ఏపీలో ఒక‌ప్పుడు కోడి పందేలు మాత్ర‌మే అంద‌రికీ సుప‌రిచితం. అది కూడా.. సంక్రాంతి మూడు రోజుల పాటు మాత్ర‌మే సాగేది. త‌ర్వాత‌.. త‌ర్వాత‌.. క్రికెట్‌బెట్టింగులు తెర‌మీదికి వ‌చ్చాయి. ఇవి కూడా అయిపో యిన త‌ర్వాత‌.. రాజ‌కీయాల‌కు బెట్టింగులు పాకాయి. దీంతో ఎప్పుడు ఎన్నిక‌లుజ‌రిగినా.. ఇటీవ‌ల కాలంలో పందేలు క‌ట్ట‌డం ప్రారంభ‌మైంది. 2019లో రాప్తాడు నుంచి పోటీ చేసిన‌.. ప‌రిటాల శ్రీరాం గెలుపు కంటే కూడా మెజారిటీపై పందెం క‌ట్టిన‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి.


అయితే..ఆ ఎన్నిక‌ల్లో ఆయ‌న ఓడిపోయారు. దీంతో పందెం రాయుళ్లు చేతులు కాల్చుకున్నారు. అయితే .. గ‌త ఎన్నిక‌ల్లో కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల‌కే అది కూడా ఒక‌టి రెండు నియోజ‌క‌వ‌ర్గాల‌కే ప‌రిమిత‌మైన పందేలు ఇప్పుడు మాత్రం 6 నుంచి 7 నియోజ‌క‌వ‌ర్గాలకు పాకింది. వీటిలో అత్యంత హాట్‌టాపిక్‌గా ఉన్న పిఠాపురంలో రూ.50 కోట్ల రూపాయ‌ల వ‌ర‌కు పందేలు కట్టిన‌ట్టు తెలిసింది. ఇక్క‌డ కూడా ప‌వ‌న్ క‌ల్యాణ్ గెలుస్తాడ‌ని కాకుండా.. ఆయ‌న‌కు వ‌చ్చే మెజారిటీపైనే పందేలు క‌ట్టారు.


ఇక‌, మంగ‌ళ‌గిరిలో నారా లోకేష్ బ‌రిలో ఉన్న విష‌యం తెలిసిందే. ఆయ‌న గెలుపు స‌హా మెజారిటీపై పందేలు క‌ట్టిన‌ట్టు స‌మాచారం. ముఖ్యంగా మంగ‌ళ‌గిరిపై హైద‌రాబాద్‌లో ఉన్న వారు పందేలు క‌ట్ట‌డం ఈ ద‌ఫా ఆస‌క్తిక‌ర విష‌యంగా మారింది. తాజా అంచ‌నాల ప్ర‌కారం.. ఇక్క‌డ కూడా 50 కోట్ల రూపాయ‌ల వ‌ర‌కు పందేలు క‌ట్టుకున్నట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. అలానే కుప్పం, పులివెందుల నియోజ‌క‌వ‌ర్గాల‌పై కూడా ఈ సారి పందేలు క‌ట్ట‌డం విశేషం.


దీనికి ప్ర‌ధాన కార‌ణం.. పులివెందుల‌లో ష‌ర్మిల ప్ర‌చారం కార‌ణంగా సీఎం జ‌గ‌న్‌కు మెజారిటీ త‌గ్గుందని.. అదేవిధంగా కుప్పంపై వైసీపీ ప్ర‌త్యేకదృష్టి పెట్టి.. చంద్ర‌బాబును ఓడించాల‌ని ప్ర‌య‌త్నించిన నేప‌థ్యం లో ఇక్కడ‌ కూడా మెజారిటీ త‌గ్గుతుంద‌ని లెక్క‌లు వేసుకున్న పందెం రాయుళ్లు బెట్టింగులు క‌ట్ట‌న‌ట్టు స‌మాచారం. ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ 10 కోట్ల లోపు పందేలు క‌ట్టిన‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇక‌, న‌గ‌రి, హిందూపురం, అన‌కాప‌ల్లి పార్ల‌మెంటు, విజ‌య‌వాడ పార్ల‌మెంటు ప‌రిధిలోనూ పందేలు జోరుగా సాగాయి. మ‌రి ఎవ‌రు గెలుస్తారో.. ఎవ‌రు ఓడ‌తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: