న్యూఢిల్లీ : ప్రస్తుత మోడ్రన్ కాలంలో ఆన్ ‌లైన్ డేటింగ్ యాప్‌లకు పాపులారిటీ విపరీతంగా పెరిగిపోతోంది. టిండర్, అజర్ వంటి వాటి పాపులారిటీ గురించి వేరే చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఇలా ఆన్ లైన్ డేటింగ్ యాప్ లు ఉపయోగించే వాళ్లకు అంతర్జాతీయ ఇన్వెస్టిగేషన్ సంస్థ ఇంటర్‌పోల్ తాజాగా కొన్ని హెచ్చరికలు జారీ చేసింది. ఆన్‌ లైన్ డేటింగ్ యాప్‌లతో ప్రజలను మోసం చేస్తున్నట్లు ఇంటర్‌పోల్ కు చాలా దేశాల నుంచి ఫిర్యాదులు వచ్చాయట. ఈ నేపథ్యంలో తాజాగా అంతర్జాతీయ పోలీసు సంస్థ (ఇంటర్‌పోల్) తాజా హెచ్చరికలు జారీ చేసింది. డేటింగ్ యాప్ ల సాయంతో ప్రజలను మోసగించే మోడస్ ఆపరేషన్ పై ఇంటర్ పోల్ ప్రజలను అప్రమత్తం చేసింది. ఈ సంస్థలో ఉన్న 194 సభ్య దేశాలకు ఇంటర్ పోల్ ఈ హెచ్చరికలు చేసింది. డేటింగ్ యాప్ వల్ల మన బ్యాంకు ఖాతాలోని డబ్బు కూడా కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఇలాంటి ప్రమాదాలను గుర్తించి, చాలా అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేసింది.

డేటింగ్ యాప్ ల ద్వారా వ్యక్తులతో పరిచయం పెంచుకొని, నమ్మకం ఏర్పడిన తర్వాత ట్రేడింగ్ యాప్ డౌన్ లోడ్ చేసి బ్యాంకు లావాదేవీలు చేయమని కోరడం ప్రస్తుతం చాలా దేశాల్లో జరుగుతున్న దందా అని ఇంటర్ పోల్ తెలిపింది. ఇలా మంచి మాటలతో మనల్ని వలలో పడేసి, ఆ తర్వాత మన బ్యాంకు ఖాతాలోని డబ్బును కొల్లగొడతారని ఇంటర్ పోల్ వివరించింది. అందుకే ప్రజలు ఎవరూ మోస పూరిత డేటింగ్ యాప్ లను నమ్మొద్దని, వాటి జోలికి వెళ్లొద్దని సూచించింది.

ఆన్ లైన్ డేటింగ్ యాప్స్ వాడే వాళ్లందరూ తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు ఇవీ..

1. మీకు తెలియని వ్యక్తి మిమ్మల్ని సంప్రదించినపుడు అప్రమత్తంగా ఉండాలి.
2. అద్భుతమైన రాబడి వాగ్ధానంతో ఆన్ లైన్ పెట్టుబడులు నిజం కావని గ్రహించాలి.
3. డబ్బును బదిలీ చేయడానికి ముందు రెండు సార్లు ఆలోచించండి.
4. మీ వ్యక్తిగత, రహస్య సమాచారాన్ని బహిర్గతం చేయవద్దు.

మరింత సమాచారం తెలుసుకోండి: