ఏపీలో ఓ వైపు ఎన్నికల్లో నామినేషన్ల పర్వం ముగింపునకు వచ్చింది. త్వరలో ఎన్నికలు కూడా జరగనున్నాయి. ఈ సమయంలో కూడా ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి వలసలు పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు టికెట్లు దక్కని నేతలు వేరే పార్టీల్లోకి జంప్ చేసేశారు. ఆయా పార్టీల నుంచి టికెట్లు తీసుకుని ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. నామినేషన్లు ముగిసిన తర్వాత కూడా అసంతృప్త నేతలు వేరే పార్టీల్లోకి జంప్ చేసేస్తున్నారు. ఇది ప్రజల్లో ఆశ్చర్యం కలిగిస్తోంది. అయితే ఈ పరిణామాలు పార్టీల్లో ఆందోళనకు గురి చేస్తున్నాయి. అసంతృప్త నేతలు భారీగా ఓట్లను చీల్చితే ఖచ్చితంగా అది గెలుపోటములపై ప్రభావం చూపుతాయన్నది సుస్పష్టం. దీంతో వివిధ పార్టీల్లోకి జంపింగ్‌లను చూసి అంతా నివ్వెరబోతున్నారు. ఇక ఏపీలో గెలుపే లక్ష్యంగా టీడీపీ దూసుకుపోతోంది. ఈ తరుణంలో కడప జిల్లాలో ఆ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే, కమలాపురం నియోజకవర్గం కీలక నేత వీర శివారెడ్డి పార్టీ మారారు. సీఎం జగన్ సమక్షంలో పులివెందులలో గురువారం ఆ పార్టీలో చేరారు. ఇది ఏపీ రాజకీయాల్లో, ముఖ్యంగా కడప రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

కమలాపురం నియోజకవర్గానికి పార్టీ అభ్యర్థిగా పుత్తా కృష్ణ చైతన్య రెడ్డిను టీడీపీ అధిష్టానం ఎంపిక చేసింది. అయితే ఇక్కడి నుంచి వీర శివా రెడ్డి పోటీ చేయాలని భావించారు. టికెట్ తనకు దక్కకపోవడంతో ఆయన అసంతృప్తిని బాహాటంగానే వెల్లడించారు. ఈ తరుణంలో ఆయన పార్టీ మారారు. అయితే ఆయన రాజకీయ ప్రస్థానాన్ని 1994లో టీడీపీ నుంచే ఆయన ప్రారంభించారు. ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లో ఆయన తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం 1999 ఎన్నికల్లో ఆయన పరాజయం పాలయ్యారు. అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి మైసూరా రెడ్డి ఆయనపై గెలిచారు. ఇక 2004లో ఆయన టీడీపీ నుంచి మరోసారి పోటీ చేసినా విజయం దక్కలేదు. అనంతర పరిణామాల్లో ఆయన వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2009 ఎన్నికల్లో కమలాపురం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. ఏపీ విభజన తర్వాత 2014, 2019 ఎన్నికల్లో ఆయన పోటీ చేయలేదు. 2019లో ఆయన వైసీపీలో చేరారు. అయితే అక్కడ ఆయనకు టికెట్ దక్కలేదు. దీంతో తనకు ప్రాధాన్యత దక్కలేదని భావించి టీడీపీలో చేరారు. తిరిగి ఆయన వైసీపీ గూటికి చేరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: