దేవాసురులు పాల సముద్రాన్ని మథించినప్పుడు అమృతం జనించిన శుభమూహూర్తమే ఈ విజయదశమి. శ్రవణా నక్షత్రంతో కలసిన ఆశ్వీయుజ దశమికి విజయ అనే సంకేతం ఉంది. అందుకనే దీనికి విజయదశమి అనే పేరు వచ్చింది. తిథి, వారం, వర్జ్యం, తారాబలం, గ్రహబలం, ముహూర్తం మొదలైనవి చూడకుండా, విజయదశమి నాడు ప్రారంభించిన పనిలో విజయం తథ్యమని 'చతుర్వర్గ చింతామణి' అనే ఉద్గ్రంథం ఆశ్వీయుజ శుక్ల దశమినాటి నక్షత్రోదయ వేళనే 'విజయం' అని తెలిపింది. ఆ పవిత్ర సమయం సకల వాంఛితార్థ సాధకమైందని గురువాక్యం.

తెలంగాణాలో విజయదశమికి ముందు బతుకమ్మ పండుగను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. దీనిని పువ్వుల పండుగగా వర్ణిస్తారు. లోంగిళ్లలో పచ్చని తోరణాలు, వాకిట ఇంద్ర ధనస్సును తలపించే రంగవల్లికలు, పసుపు, కుంకుమ, పూల నివేదనలు సిద్ధంచేసి, వాటిని 'పిరమిడ్' ఆకారంలో పేర్చి ఆ శిఖరంపై బతుకమ్మ (గౌరిదేవి)ని ఉంచుతారు. మహిళలు వీటి చుట్టూ ప్రదక్షిణ చేసి, పాటలు పాడుతూ నివేదనచేసి, ఆ పూల బతుకమ్మను సమీప నదిలోగాని చేరువలోగాని ఉద్వాసన చేస్తారు.అలాగే విజయదశమి రోజు మహిళలు బొమ్మల కొలువు తీర్చిదిద్ది ముత్తైదువులను పిలిచి వారిని వాయినాలతో సత్కరిస్తారు.

గతంలో ఉపాధ్యాయులు ఈ పండుగ రోజున విద్యార్థుల చేత రంగు రంగు కాగితాలు చుట్టిన విల్లంబులు చేయించి బాణం చివరిభాగాన పూమడతలో బుక్కాపూలు ఉంచేవారు. వీటితోపాటు వారి వారి ఇళ్లకు వెళ్లి బుక్కాలు చల్లిస్తూ అయ్యవారికి చాలు ఐదు వరహాలు, పిల్లలకు చాలు పప్పు బెల్లాలు అంటూ గేయాలు పాడిస్తూ వారు ఇచ్చే చిరు కానుకలు ఆనందంగా స్వీకరించేవారు. అయితే ఆ వేడుకలు నేడు కనుమరుగయ్యాయి.

దసరా ఉత్సవాలలో నేటికి రామలీలా ఆచరణలో ఉంది. రావణ కుంభకర్ణుల దిష్ట బొమ్మలను తయారుచేసి వాటిని ఒక విశాలమైన మైదానం వరకు వేషాలు ధరించిన కళాకారులతో ఊరేగింపుగా తీసుకొని వెళ్ళి రాక్షస పీడ వదిలందని భావిస్తూ బాణాసంచాతో వాటిని తగులబెడతారు.

విజయదశమి రోజు మరింత ముఖ్యమైంది శమీపూజ. శమీ వృక్షమంటే జమ్మిచెట్టు. పాండవులు అజ్ఞాతవాస కాలంలో తమ ఆయుధాలను వస్త్రంలో చుట్టి శమీ వృక్షంపై దాచారు. అజ్ఞాతవాసం పూర్తయిన వెంటనే ఆ వృక్షాన్ని పూజించి తిరిగి ఆయుధాలను పొందారు. శమీ వృక్ష రూపంలోని అపరాజితా దేవి ఆశీస్సులు పొంది కౌరవులపై విజయం సాధించారు. శ్రీరాముడు కూడా విజయదశమి రోజునే 'అపరాజితా' దేవిని పూజించి రావణ సంహారం గావించాడు. తెలంగాణాలో శమీ పూజ అనంతరం పాలపిట్టను చూసే సంప్రదాయం కూడా ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: