వైయస్ జగన్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారని.. అనంతరం జరిగే ఉప ఎన్నికలలో ఆయన కడప నుంచి లోక్సభకు పోటీ చేస్తారని గట్టిగా ప్రచారం జరుగుతుంది. గత మూడు, నాలుగు రోజులుగా తెలుగు సోషల్ మీడియాలోనూ, మెయిన్ మీడియాలోనూ ఇదే విషయంపై ఒకటే చర్చ జరుగుతుంది. జగన్ పులివెందుల అసెంబ్లీకి, అవినాష్ రెడ్డి కడప పార్లమెంటుకు రాజీనామా చేస్తారని.. అనంతరం జరిగే ఉప ఎన్నికలలో జగన్ కడప నుంచి ఎంపీగా పోటీ చేస్తే.. పులివెందుల నుంచి తన తల్లి వై.ఎస్. విజయలక్ష్మిని అసెంబ్లీ బరిలో దింపుతారంటూ ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రచారంపై వైసీపీ ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. అయితే జగన్ బాబాయి రాజ్యసభ సభ్యులు వై.వి. సుబ్బారెడ్డి మాత్రం చిన్న సంకేతాలు అయితే ఇచ్చారు.


ఒంగోలులో మీడియాతో మాట్లాడిన ఆయన.. వైసీపీ ఉప ఎన్నికల వ్యూహాన్ని పూర్తిగా ఖండించలేదు. జగన్ రాజీనామా పై వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవం అని చెప్పిన సుబ్బారెడ్డి.. ఒకవేళ రాజీనామా చేయాల్సిన పరిస్థితి అయితే లేదని అంటూనే.. రాజీనామా చేయాల్సిన పరిస్థితి లేనప్పుడు అలాంటి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఏముంటుందని ప్రశ్నించారు. అయితే సుబ్బారెడ్డి ఉద్దేశం ప్రకారం అలాంటి పరిస్థితి ఇప్పుడు రాలేదు. ఒకవేళ తర్వాత వస్తుందని కావచ్చు. అయితే జగన్ కూడా ఈ రాజీనామా విషయంలో ఇప్పటికప్పుడు నిర్ణయం తీసుకోకపోవచ్చు. అలాంటి పరిస్థితి కల్పించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటారని కూడా ఒక ప్రచారం అయితే వైసీపీ వర్గాల్లోనే నడుస్తోంది.


ఏదైనా ఒక ఓదార్పు యాత్ర ప్లాన్ చేసుకోవడం తర్వాత తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని.. అసెంబ్లీకి వెళ్లకుండా డుమ్మా కొట్టడం ఇవన్నీ చేస్తారని.. ఆ తర్వాత ఆరు నెలలకు.. లేదా ఏడాదికో ఆయన ఉప ఎన్నికల వ్యూహాన్ని తెరమీదకు తీసుకురావచ్చు అని అంటున్నారు. ఏది ఏమైనా ఏపీలో ఇంత ఘోర ఓటమి తర్వాత కేవలం 11 మంది ఎమ్మెల్యేలతో అసెంబ్లీకి వెళ్లి రాజకీయం చేసేందుకు జగన్‌కు ఈగో బాగా అడ్డు వస్తోంది. అందుకే ఆయన రాజీనామా చేసి.. ఎంపీగా పోటీ చేసి.. తాను గెలిచానని నిరూపించుకుని.. వైసీపీ కార్యకర్తల్లో జోష్ నింపి.. ఢిల్లీకి వెళ్లాలనుకుంటున్నారట. మరి జగన్ రాజకీయ వ్యూహాలు ఎంతవరకు ఫలిస్తాయో..? చూడాలి. ఒకవేళ జగన్ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తారన్న విషయం అధికారికంగా నిర్ధారణ అయితే.. కడపలో వెంటనే ఇతర పార్టీల స్పెషల్ ఆపరేషన్లు మొదలవుతాయి. వారికి ఛాన్స్ ఇవ్వకూడదని ఉద్దేశంతో జగన్ పోటీపై నాంచుతున్నట్టు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: