గత వైసీపీ ప్రభుత్వంలో మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత రోజా సెల్వమణి పర్యాటక శాఖ మంత్రిగా పనిచేశారు. ఆమె తిరుగులేని మహిళా రాజకీయ నాయకురాలిగా గత ఐదేళ్లు రాజ్యమేలారు. వైఎస్‌ జగన్‌ తరఫున మాట్లాడుతూ టీడీపీ వారిని తీవ్రంగా విమర్శించారు. ఈసారి ఎన్నికల్లో ఆమె నగరి నుంచి పోటీ చేసి ఏకంగా 45 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. అయితే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడుపై ఆమె చేసిన వ్యాఖ్యలను టీడీపీ, జనసేన మద్దతుదారుల మర్చిపోలేదు. ఆమె చేసిన విమర్శలకు రెట్టింపు విమర్శలు చేస్తున్నారు. రోజాను బాగా టార్గెట్ చేస్తున్నారు.

కొత్త ప్రభుత్వం కొలువుదీరిన నేపథ్యంలో గత ప్రభుత్వ అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడతాయని భావిస్తున్నారు. ఇదిలా ఉంటే, ‘ఆడుదాం ఆంధ్రా’, ‘సీఎం కప్‌’ వంటి స్పోర్ట్స్ ఈవెంట్‌ల ద్వారా 100 కోట్ల అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలపై రోజాపై సీఐడీ విచారణ చేపట్టే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. గత ప్రభుత్వం నిర్వహించిన ఈ క్రీడా కార్యక్రమాలకు టూరిజం మంత్రిగా రోజా నాయకత్వం వహించారు.

తాజా నివేదికల ప్రకారం, క్రీడలకు సంబంధించిన అవకతవకలపై రోజా, సాప్ మాజీ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డిలపై ఆట్యా పట్యా అసోసియేషన్ సీఈవో ఆర్డీ ప్రసాద్ సీఐడీకి ఫిర్యాదు చేశారు. నిధులు ఎలా వినియోగించారు, స్పోర్ట్స్‌ కోటా కింద విద్యా సీట్ల కేటాయింపుపై సమగ్ర విచారణ జరిపించాలని, ఈ సంస్థల్లో పనిచేసిన అధికారులందరిపై విచారణ జరిపించాలని ఫిర్యాదులో కోరారు. సంబంధిత రికార్డులను స్వాధీనం చేసుకుని సమగ్ర విచారణ చేపట్టాలని ఫిర్యాదుదారులు సీఐడీని కోరారు.

టూరిజం మంత్రిగా ఉన్న సమయంలో మంత్రి కోటాలో కేటాయించిన టీటీడీ టిక్కెట్లను రోజా అమ్ముకున్నారని ఇప్పటికే పలు ఆరోపణలు ఉన్నాయి. ఆమె తన అనుచరులతో కలిసి తరచూ తిరుమలకు వెళ్లే విషయం తెలిసిందే. ఈ ప్రత్యేక దర్శన టిక్కెట్ల ద్వారా ఆమె సొమ్ము చేసుకుంటున్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఈ ఆరోపణల్లో నిజం ఎంతుందో తేలాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: