అయ్యప్ప.. హిందూ దేవతలలో ఒకరు. ఈయనను హరిహరసుతుడని, ధర్మశాస్త, మణికంఠుడని కూడా పిలుస్తారు. మహిషి అనే రాక్షసిని చంపి అయ్యప్ప శబరిమలైలో వెలిశాడు. కేరళలోని శబరిమలై హిందువుల ప్రధాన యాత్రా స్థలాలలో ఒకటి. శబరిమలైలో అయ్యప్పను బ్రహ్మచారిగా పూజిస్తారు. ఇక అయ్యప్ప పూజా సాంప్రదాయం అధికంగా దక్షిణ భారతదేశంలో ఉంది. అలాగే ముఖ్యంగా శబరిమలైవాసుడు.. మణికంఠుడి దర్శనం కోసం మాల ధరించిన భక్తులు ఎక్కువ‌గా పయనమవుతుంటారు.

 

ఈ యాత్రను చేయదలచిన వారు అత్యంత శ్రద్ధా భక్తులతో కొన్ని కఠోర నియమాలను పాటించాల్సి ఉంటుంది. మండల పూజకు హాజరయ్యే వారు తప్పని సరిగా 41 రోజుల పాటు దీక్ష చేపట్టాలి.  సాధారణంగా ఈయాత్రలు స్వాములు ఒక గురుస్వామి నాయకత్వంలో ఒక బృందంగా బయలు దేరి వెళతారు. ప్రతి ఒక్కరూ తమ తలపై ఇరుముడి కెట్టు ఉంచుకుని యాత్ర చేయాల్సి ఉంటుంది. అయితే ఇరుముడి ప్రాముఖ్య‌త ఏంటో చాలా మందికి తెలియ‌క‌పోవ‌చ్చు. స్వామికి సమర్పించడానికి భక్తులు తీసుకెళ్లేదే ఇరుముడి. ఇరుముడి అంటే రెండు ముళ్లు కలదని అర్థం. 

 

ఇందులో భక్తి, శ్రద్ధ అనే రెండు భాగాలు ఉంటాయి. కొత్త వస్త్రాన్ని రెండు భాగాలుగా కుట్టించి ముందు ముడిలో దేవుడికి సంబంధించి సామాగ్రి, వెనుక ముడిలో మార్గ మధ్యలో అవసరమైన సామాగ్రి, మాలికాపురత్తమ్మకు జాకెట్టు, పసుపు, కుంకుమ ఉంచుతారు. మ‌రియు ఓ కొబ్బరి కాయలో నీటిని తొలగించి, దాన్ని అవు నెయ్యితో నింపుతారు. దీని అర్థం జీవాత్మను పరమాత్మతో అనుసంధానం చేయడం. భక్తి అనే ముందు ముడిలో ఈ కొబ్బరి కాయను పెడతారు. 

 

వెనుక భాగంలో ఇతర పూజా సామాగ్రి ఉంచి ఓంకారమనే తాడుతో ముడివేస్తారు. భక్తి, శ్రద్ధ ఎక్కడ ఉంటాయో అక్కడే ఓంకారం ఉంటుందనడానికి ఇదే నిదర్శనం. కొబ్బరి కాయలో ఉంచిన నెయ్యితోనే స్వామివారికి అభిషేకం చేస్తారు. ఇక గురుస్వామి కట్టే ఇరుముడిని సాక్షాత్తూ శ్రీ అయ్యప్పస్వామి స్వరూపంగా కొలుస్తారు. ఇరుముడి కట్టే సమయంలో, దానిని శిరముపై ధరించేటప్పుడు, చివరకు సన్నిధానం చేరే వరకూ స్వామి శరణుఘోషతోనే ఇరుముడిని శిరముపై ధరించాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: