శ్రీ వేంకటేశ్వరుడు కలియుగ దైవంగా, ఏడుకొండల స్వామిగా, అనాధ నాధుడుగా, ఆర్త జన దీక్షాదక్షుడుగా, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడుగా, శ్రీనివాసుడుగా అన్నింటికీమించి గోవిందుడుగా కొనియాడబడుచూ కొలువబడుతున్నాడు. పద్మావతీదేవి, అలివేలుమంగ పతిగా, సప్తగిరీశుడుగా, తిరుమలేశుడుగా భక్తకోటికి దర్శనమిస్తూ అనుగ్రహిస్తున్నాడు. వేంకటాద్రికి సరితూగే స్థానంగాని వేంకటేశ్వరుడికి సమాన దైవంగాని లేరని శాస్త్ర కథనం. భృగుమర్షి కారణంగా శ్రీమన్నారాయణుడు భువికి రావడం శ్రీనివాసుడుగా వేంకటాద్రిపై అవతరించడం- ఇదంతా విష్ణులీలా విశేషమని మహర్షుల మాట. శ్రవణం నక్షత్రంనాడు, మహావిష్ణువు శ్రీ వేంకటేశ్వరుడుగా అవతరించాడు. కావున ప్రతీ శ్రవణ నక్షత్రం నాడు ఉభయ దేవేరులతో కూడియున్న మలయప్పస్వామివారు తిరువీధుల్లో బంగారు రథంపై విహరిస్తూ భక్తులను తరింపజేస్తారు.

 

స్వామివారి పుష్కరిణిలో స్నానం, శ్రీ వరాహస్వామి దర్శనం, కటాహతీర్థపానం- ఈ మూడూ ముల్లోకాలలో దుర్లభాలని స్కాందపురాణం తెలుపుతోంది. ‘వినా వేంకటేశం, ననాదో ననాథః సదా వెంకటేశం స్మరామి స్మరామి’- స్వామీ నీవే మాకు దిక్కు తప్ప మరో దిక్కు లేదు. నినే్న నిరంతరం స్మరిస్తూ ఉంటాం.ప్రతి సంవత్సరం వసంత ఋతువునందు చైత్రమాసంలో శుద్ధ త్రయోదశి, చతుర్దశి, పూర్ణిమ, ఈ మూడు తిథులందును ఘనంగా నిర్వహింపబడి, స్వామివారిని లక్షలాది భక్తులు దర్శించుకొని తరిస్తూ వుంటారు. స్వామివారి కృపా వీక్షణాలతో, మూగవాడు మాట్లాడగలుగుతాడని, కుంటివాడు నడువగలుగుతాడని భక్తుల విశ్వాసం.  , ‘అజ్ఞానినా మయాదోషాన్ అశేషాన్, విహితాన్ హరేః క్షమస్వతం క్షమస్వతం- శేషశైల శిఖామణే’ అంటూ భక్తులు రెండు చేతులూ జోడించి శ్రీహరి వేంకటేశ్వరుని వేడుకుంటూ ఉంటారు.

 

శ్రీ మార్కండేయ మహర్షివారు, శ్రీ వేంకటేశ్వర మహాత్మ్యంలో వజ్ర కవచ స్తోత్రాన్ని రచించినట్లు ప్రసిద్ధి. ఇందులో శ్రీ వేంకటేశుని స్మరిస్తూ వుంటే, మనకు సంపూర్ణ రక్షణ వుంటుందని తెలియజేయబడుతుంది.
ప్రతిరోజూ వేలకొలదీ భక్తులలు ఏడుకొండలస్వామిని దర్శించి తరించగా, యేటా బ్రహ్మోత్సవాలు ఇతర వసంతాది మహోత్సవాలు, స్వామివారి నిత్య కళ్యాణోత్సవాలు దర్శించే లక్షలాది భక్తులు దైవానుగ్రహ పాత్రులవుతారు. ఏడుకొండలస్వామివారి లీలలు వర్ణనాతీతములు.

మరింత సమాచారం తెలుసుకోండి: