’ఏపిలో టీడీపీది ముగిసిన అధ్యాయం’ అంటూ బీజేప ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధనరెడ్డి  ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఇటు వైసీపీ అటు టీడీపీలపై విరుచుకుపడ్డారు. తెలుగుదేశంపార్టీకి కొత్త రాష్ట్ర అధ్యక్షునిగా నియమితులైన కింజరాపు అచ్చెన్నాయుడు టార్గెట్ గా విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా విష్ణు మాట్లాడుతూ టీడీపీ నేతలపై చేసిన వ్యాఖ్యలు డ్యామేజింగ్ గానే ఉన్నాయి. టీడీపీ జాతీయ పార్టీయో లేకపోతే జాతి పార్టీయా అన్న విషయంలో అందరికీ మంచి క్లారిటి ఉందని ఎద్దేవా చేశారు. ఎందుకంటే చాలా సందర్భాల్లో చంద్రబాబునాయుడుతో పాటు నేతలు+ఎల్లోమీడియా వ్యవహరిస్తున్న తీరుతో తెలుగుదేశంపార్టీ కేవలం జాతి పార్టీ మాత్రమే అని ఎల్లోమీడియాను జాతి మీడియా అని సోషల్ మీడియాలో నెటిజన్లు చెండాడేస్తున్న విషయం అందరు చూస్తున్నదే.




’టీడీపీలో అచ్చెన్నాయుడు కొత్తగా ఉద్యోగంలో చేరాడు’ అని గాలి తీసేశారు. అచ్చెన్నాయుడు పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా కొత్తగా నియమితుడైన విషయాన్ని దృష్టిలో పెట్టుకునే విష్ణు పై విధంగా కామెంట్ చేసినట్లు తెలిసిపోతునే ఉంది. కొత్తగా ఉద్యోగంలో చేరిన అచ్చెన్న కూడా మాకు సలహాలు ఇచ్చేవాడేనా అంటూ గాలి తీసేశాడు. కొత్త బిచ్చగాడు పొద్దెరగడన్నట్లుగా అచ్చెన్న మాట్లాడుతున్నాడట. టీడీపీ ఏపిని దాటేసి తెలంగాణాలోని జూబ్లీహిల్స్, బంజారా హిల్స్ కు చేరుకుని చాలా కాలమే అయ్యిందంటూ ఇటు పార్టీని అటు చంద్రబాబునాయుడుపై ఒకేసారి విష్ణు సెటైర్ వేయటం గమనార్హం. బీజేపీకి టీడీపీ ఇచ్చే ఉచిత సలహాలు, సూచనలు అవసరమే లేదని స్పష్టగా తేల్చిచెప్పేశాడు.




టీడీపీని భుజాన మోసే శక్తి బీజేపీకి లేదంటూ విష్ణు చేసిన వ్యాఖ్యలు ఆశ్చర్యంగా ఉంది. దాదాపు రెండున్నరేళ్ళ క్రితం టీడీపీ, బీజేపీలు ప్రత్యర్ధులుగా మారిపోయాయి. మరి ఇంకా టీడీపీని భుజనా మోసే శక్తి తమకు లేదని విష్ణు కామెంట్ చేయటంలో  అర్ధమేంటి ?  ఏపిలో నిజమైన ప్రతిపక్షమంటే బీజేపీనే అని విష్ణు చెప్పటమే విచిత్రంగా ఉంది. 23 ఎంఎల్ఏలను గెలుచుకున్న టీడీపీని కాదని ఒక్క ఎంఎల్ఏ కూడా గెలుచుకోని బీజేపీ ఏ విధంగా నిజమైన ప్రతిపక్షమవుతుందో విష్ణునే చెప్పాలి. జూబ్లీహిల్స్, బంజారా హిల్స్ లో కూర్చుని చంద్రబాబు హైదరాబాద్ వరదలపై నోరు కూడా మెదపని చంద్రబాబు ఏపిలో వరదలపై మాట్లాడటమే విచిత్రంగా ఉందంటూ విష్ణు ఎద్దేవా చేశాడు.




చివరకు రూ. 50 వేల ఖరీదు చేసే పట్టుచీరలు కట్టుకుని ఉద్యమాలు చేసే మహిళా నేత కూడా బీజేపీని విమర్శించటమే ఆశ్చర్యంగా ఉందంటూ విష్ణు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. టీడీపీలో 50 వేల రూపాయల ఖరీదు చేసే పట్టుచీరలు కట్టుకునేదెవరబ్బా ? అనే ఆరాలు మొదలయ్యాయి. స్క్రోలింగ్ వీరుడు ఉదయం ఆరున్నరకే లేచి ముఖ్యమంత్రికి లేఖలు రాస్తాడు అని ఎవరిని ఉద్దేశించి విష్ణు వ్యాఖ్యలు చేశాడో అర్ధం కావటం లేదు. మరొకరు తామే మేధావి అన్నట్లుగా మాట్లాడుతాడు అని కూడా విష్ణు కామెంట్ చేశాడు. మరి ఈ కామెంట్ ఎవరిని ఉద్దేశించి చేసింది మాత్రం తెలియలేదు.  మొత్తం మీద చంద్రబాబు, టీడీపీ, నేతలను ఉద్దేశించి విష్ణు

చేసిన తాజా కామెంట్లు సంచలనంగా మారిందన్నది మాత్రం వాస్తవం.






మరింత సమాచారం తెలుసుకోండి: