- ఏలూరు బ‌రిలో పుట్టా Vs కారుమూరు
- ఇద్ద‌రూ బీసీ యాద‌వ కులం యువ‌కులే..!
- ర‌స‌వ‌త్త‌ర పోరుకు వేదిక‌గా ఏలూరు పార్ల‌మెంటు సీటు

( గోదావ‌రి - ఇండియా హెరాల్డ్ )
రాష్ట్రంలోని 25 పార్లమెంటు స్థానాల్లో అధికార, ప్రతిపక్ష పార్టీల నుంచి అనేక మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. కానీ, ఏలూరు పార్లమెంటు స్థానంలో మాత్రం తొలిసారి అధికార, ప్రతిపక్ష పార్టీల నుంచి వారసులు. పైగా తొలిసారి రాజకీయాల్లోకి వచ్చిన యువ నేతలు ఢీ అంటే ఢీ అనేలా. తలపడుతున్నారు. పైగా ఇద్దరూ బీసీ సామాజికవర్గానికి చెందినవారే కావడం. ఇరువురి కుటుంబాలకు సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉండడం, ఆర్థికంగా బలంగా ఉండడం వంటివి ఏలూరు రాజకీయాల్లోనే కాదు.. రాష్ట్ర రాజకీయాల్లోనే ఆసక్తిగా మారింది.


గతంలో ఉద్ధండులు
ఏలూరు నియోజకవర్గానికి ప్రత్యేకత ఉంది. ఇక్కడ నుంచి దిగ్గజ నాయకులు గెలిచి పార్లమెంటులో గళం వినిపించారు. కావూరి సాంబశివరావు, మాగంటి వెంకటేశ్వరరావు(బాబు), బోళ్ల బుల్లిరామయ్య, ఘట్టమనేని కృష్ణ(సినిమా హీరో) వంటి హేహాహేమీ నాయకులు ఇక్కడ ప్రాతినిధ్యం వహించారు. తొలినాళ్లలో అంటే 1952-1962 మధ్య జరిగిన మూడు ఎన్నికల్లో రెండు సార్లు ఇక్కడ నుంచి కమ్యూనిస్టులు కూడా గెలుపు గుర్రం ఎక్కారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ పంజుకోవడంతో రెండు దశాబ్దాల పాటు ఈ పార్టీనే ఇక్కడ విజయం దక్కించుకుంది. అభ్యర్థులు ఎవరైనా కాంగ్రెస్ కే ఇక్కడి ప్రజలు జై కొట్టారు.


తర్వాత టీడీపీ ఆవిర్భావం అనంతరం.. ఏలూరు ఓటర్లు టీడీపీవైపు మొగ్గు చూపించారు. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ తన ప్రభావం చూపించిం ది. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన 2014లో జరిగిన తొలి ఎన్నికల్లో టీడీపీ గెలిచింది. అప్పటికే కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వచ్చిన మాగంటి వెం కటేశ్వరరావు(బాబు) విజయం దక్కించుకున్నారు. ఇక, 2019 ఎన్నికలకు వచ్చే సంకి వైసీపీ హవా ఇక్కడ స్పష్టంగా కనిపించింది. రాజకీయ వారసుడిగా, రంగంలోకి దిగిన మాజీ మంత్రి కోటగిరి విద్యాధరరావు తనయుడు కోటగిరి శ్రీధర్ విజయం సాధించారు.


ఇక, ప్రస్తుతం జరుగుతున్న 2024, లోక్సభ ఎన్నికల్లో అధికార పార్టీ వైసీపీ నుంచి, కూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి బరిలో ఉన్న ఇద్దరు అభ్యర్థులు కూడా వారసులే కావడం గమనార్హం. ఇద్దరూ ఒకే బీసీ సామాజిక వర్గానికి (యాద‌వ) చెందిన వారు కావడం మరింత ఆసక్తిగా మారింది.

పుట్టా మహేశ్
టీడీపీ నుంచి ఏలూరు పార్లమెంటు అభ్యర్థిగా ఉన్న పుట్టా మహేశ్ యాద‌వ్‌కు ఘనమైన వారసత్వం ఉంది. ఈయన తండ్రి పుట్టా సుధాకర్ యాదవ్ టీడీపీ సీనియర్ నాయకుడు. గత చంద్రబాబు హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి చైర్మన్ గా పనిచేశారు. అంతకు ముందు ఉమ్మడి కడప జిల్లాలోని మైదుకూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 2014, 2019 ఎన్నికల్లో టీడీపీ తరఫున సుధాకర్ యాదవ్ పోటీ చేశారు. అయితే, ఆయన రెండు సార్లూ పరాజయం పాలయ్యారు. ప్రస్తుత ఎన్నికల్లోనూ ఆయన టీడీపీ అభ్యర్థిగా మైదుకూరు నుంచి అదృష్టం పరీక్షించుకుంటున్నారు. సుధాకర్ కుమారుడు మహేశ్ యాదవ్ తొలిసారి ఏలూరు పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఈయన టీడీపీ దిగ్గజ నాయకుడు యనమల రామకృ ష్ణుడుకు అల్లుడు కావడం గమనార్హం.


కలిసి వచ్చే అంశాలు.
+ చంద్రబాబు ప్రచారం, పార్టీలో ఐక్యత, మాగంటి బాబు వంటి సీనియర్ల సహకారం, బీసీ ట్యాగ్ కూటమి పార్టీల దన్ను,  మాజీ మంత్రి యనమల రామకృష్ణుడి వ్యూహాలు,  వైసీపీ ఎంపీ కోటగిరి శ్రీధ‌ర్‌పై ఉన్న వ్యతిరేకత, వైసీపీలో చీలకలు, అసంతృప్తి కూడా పుట్టాకు ప్లస్ కానుంది.


కారుమూరు సునీల్
వైసీపీ నుంచి ఏలూరు అభ్యర్థిగా బరిలో ఉన్న కారుమూరు సునీల్ కుమార్ యాదవ్ తండ్రి కారుమూరు నాగేశ్వరరావు సీనియర్ రాజకీయ నాయకుడు. ప్రస్తుత ప్రభుత్వంలో మంత్రి కూడా. ఈ కుటుంబానికి కూడా సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉంది. కారుమూరి గ‌తంలో ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా జ‌డ్పీచైర్మ‌న్‌గా ప‌నిచేయ‌డంతో పాటు ద్వార‌కాతిరుమ‌ల జ‌డ్పీటీసీగా ప‌నిచేశారు. త‌ర్వాత దెందులూరు నుంచి అసెంబ్లీకి కూడా పోటీ చేశారు. అలాగే ఆయ‌న త‌ణుకు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వరుసగా రెండోసారి.. ఓవ‌రాల్‌గా మూడో పోటీ చేస్తుండగా ఈయన కుమారుడు సునీల్ ఏలూరు పార్లమెంటు బరిలో ఉన్నారు.


కలిసి వచ్చే అంశాలు
+ స్థానికత అంశం
+ తండ్రి నాగేశ్వరరావు ఇమేజ్

మరింత సమాచారం తెలుసుకోండి: