌స‌త్వంకు ప్రాధాన్య‌త ఇవ్వాల‌ని నిర్ణ‌యించారు. దీనికి తోడు శిరీషకు తొలి నుంచి అండగా నిలిచిన రామూ... టికెట్‌ కోసం కూడా అంతే ప్రయత్నం చేశారు. చివరికి పలాస ఎన్నికల బరిలో నిలిచారు శిరీష.


ప్రస్తుత వైసీపీ అభ్యర్థి, మంత్రి సీదిరి అప్పల్రాజు శిరీష కుటుంబ సభ్యులపై విమర్శలు చేస్తున్నారు. దీనిని టీడీపీ నేతలు సమర్థంగా తిప్పికొడుతున్నారు. పోటీ చేస్తున్న అభ్యర్థిలో తప్పుల్లేవు కాబట్టే కుటుంబ సభ్యులపై ఆరోపణలు చేస్తున్నారని విమర్శిస్తున్నారు. దీంతో వైసీపీ నేతలు కాస్త ఇరుకున పడినట్లు అయ్యింది. మహిళపై గతంలో సీదిరి అప్పల్రాజు చేసిన వ్యాఖ్యలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సౌమ్యురాలిగా గుర్తింపు తెచ్చుకున్న శిరీషను అప్పల్రాజు దుర్భాషలాడటం వైసీపీకి మైనస్‌గా మారింది.


మరోవైపు శిరీషకు ఎంపీ రామ్మోహన్ నాయుడు అండ కూడా మెండుగానే ఉంది. దీనికి తోడు అప్ప‌ల్రాజు కు చిన్న వ‌య‌స్సులోనే ఎమ్మెల్యే, మంత్రి ప‌ద‌వి వ‌స్తే ఆయ‌న సద్వినియోగం చేసుకోలేదని.. రాజ‌కీయంగా తీవ్ర‌మైన అవినీతి ఆరోప‌ణ‌ల్లో కూరుకుపోయార‌న్న విమ‌ర్శ‌లు ఇటు టీడీపీలోను.. అటు రాజ‌కీయ వ‌ర్గాల్లోనూ ఉన్నాయి. గ‌త ఎన్నిక‌ల్లో ఓడిన సానుభూతి కూడా శిరీష‌కు మెండుగా ఉండ‌డంతో ఇవ‌న్నీ క‌లిసొచ్చి రాబోయే ఎన్నికల్లో శిరీష గ‌ట్టి పోటీలో అయినా గెలుస్తుంద‌నే అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: