నందమూరి బాలకృష్ణ... కేవలం సినీ నటుడిగా మాత్రమే కాదు, తెలుగుదేశం పార్టీ (టీడీపీ) వ్యవస్థాపకులు ఎన్టీఆర్ తనయుడిగా, హిందూపురం నియోజకవర్గం నుంచి మూడుసార్లు గెలిచిన శాసనసభ్యుడిగా తెలుగు రాజకీయాల్లో ఆయనకంటూ ఒక ప్రత్యేక స్థానం ఉంది. అంతేకాదు, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు వియ్యంకుడిగా, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు మామగా పార్టీలో ఆయనకున్న 'ట్యాగులు' అన్నీ ఇన్నీ కావు. అయితే, ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో, ఇతర సందర్భాల్లో ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో, కూటమి భాగస్వాముల్లో కలకలం రేపినప్పుడు టీడీపీ అగ్ర నాయకత్వం నుంచి, ముఖ్య నేతల నుంచి ఆయనకు అండగా నిలిచే మద్దతు కొరవడుతోందనే చర్చ ఇప్పుడు పెద్ద ఎత్తున నడుస్తోంది. "పార్టీ కోసం ఇంత కష్టపడుతున్న బాలయ్యకు నేతలు అండగా నిలవడం లేదా?" అని ఆయన అభిమానులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అసెంబ్లీలో "సైకో" వ్యాఖ్యలు ... నష్ట నివారణ చర్యలు: ఇటీవల అసెంబ్లీలో నందమూరి బాలకృష్ణ, మాజీ ముఖ్యమంత్రి జగన్‌ను ఉద్దేశించి "సైకోగాడు" అంటూ చేసిన ఘాటు వ్యాఖ్యలు, సినీ నటుడు చిరంజీవిపై చేసిన పరోక్ష వ్యాఖ్యలు అప్పట్లో హాట్ టాపిక్‌గా మారాయి. కూటమి రాజకీయాల నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ఇబ్బందులు సృష్టించవచ్చని భావించిన చంద్రబాబు అలర్ట్ అయినట్లు, పవన్ కళ్యాణ్‌ను పరామర్శించడం, బాలకృష్ణ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించేలా చర్యలు తీసుకోవడం ద్వారా కొంత నష్ట నివారణ చర్యలు చేపట్టారని కథనాలు వచ్చాయి. ఈ సమయంలో బాలకృష్ణకు అండగా నిలిచింది కేవలం సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాత్రమేనని వార్తలు వచ్చాయి. మిగిలిన నేతల మౌనం బాలయ్య ఫ్యాన్స్‌ను కలచివేసింది. జగన్ తాజా విమర్శలు... టీడీపీ నేతల మౌనం: తాజాగా, వైసీపీ అధినేత జగన్ సైతం నందమూరి బాలకృష్ణను టార్గెట్ చేస్తూ "అసెంబ్లీకి తాగి వచ్చాడంటూ" సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ తీవ్రస్థాయి వ్యాఖ్యలు బాలయ్య అభిమానుల ఆగ్రహానికి కారణమయ్యాయి.

కల్తీ మద్యం, ఇతర అంశాలపై జగన్ చేసిన విమర్శలకు టీడీపీ నేతలు, మంత్రులు వెంటనే రియాక్ట్ అయినప్పటికీ, బాలకృష్ణ వ్యక్తిగత అంశంపై చేసిన ఈ తీవ్రమైన కామెంట్స్‌ విషయంలో మాత్రం ఏ ఒక్కరూ నోరు మెదపడానికి సాహసించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. మౌనం వెనుక బలమైన కారణం ఉందా? టీడీపీలో అత్యంత ముఖ్యమైన వ్యక్తికి, ముఖ్యమంత్రికి వియ్యంకుడికి, లోకేశ్‌కు మామకు ఇంతటి మద్దతు కరవవడం వెనుక బలమైన కారణం ఉండి ఉంటుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. పార్టీలో నందమూరి కుటుంబానికి సంబంధించిన అంతర్గత సమీకరణాలు లేదా ఇతర వ్యూహాత్మక అంశాలు ఏమైనా ఉన్నాయా అనే చర్చ నడుస్తోంది. చంద్రబాబు, లోకేశ్ విదేశీ పర్యటన నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఈ వ్యవహారంపై ఏదైనా స్పష్టత వచ్చే అవకాశం ఉందని అభిమానులు, పార్టీ శ్రేణులు ఎదురుచూస్తున్నారు. బాలయ్య అభిమానులు మాత్రం, పార్టీకి ఆయన చేస్తున్న సేవకు తగిన మద్దతు లభించడం లేదనే ఆవేదనతో ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: