
ఎలాన్ మస్క్ అగ్రస్థానంలో : టెస్లా, స్పేస్‌ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ మరోసారి ప్రపంచ కుబేరుల జాబితాలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నారు. జూన్‌తో పోలిస్తే ఆయన సంపద 16 బిలియన్ డాలర్లు తగ్గినప్పటికీ, ఇప్పటికీ ఆయన సంపద విలువ ఇతరులను అధిగమించి మొదటి స్థానంలో నిలిచింది. టాప్-10 బిలియనీర్లు ఎవరు ? : ప్రపంచ కుబేరుల జాబితాలో రెండో స్థానంలో ఒరాకిల్ సహవ్యవస్థాపకుడు లారీ ఎలిసన్ నిలిచారు. ఒరాకిల్ షేర్లు 32% పెరగడంతో ఆయన నాలుగో స్థానం నుంచి రెండో స్థానానికి దూసుకెళ్లారు. మూడో స్థానంలో మెటా (ఫేస్‌బుక్) వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్ (247.9 బిలియన్ డాలర్లు), నాలుగో స్థానంలో అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ (236.8 బిలియన్ డాలర్లు) ఉన్నారు.
ఐదో స్థానంలో ఎల్‌వీఎంహెచ్ అధినేత బెర్నార్డ్ ఆర్నాల్ట్ (147.7 బిలియన్ డాలర్లు), ఆరో స్థానంలో గూగుల్ సహవ్యవస్థాపకుడు లారీ పేజ్ (146.2 బిలియన్ డాలర్లు) నిలిచారు. ఏడో స్థానంలో బెర్క్‌షైర్ హాత్‌వే అధినేత వారెన్ బఫెట్ (143.1 బిలియన్ డాలర్లు), ఎనిమిదో స్థానంలో మైక్రోసాఫ్ట్ మాజీ ఎగ్జిక్యూటివ్ స్టీవ్ బామర్ (141.3 బిలియన్ డాలర్లు), తొమ్మిదో స్థానంలో గూగుల్ సహవ్యవస్థాపకుడు సెర్గీ బ్రిన్ (139.7 బిలియన్ డాలర్లు), పదో స్థానంలో ఎన్‌విడియా అధినేత జెన్సెన్ హువాంగ్ (137.9 బిలియన్ డాలర్లు) ఉన్నారు.
ఆసియా నుంచి ఒకే ఒక్కడు : 100 బిలియన్ డాలర్ల క్లబ్‌లో చోటు సంపాదించిన ఏకైక ఆసియా వ్యాపారవేత్త రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ. 116 బిలియన్ డాలర్ల సంపదతో ఆయన 15వ స్థానంలో నిలిచారు. టాప్-10 బిలియనీర్లలో తొమ్మిది మంది అమెరికన్లే కావడం గమనార్హం. మైక్రోసాఫ్ట్ సహవ్యవస్థాపకుడు బిల్ గేట్స్ సంపద 7 రోజుల్లోనే దాదాపు 30% తగ్గడంతో టాప్-10 జాబితా నుంచి జారిపోయారు. అలాగే భవిష్యత్తు బిలియనీర్లు ఎవరు ? అనే దానిపై కూడా సాంకేతిక రంగం ఇంకా శక్తివంతంగా మారుతున్న నేపథ్యంలో, AI, సెమీకండక్టర్స్, క్లౌడ్ కంప్యూటింగ్ రంగాల్లో ఉన్న వ్యాపారవేత్తలు వచ్చే సంవత్సరాల్లో టాప్ ర్యాంకులను సొంతం చేసుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి .