టీడీపీ బీజేపీ జనసేన కూటమి ఈరోజు ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటన చేసింది. రేపటి ఆకాంక్షలను సాకారం చేసేలా మేనిఫెస్టోను రూపొందించామని చంద్రబాబు ప్రకటించారు. మేనిఫెస్టోలో సామాజిక భద్రత పింఛన్లను భారీగా పెంచేశారు. ఇప్పటికే పింఛన్ పొందుతున్న వృద్ధులు, వితంతువులకు పింఛన్ 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలకు పెంచుతున్నామని చంద్రబాబు వెల్లడించారు.
 
దివ్యాంగుల పింఛన్ ను ఏకంగా 6,000 రూపాయలకు పెంచుతున్నట్టు బాబు హామీ ఇచ్చారు. పూర్తిస్థాయిలో వైకల్యానికి గురైన వారికి నెలకు ఏకంగా 15,000 రూపాయల పింఛన్ అందజేస్తామని చంద్రబాబు పేర్కొన్నారు. కిడ్నీ, తలసీమియా వ్యాధులతో బాధ పడుతున్న వాళ్లకు ప్రయోజనం చేకూరేలా నెలకు 10,000 రూపాయల పింఛన్ ను అందిస్తామని చంద్రబాబు వెల్లడించారు. ఇప్పటికే అమలవుతున్న పథకాలను తొలగించకుండా బాబు కొత్త హామీలను ప్రకటించడం గమనార్హం. 50 ఏళ్లు దాటిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లింలకు పింఛన్ అందిస్తామని చంద్రబాబు సంచలన ప్రకటన చేశారు.

పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలకు బెనిఫిట్ కలిగేలా చంద్రబాబు మేనిఫెస్టోను రూపొందించారు. గృహ నిర్మాణానికి గ్రామాలలో 3 సెంట్ల స్థలం ఇస్తామని పట్టణాలలో 2 సెంట్ల స్థలం మంజూరు చేస్తామని బాబు పేర్కొన్నారు. ఇప్పటికే ఇంటి పట్టాలు పొందిన వాళ్లకు ప్రభుత్వం నుంచి పక్కా ఇళ్లను మంజూరు చేసి ఇంటి నిర్మాణాలను పూర్తి చేస్తామని చంద్రబాబు పేర్కొన్నారు.
 
ప్రభుత్వ ఉద్యోగులు అనుకూల వాతావరణంలో పని చేసేలా చర్యలు తీసుకుంటామని సీపీఎస్, జీపీఎస్ విధానాన్ని పునః సమీక్షించి ఆమోద్యయోగ్యమైన పరిష్కారానికి కృషి చేస్తామని బాబు తెలిపారు. మెరుగైన పీఆర్సీ అమలు చేయడంతో పాటు ఒకటో తారీఖునే ఉద్యోగులకు జీతాలు అందిస్తామని చంద్రబాబు పేర్కొన్నారు. వాలంటీర్ల గౌరవ వేతనం 10,000 రూపాయలకు పెంచుతామని బాబు ప్రకటించారు. తక్కువ జీతాలు పొందే ప్రభుత్వ ఉద్యోగులకు సైతం పథకాలు అందేలా చూస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. పెన్షనర్స్ కార్పొరేషన్ ఏర్పాటు దిశగా చర్యలు తీసుకుంటామని కూటమి నుంచి స్పష్టమైన హామీ లభించింది. పాత పథకాలను సైతం పునరుద్ధరిస్తామని బాబు పేర్కొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: