అంతర్జాతీయ ఆర్థిక రేటింగ్ సంస్థ మూడీస్ లెక్కల ప్రకారం, యుద్ధాన్ని తట్టుకునే శక్తి పాకిస్థాన్‌కు బొత్తిగా లేదు. దేశ ఖజానా ఎప్పుడో అడుగంటింది. నిత్యావసరాలైన తిండి గింజల నుంచి పెట్రోల్ వరకు దిగుమతులపైనే ఆధారపడే పాక్‌కు విదేశీ మారక నిల్వలు అత్యంత కీలకం. కానీ ఇప్పుడున్న నిల్వలు కేవలం మూడు నెలల దిగుమతులకు కూడా సరిపోవంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. యుద్ధం వస్తే అదనపు నిధులు కావాలి, కానీ అప్పులిచ్చే నాథుడే కరువయ్యాడు. అంతర్జాతీయ ఆర్థిక సమాచార సంస్థ సీఈఐసీ లెక్కల ప్రకారం, డిసెంబర్ 2024 నాటికి పాకిస్థాన్ అప్పు ఏకంగా 131 బిలియన్ డాలర్లకు చేరనుంది. మొన్నటికి మొన్న మళ్ళీ అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) కాళ్ల మీద పడింది అప్పు కోసం.
పాకిస్థాన్ జీడీపీలో అప్పుల వాటా ఇప్పటికే 75 శాతానికి చేరుకుని, ప్రపంచంలోనే అప్పుల కుప్పగా ముద్రపడింది. పేదరికం, నిరుద్యోగం, వైద్య సేవల కొరత వంటి సామాజిక సమస్యలు దేశాన్ని పట్టి పీడిస్తున్నాయి. వీటిని పరిష్కరించడానికే దిక్కుతోచని స్థితిలో ఉన్న పాకిస్థాన్, యుద్ధ సన్నాహాలు చేయడం అనేది కలలో కూడా ఊహించలేని విషయం. మరోవైపు, బయటి నుంచి నిధులు సమకూర్చుకునే మార్గాలు కూడా మూసుకుపోయాయి.
ఇప్పటికే ఇతర దేశాల నుంచి తీసుకున్న అప్పులు తీర్చలేక సతమతమవుతున్న పాక్, యుద్ధ భారాన్ని మోయడం అసాధ్యం. పరిమిత స్థాయిలో ఘర్షణలు జరిగినా, పాకిస్థాన్‌కు అంతులేని నష్టం వాటిల్లుతుందని అంచనా. ప్రపంచంలోనే అత్యధిక వృద్ధిరేటుతో దూసుకుపోతున్న భారత్‌తో యుద్ధం, అధిక ద్రవ్యోల్బణంతో ఉక్కిరిబిక్కిరవుతున్న పాకిస్థాన్‌కు ఏమాత్రం శ్రేయస్కరం కాదని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు.
• దేశంలో అంతర్యుద్ధం... అదుపుతప్పుతున్న పరిస్థితులు:
ఆర్థిక కష్టాలకు తోడు... రాజకీయంగా, సామాజికంగా కూడా పాకిస్థాన్‌లో పరిస్థితి అదుపు తప్పుతోంది. బలూచిస్థాన్‌లో రగులుతున్న వేర్పాటువాద సెగలు ప్రభుత్వానికే కాకుండా, సైన్యానికి కూడా పెను సవాల్ విసురుతున్నాయి. తరచూ దాడులతో ఆ ప్రాంతంలో అదనపు బలగాలను మోహరించాల్సి వస్తోంది, దీనివల్ల ప్రజాధనం భారీగా ఖర్చవుతోంది. ఇటీవల జాఫర్ ఎక్స్‌ప్రెస్ హైజాక్ ఘటనతో ఆ ప్రాంతంపై ప్రభుత్వ పట్టు సడలినట్లు స్పష్టమవుతోంది. అటు ఆఫ్ఘనిస్థాన్‌లోని తాలిబన్ ప్రభుత్వంతోనూ పాక్‌కు సఖ్యత కొరవడింది. మరోవైపు, సింధు నదిపై కొత్త కాలువల నిర్మాణానికి వ్యతిరేకంగా సింధ్‌లో ఉద్రిక్తతలు పెరిగిపోతున్నాయి. మొత్తంగా పాకిస్థాన్ ఒకరకమైన అంతర్యుద్ధ పరిస్థితులను ఎదుర్కొంటోంది.
• సైనికుల దీనస్థితి...
దేశ భద్రతకు కీలకమైన రక్షణ వ్యవస్థను బలోపేతం చేసుకునే పరిస్థితి కూడా లేదు. ఆర్థిక, సామాజిక పరిస్థితులు సైన్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఇప్పటికే సరిహద్దుల్లో మోహరించిన సైనికులకు సరైన తిండి దొరకడం లేదని, వారికి అవసరమైన కిరోసిన్, పెట్రోల్ కూడా అందించలేని దుస్థితి నెలకొందని తెలుస్తోంది. పరిమిత వసతులతో, భారత్ వంటి శక్తివంతమైన దేశాన్ని ఎక్కువ కాలం ఎదుర్కోలేమని పాక్ రక్షణ నిపుణులే తేల్చేస్తున్నారు.
ఒకవేళ యుద్ధం 14 రోజుల పాటు కొనసాగితే, భారత్ సుమారు 2.50 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తే... పాకిస్థాన్ కూడా అదే స్థాయిలో ఆర్థిక వనరులను వినియోగించాల్సి ఉంటుందని ముంబైకి చెందిన స్ట్రాటజిక్ ఫోర్‌సైట్ గ్రూప్ విశ్లేషించింది. ఇది జరిగితే, పాకిస్థాన్‌పై కోలుకోలేని భారం పడుతుంది. మరోవైపు, ఉద్రిక్తతలు పెరిగితే భారత్‌పైనా ఆర్థిక భారం పడుతుంది, దేశ ఆర్థిక సామర్థ్యంలో సుమారు 3 శాతం నష్టం వాటిల్లుతుందని అంచనా.
కాబట్టి, యుద్ధమనే ఊబిలోకి దిగితే పాకిస్థాన్ పతనం ఖాయమన్నది నిపుణుల మాట కాదు, కళ్ల ముందు కనిపిస్తున్న కఠోర వాస్తవం.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి