భారత క్రికెట్ జట్టులో తెలుగు రాష్ట్రాల క్రికెటర్ల ప్రాధాన్యం రోజురోజుకీ పెరుగుతోంది. కేవలం జట్టులో ఉన్నామన్నంత మాత్రాన కాదని.. మ్యాచ్ విన్నర్లుగా నిలుస్తూ జట్టు గెలుపు కధ రాస్తున్నారు. ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్‌లో బౌలింగ్‌లో సింహంలా పోరాడిన హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్, దుబాయ్‌లో ఆసియా కప్ ఫైనల్‌ను ఒంటి చేత్తో కైవసం చేసుకున్న తిలక్ వర్మ, అలాగే విశాఖపట్నం కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి ప్రదర్శనలు టీమ్ ఇండియాకు కొత్త ఊపును తెచ్చాయి. సిరాజ్ – జట్టు బౌలింగ్ ధైర్యం .. ఇటీవలి ఇంగ్లండ్ సిరీస్‌లో సీనియర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలు లేకపోవడంతో జట్టులో అనుభవ లోటు తలెత్తింది. బుమ్రా గాయంతో ఇబ్బంది పెడుతుంటే, మొత్తం సిరీస్ బరువు సిరాజ్ భుజాలపై పడింది.


 ఐదు టెస్టుల్లో 185.3 ఓవర్లు వేసిన సిరాజ్, చివరి టెస్టులో 5/104, 4/73తో ఇంగ్లండ్‌ను గజగజ వణికించాడు. 23 వికెట్లు తీసి టాప్ వికెట్ టేకర్‌గా నిలిచి, భారత్ సిరీస్‌ను 2-2తో సమం చేయడంలో కీలక పాత్ర పోషించాడు. తిలక్ వర్మ – ఒత్తిడి సమయంలో ఆత్మవిశ్వాసం .. ఆసియా కప్ ఫైనల్లో పాకిస్థాన్ బౌలర్లు మొదటి 20 పరుగులకే మూడు వికెట్లు కూల్చేశారు. అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ ఔట్ కావడంతో టీమ్ ఇండియా కష్టాల్లో పడింది. ఇలాంటి సందర్భంలో క్రీజ్‌లో నిలిచిన హైదరాబాదీ యువ బ్యాట్స్‌మన్ తిలక్ వర్మ ఒత్తిడిని ఏమాత్రం పట్టించుకోలేదు. 53 బంతుల్లో 69 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచి జట్టును గెలిపించాడు. ఆత్మవిశ్వాసం, కూల్ నెస్‌తో మ్యాచ్‌ను తనదైన శైలిలో మలుపు తిప్పిన తిలక్‌ను అభిమానులు “హైదరాబాద్ కా షాన్” అంటూ పొగుడుతున్నారు.



నితీశ్ కుమార్ రెడ్డి – భవిష్యత్తు స్టార్ .. విశాఖపట్నం పుట్టిన పేస్ ఆల్ రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి ఇప్పటికే తన ప్రతిభను నిరూపించుకున్నాడు. ఆస్ట్రేలియా పర్యటనలో సెంచరీ కొట్టిన అతను, ఇంగ్లండ్ సిరీస్‌లో కూడా బాగానే రాణించాడు. గాయం కారణంగా చివరి టెస్టు మిస్ అయినా, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ స్వయంగా నితీశ్ పై ఉన్న అంచనాలు వెల్లడించారు. భవిష్యత్‌లో హార్దిక్ పాండ్యా స్థానాన్ని భర్తీ చేసే సత్తా ఉన్న క్రికెటర్‌గా అతనిని భావిస్తున్నారు. సిరాజ్ బౌలింగ్, తిలక్ బ్యాటింగ్, నితీశ్ ఆల్ రౌండ్ ప్రతిభతో తెలుగు రాష్ట్రాల క్రికెటర్లు భారత క్రికెట్ జట్టులో కీలక స్థానం సంపాదిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ ముగ్గురి ప్రదర్శన టీమ్ ఇండియాకు బలాన్నిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే.. టీమ్ ఇండియాలో తెలుగు క్రికెటర్ల సమయం మొదలైంది!

మరింత సమాచారం తెలుసుకోండి: