రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టిన రోజు నేడు. టాలీవుడ్ లో ఓ పెద్ద హీరో కుటుంబం నుంచి వారసుడిగా వచ్చి తనకంటూ ఓ స్థానం కోసం పరితపించి, ఇప్పుడు టాలీవుడ్ లోనే కాకుండా ఏకంగా ఇండియా మొత్తానికి టాప్ స్టార్ అయ్యాడు ప్రభాస్.

1979 అక్టోబర్ 23న ప్రభాస్ అసలు పేరు ఉప్పలపాటి వెంకట సూర్యనారాయణ ప్రభాస్ రాజు. ఉప్పలపాటి ఇంటి పేరు కాగా సూర్యనాయరాయణ ఆయన తండ్రి పేరు. సినిమాల్లోకి వచ్చాక అంత పెద్ద పేరు కాస్తా  షార్ట్ గా ప్రభాస్ అయింది. రెబల్ స్టార్ కృష్ణంరాజు తమ్ముడు సూర్యనారాయణ రాజు చిన్న కొడుకు ప్రభాస్ అన్న విషయం టాలీవుడ్ లో చాలా మందికి తెలుసు. కృష్ణంరాజు హీరో గా తెరకెక్కిన బ్లాక్ బస్టర్ సినిమాలు భక్త కన్నప్ప, శివమెత్తిన సత్యం, బొబ్బిలి బ్రహ్మన్న, తాండ్రపాపారాయుడు, అమరదీపం చిత్రాలను గోపికృష్ణ మూవీస్ పతాకంపై సూర్యనారాయణ రాజు నిర్మించారు. అలా అన్నదమ్ములు ఇద్దరూ సినిమా ఇండస్ట్రీలో రాణించారు. ఇక ప్రభాస్ తన పెద్ద నాన్న బాట ఎంచుకొని హీరోగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. సినిమా పట్ల అతనికున్న ఆసక్తిని గమనించిన కుటుంబ సభ్యులు నటనలో శిక్షణ ఇప్పించారు.

2002లో ఈశ్వర్ సినిమాతో టాలీవుడ్ రంగ ప్రవేశం చేశాడు ప్రభాస్. సినిమా పర్వాలేదనిపించింది. ఆ తర్వాత వచ్చిన రాఘవేంద్ర పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. మూడో సినిమాగా వచ్చిన 'వర్షం' ప్రభాస్ ఫస్ట్ బ్లాక్ బస్టర్. ఇక ఆ తర్వాత చెప్పుకోదగ్గ సినిమా రాజమౌళి తెరకెక్కించిన 'చత్రపతి'. ఈ సినిమాతో ప్రభాస్ కెరీర్ ఒక్కసారిగా టర్న్ అయ్యింది. ఇక వరుసగా యోగి, మున్నా, పౌర్ణమి, బుజ్జిగాడు, బిల్లా, డార్లింగ్, ఏక్ నిరంజన్ చిత్రాల్లో నటించినా అవన్నీ యావరేజ్ గా నిలిచాయి. కానీ తర్వాత వచ్చిన 'మిర్చి' చిత్రం మాత్రం  మంచి విజయాన్ని సాధించింది. ఇప్పుడు 'బాహుబలి' గురించి చెప్పక్కర్లేదు 2015లో విడుదలైన ఈ సినిమా ప్రభాస్ ను పాన్ ఇండియా స్టార్ ను చేసేసింది. అప్పటి నుంచి ప్రభాస్ కు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు అయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: