
మల్లన్న మీడియా ముందుకు వచ్చి, "బీసీలకు కేవలం రిజర్వేషన్లు కాదు, రాజ్యాధికారం కావాలి. వారి సమస్యలపై పోరాటానికి ప్రత్యేక వేదిక కావాలి. అందుకే కొత్త పార్టీ," అంటూ బిగ్ అనౌన్స్‌మెంట్ ఇచ్చారు. అయితే, పార్టీ పేరు మరియు ప్రారంభ తేదీ విషయంలో మాత్రం సస్పెన్స్ కొనసాగించారు . బీఆర్‌ఎస్ నేత కవిత చేసిన బీసీ రిజర్వేషన్ల వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన మల్లన్న, ఆమెపై తీవ్ర విమర్శలు గుప్పించారు. దీనికి ప్రతిగా జాగృతి కార్యకర్తలు మల్లన్న కార్యాలయంపై దాడికి పాల్పడ్డారు. ఇది తెలంగాణలో బీసీ రాజకీయాలు మరో మలుపు తిప్పినట్లయింది. ఇది మల్లన్న తొలిసారి పార్టీ ప్రకటించడమేం కాదు. 2023 ఎన్నికల ముందు “తెలంగాణ నిర్మాణ పార్టీ (TNP)” పేరుతో పార్టీ ప్రకటించారు .
యువత, బీసీలు , ఎస్సీలకు ప్రాధాన్యత అని చెప్పినా – ఆ ప్రయత్నం ప్రాక్టికల్ రాజకీయాల్లో నిలదొక్కుకోలేకపోయింది. కాంగ్రెస్ తరఫున గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత కొన్నాళ్ల పాటు మల్లన్న పార్టీ లైన్లోనే ఉన్నారు. కానీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వం పై కుల గణన అంశంపై చేసిన విమర్శలు పెద్ద వివాదంగా మారాయి. రెడ్డి సామాజిక వర్గానికి అనుకూలంగా గణన జరుగుతోందన్న వ్యాఖ్యలు - పార్టీ సీనియర్లను తీవ్రంగా బాధించాయి. ఫలితంగా మల్లన్నపై అభ్యంతరాలు పెరిగాయి. అదే ఆయన రాజకీయ వైఖరిని మార్చే దిశగా నడిపింది. మల్లన్న కొత్త పార్టీ నిజంగానే రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభిస్తుందా ? లేక మళ్లీ ప్రచార పటాకా మాత్రమా ? బీసీ వర్గం ఈ ప్రయత్నానికి స్పందిస్తుందా ? ఇప్పట్లో రాష్ట్ర రాజకీయాల్లో మల్లన్న కొత్త చర్చకు తెరదీసిన మాట వాస్తవం.