
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) ఫైనల్ మ్యాచ్ నేడు లార్డ్స్ మైదానంలో జరగనుంది. ఈ ఫైనల్ పోరులో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లు తలపడనున్నాయి. మరోవైపు భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య ఐదు టెస్టుల సిరీస్ జూన్ 20 నుంచి ప్రారంభం కానుండటంతో టీమ్‌ఇండియా ఇప్పటికే ఇంగ్లండ్ టూర్‌లో ఉంది. ఫైనల్‌కు ముందు కొన్ని రోజులు లార్డ్స్ మైదానంలో ప్రాక్టీస్ చేయాలనుకున్న ఆస్ట్రేలియా జట్టుకు తొలుత అక్కడ ప్రవేశానికి అనుమతి లభించకపోవడం వివాదానికి దారితీసింది. ఈ అవకాశాన్ని ఆసీస్ మీడియా తమ అసహనాన్ని వ్యక్తపరచడానికి ఉపయోగించింది. ఆస్ట్రేలియా జట్టు ఖర్చుతో టీమిండియా లార్డ్స్‌లో ప్రాక్టీస్ చేస్తోంది అంటూ విద్వేషపూరిత కథనాలు ప్రచురించింది. నిర్వాహకుల్లోని సమాచార లోపం కారణంగానే ఇలాంటి తప్పుడు ఆరోపణలు రావచ్చని తెలుస్తోంది.
ఆసీస్ జట్టుకు తొలుత అనుమతి రాకపోయినా, చివరికి ఆస్ట్రేలియన్ క్రికెట్ జట్టు ఆదివారం నుంచే లార్డ్స్‌లో ప్రాక్టీస్ ప్రారంభించింది. ఇదే విషయాన్ని ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ కూడా మీడియాతో పంచుకున్నారు. “ఈ ఉదయం స్టేడియం చాలా మంచి వాతావరణంలో ఉంది. చుట్టూ ఎవరూ లేరు. నాగరికంగా సాగుతుందని అనుకుంటున్నాను అంటూ కమ్మిన్స్ పేర్కొన్నాడు. గతంలో జరిగిన యాషెస్ సిరీస్ వేడి వాతావరణం ఈసారి పునరావృతం కాకూడదని ప్యాట్ కమ్మిన్స్ అభిప్రాయపడ్డాడు. అప్పుడు పరిస్థితులు తీవ్రంగా వేడెక్కాయి. కానీ ఈసారి ఇంగ్లండ్ ఆటగాళ్లు మర్యాదగా ఉంటారని నేను నమ్ముతున్నాను అంటూ ఆయన వ్యాఖ్యానించాడు.
ఇవన్నీ ఒకవైపు ఉంటే, మరోవైపు ఫైనల్ పోరు కోసం రెండు జట్లు కూడా రెడీ అయ్యాయి. వరుస విజయాలతో సౌతాఫ్రికా మంచి ఫామ్‌లో ఉండగా, గతేడాది WTC విజేతగా నిలిచిన ఆసీస్ మరోసారి టైటిల్ కైవసం చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ WTC ఫైనల్ వేదిక అయిన లార్డ్స్ మైదానం మరోసారి చారిత్రాత్మక సంఘటనకు సిద్ధమవుతోంది. చుడాలిమరి ఈసారి కొత్త ఛాంపియన్ వస్తుందో లేక గత ఛాంపియన్ విజయం కొనసాగుతుందో చూడాలి.