
ప్రకృతి సౌందర్యంతో పరవశింపచేసే పుణ్యక్షేత్రాలలో యాగంటి ఒకటి. బ్రహ్మం గారు నివశించిన కర్నూలు జిల్లాలోని బనగానపల్లి గ్రామానికి సమీపంలోని యాగంటి గ్రామంలో ఉమామహేశ్వర స్వామి ఆలయం నెలకొని ఉంది. ఇక్కడి ఆలయంలోని నంది విగ్రహానికి "యాగంటి బసవయ్య" అని పేరు. వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానంలో ఆలయంలోని బసవయ్య విగ్రహం అంతకంతకూ పెరుగుతుందని... కలియుగం అంతమయ్యేనాటికి లేచి రంకె వేస్తుందని పేర్కొన్నారు.
అగస్త్యమహర్షి శాపం వల్ల ఈ గ్రామంలో కాకులు ఉండవని పురాణాలు చెబుతున్నాయి. శ్రావణ మాసంలో ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు చేయడంతో పాటు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. పురాణాల ప్రకారం శివుని భక్తుడైన భృగు మహర్షి శివ సాక్షాత్కారం కోసం తపస్సు చేయడంతో శివుడు భార్యాసమేతంగా ఇక్కడ కొలువై ఉన్నాడని తెలుస్తోంది. యాగంటి ఆలయంలోని నందీశ్వరునికి దేశవ్యాప్తంగా ప్రచారం ఉంది.
యాగంటిలోని పుష్కరిణిలో ఏ కాలంలోనైనా ఒకే స్థాయిలో నీటిమట్టం ఉంటుంది. పుష్కరిణి నీటికి ఔషధ గుణాలు ఉన్నాయని.... ఈ నీటిలో స్నానమాచరిస్తే సర్వ రోగాలు నయమవుతాయని భక్తులు బలంగా విశ్వసిస్తారు. పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి గారు రచించిన కాలజ్ఞానంలో ఆలయంలోని బసవన్న రోజురోజుకు పెరుగుతాడని పేర్కొన్నారు. యాగంటి ఆలయం దగ్గర ఉన్న గుహలో బ్రహ్మం గారు కొంత కాలం నివసించారని, శిష్యులకు ఙ్ఞానోపదేశం చేసారని భక్తులు బలంగా నమ్ముతారు.
ఆలయంలో స్వయంభువుగా వెలసిన బసవన్న విగ్రహంలో జీవకళ ఉట్టిపడుతూ ఉంటుంది. రంకె వేయడానికి సిద్ధంగా ఉందేమో అనేలా నంది విగ్రహం ఉంటుంది. పురావస్తు శాఖ సైతం బసవన్న అంతకంతకూ పెరుగుతుండటం వాస్తవమేనని చెప్పడంతో మహిమాన్వితమైన పుణ్యక్షేత్రంగా యాగంటి వెలుగొందుతోంది. ఇక్కడ కాకులు కనిపించకపోవడానికి కూడా ఒక కథ ప్రచారంలో ఉంది. అగస్త్య మహర్షి పూర్వం ఈ ప్రాంతాన్ని సందర్శించి వెంకటేశ్వరస్వామి విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠిస్తే బాగుంటుందని భావించారు. విగ్రహాన్ని మలుస్తూ ఉన్న సమయంలో బొటనువేలుకు గాయం కావడంతో సంకల్పంలో లోపమేమో అనే సందేహంతో అగస్త్య మహర్షి తపస్సు చేశాడు. ఆ సమయంలో కాకులు ఆయన తపస్సుకు భంగం కలిగించడంతో, అవి ఆ ప్రాంతంలో సంచరించకుండా శపించాడని కథలు ప్రచారంలో ఉన్నాయి.