సింగపూర్‌ సిటీ: ప్రస్తుత మోడ్రన్ యుగంలో టెక్నాలజీని ఉపయోగించి ఎన్నో అసాధ్యాలను నిజం చేసుకున్నాం. ఇప్పుడు మరో అసాధ్యాన్ని సుసాధ్యం చేసే దిశగా సింగపూర్ కు చెందిన శాస్త్ర వేత్తలు అద్భుతమైన ఆవిష్కరణ చేశారు. నేషనల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ సింగపూర్‌ (ఎస్‌యూఎస్‌)కు చెందిన శాస్త్రవేత్తలు ఈ విషయంలో కీలక ముందడుగు వేశారు. గాలి నుంచి స్వచ్ఛమైన మంచి నీటిని ఒడిసి పట్టే విషయంలో వీరు చేసిన పరిశోధనలు సత్ఫలితాలు ఇచ్చాయట. ఇంధన వనరులను వాడాల్సిన అవసరం లేకుండా, చిన్నపాటి సహజ మార్పుల సాయంతో గాలి నుంచి శుద్ధమైన జలాన్ని సేకరించే పద్ధతిని తాము అభివృద్ధి చేసినట్లు ఈ పరిశోధకులు వెల్లడించారు.

ఇందు కోసం అత్యంత తేలికగా ఉండే ఏరోజెల్‌ను తయారు చేశామని, ఇది ఓ స్పాంజిలా పనిచేస్తుందని, పరిశోధనలో చాలా కీలకమైన వస్తువు ఇదేనని శాస్త్రవేత్తలు తెలిపారు. ఏరోజెల్‌ పని చేయడానికి బ్యాటరీ కూడా అవసరం లేదని చెప్పారు. స్పాంజి లాంటి స్వభావం కలిగిన ఈ ఏరోజెల్‌ గాల్లోని నీటి అణువులను తనలోకి పీల్చుకుని భద్రపరుస్తుందని వాళ్లు తెలిపారు. అనంతరం అందులోని పాలిమర్లు సంకోచ, వ్యాకోచాలు జరిపి.. లోపల దాచుకున్న నీటి అణువులను ద్రవరూపంలో బయటికి నెట్టేస్తాయి. ఈ నీటిని ట్యాంకుల్లో నింపుకొని తాగునీటి అవసరాలు కూడా తీర్చుకునే వీలు ఉంటుందని సమాచారం.

సగటున 1 కేజీ ఏరోజెల్‌ను ఉపయోగించి గాలి నుంచి 17 లీటర్ల నీటిని ఉత్పత్తి చేయొచ్చని ఎన్‌యూఎస్‌ శాస్త్రవేత్త హో ఘిమ్‌ చెప్పారు. ఈ పరిశోధన వల్ల నీటి సమస్యలు ఎదుర్కొంటున్న చాలా ప్రాంతాలు, దేశాలకు ఉపయోగం ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం భూగర్భ జలాలు అడుగంటుతున్న తరుణంలో ఇలాంటి పరిశోధనలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ఇలాంటి ప్రయోగాల వల్ల ప్రపంచం నీటి కొరత ఎదుర్కోకుండా కాపాడ వచ్చని పరిశోధకులు అంటున్నారు. ఏది ఏమైనా ఇది మాత్రం అద్భుతమని ఒప్పుకోక తప్పదు.

మరింత సమాచారం తెలుసుకోండి: