ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అంశం మళ్లీ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ నాయకులు అమరావతి రాజధానిని తీవ్ర విమర్శలకు గురి చేస్తూ, రైతుల ఉద్యమాలను అణచివేశార‌న్న విమ‌ర్శ‌లే త‌ర‌చూ వినిపించాయి. మూడు రాజధానుల సిద్ధాంతాన్ని ముందుకు తెచ్చి ఐదు సంవత్సరాలు కాలం గడిపేసి, అమరావతిని స్మశానంతో పోల్చడం, దయ్యాల రాజధాని అని వ్యాఖ్యలు చేయడం వంటి విషయాలు వారికి చేదు జ్ఞాపకాలుగా మారాయి. ఆ కాలంలో రైతులపై లాఠీచార్జ్ చేయడం, నిర్మాణాలు నిలిపివేయడం, ఇప్పటికే ప్రారంభమైన ప్రాజెక్టులను సగం దాకా ఆపివేయడం వల్ల అమరావతి ఒక అడవి ప్రాంతంలా మారిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా కూటమి ప్రభుత్వం అమరావతిని వ్యూహాత్మకంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాలు ప్రారంభించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతిని కేవలం రాజధానిగానే కాకుండా ప్రత్యేక మహానగరంగా... ప్రత్యేక జిల్లాగా అభివృద్ధి చేయాలన్న ఆలోచనలో ఉన్నారు.


దీంతో వచ్చే ఎన్నికల నాటికి అమరావతి ప్రధాన అజెండాగా మారే అవకాశం ఉన్నట్టు రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ నాయకులు అమరావతి పై స్పందించే తీరు వారికి తిరిగి ప్రతికూల ప్రభావం చూపేలా మారింది. ప్రస్తుతం సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి నేతలు "మళ్లీ అధికారంలోకి వస్తే అమరావతి నుంచే జగన్ పాలన సాగిస్తాడు" అని చెబుతున్నా, ప్రజలు దానిని సీరియస్‌గా తీసుకోవడం లేదు. ఎందుకంటే మొదటినుంచే వైసీపీ అమరావతికి వ్యతిరేకంగా నిలిచి, విశాఖపట్నాన్ని రాజధానిగా చేస్తామని ప్రకటించడం, మూడు రాజధానులను తెరమీదకు తేవడం, రైతుల ఉద్యమాలను అణిచేయడం వంటి చర్యలు ప్రజల్లో బలంగా గుర్తింపబడ్డాయి. ఇప్పుడు మాత్రం "అమరావతిలోనే ఉంటాం కానీ కేవలం రాజధానిగానే చూస్తాం" అనే వ్యాఖ్యలు చేసినా, అవి ప్రజలకు మరింత విరుద్ధంగా అనిపిస్తున్నాయి.


రైతులు అనేక ఇబ్బందులు పడటానికి, అమరావతి ప్రాజెక్టు వాయిదా పడటానికి, ఖర్చు పెరగటానికి వైసీపీనే ప్రధాన కారణమని ప్రజల్లో చర్చ నడుస్తోంది. ఇలాంటి సమయంలో మళ్లీ అమరావతి గురించి స్పందించడం వల్ల వైసీపీకి మేలు జరిగేది లేదు. పరిశీలకుల అభిప్రాయం ప్రకారం, భవిష్యత్తులో అయినా వైసీపీ నాయకులు అమరావతి విషయంపై ఎంత తక్కువ మాట్లాడితే వారికి అంత ఎక్కువ లాభం ఉంటుందని, ఎన్నికల సమయం నాటికి పరిస్థితులను బట్టి స్పందించడం మేలని సూచిస్తున్నారు. అందువల్ల అమరావతి అంశంలో వైసీపీకి మాటల కంటే మౌనం మెరుగ్గా మారే పరిస్థితి ఏర్పడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: