టీడీపీ ప్రధాన కార్యదర్శి మంగళగిరిలో ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. గత ఎన్నికల్లో ఎదురైన ఓటమిని పక్కన పెట్టి, ఐదేళ్లుగా స్థానిక ప్రజల్లోనే ఆయన ఉన్నారు. దీంతో ప్రజల మద్దతు ఆయనకు పెరిగింది. ఈ క్రమంలో పలు సర్వేల్లోనూ ఆయన గెలుస్తారనే నివేదికలు వచ్చాయి. ఈ తరుణంలో ఆయన తన నియోజకవర్గం మంగళగిరి మండలంలోని ఎర్రబాలెంలో బుధవారం పర్యటించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా అక్కడి ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన అధికార పక్షం వైసీపీపై ఆయన విరుచుకుపడ్డారు. రాజధానిని వైసీపీ సర్వనాశనం చేసిందని అన్నారు. ఈ ప్రాంత ప్రజలకు తాము అండగా ఉంటామని హామీనిచ్చారు. రాష్ట్ర రాజధానిగా అమరావతి నిలిచిపోతుందన్నారు.


ఇక్కడి ప్రజల త్యాగం వృథా కాబోదని, అమరావతి ప్రజల రాజధానిగా నిలిచిపోతుందని పేర్కొన్నారు. ఏపీ సీఎం వైఎస్ జగన్‌ను విధ్వంసకర పాలకుడిగా అభివర్ణించిన లోకేష్.. అమరావతి, పోలవరం ప్రాజెక్టులను పూర్తిగా నాశనం చేశారని మండిపడ్డారు. ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అనేది తమ నినాదమని, అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో అమరావతి పనులు మళ్లీ చేపట్టి భూములు త్యాగం చేసిన రైతులకు బకాయిలు కూడా యుద్ధ ప్రాతిపదికన చెల్లిస్తామన్నారు. ఈ తరుణంలో ఆయన వైసీపీకి సవాల్ విసిరారు. అమరావతి ప్రజలను ఓట్లు అడిగే దమ్ము ఉందా అని ప్రశ్నించారు. అయితే ఆయన సవాలుకు వైసీపీ నుంచి ఇంకా జవాబు రాలేదు.అమరావతిని రాజధానిగా కొనసాగించడం వైసీపీకి ఇష్టం లేదన్నారు. రాజధాని ఇక్కడే ఉంటుందని నమ్మించి ఆళ్ల రామకృష్ణారెడ్డి గెలిచారన్నారు. అయితే ప్రజలందరి ఆశలను ఆయన వమ్ము చేశారన్నారు. యువతను, మహిళలను, రైతులను వైసీపీ నమ్మించి మోసం చేసిందన్నారు. ఓట్లు అడగడానికి వచ్చే వైసీపీ నేతలను ప్రజలంతా నిలదీయాలని పిలుపునిచ్చారు. అమరావతిని రాజధానిగా కొనసాగించాలని కోరిన మహిళలను పోలీసులు బూటు కాళ్లతో తన్నారని, వారిని హింసించారని గుర్తు చేశారు. ధైర్యంగా జగన్ పర్యటించలేకపోతున్నారని, పరదాలు కట్టుకుని సచివాలయానికి వెళ్తున్నారని విమర్శించారు. ఈ ప్రాంతంలో ఇసుక, మట్టి, కంకర మొత్తం దోచుకున్నారన్నారు. పెద్ద దొంగను ఆదర్శంగా తీసుకుని, చిన్న దొంగలు ఇలా చేశారన్నారు. భూములిచ్చిన రైతులతో పాటు కౌలు రైతుల సమస్యలను తాము పరిష్కరిస్తామన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే అమరావతి ప్రాంత యువతకు ఉపాధి కల్పిస్తామని భరోసానిచ్చారు. పేదలకు పక్కా ఇళ్లను టీడీపీ కూటమి ప్రభుత్వం నిర్మించి ఇస్తుందన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: