వామ‌ప‌క్షాలు, కాంగ్రెస్‌ పిలుపునిచ్చిన భార‌త్‌బంద్‌కు ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మ‌ద్ద‌తు ప్ర‌క‌టించ‌డంపై ఏపీ బీజేపీ అధ్య‌క్షుడు సోము వీర్రాజు మండిప‌డ్డారు. విదేశీ శ‌క్తులు, కార్పొరేట్ శ‌క్తుల స‌హ‌కారంతో న‌డిపిస్తున్న రైతుల ఉద్య‌మానికి వైసీపీ మ‌ద్ద‌తివ్వ‌డం వైసీపీ ప్ర‌భుత్వ అవ‌కాశ‌వాద రాజ‌కీయాల‌కు నిద‌ర్శ‌న‌మ‌న్నారు. స్వార్థ రాజ‌కీయాల కోసం త‌ల‌పెట్టిన భార‌త్‌బంద్‌కు మ‌ద్ద‌తంటే వైసీపీ కూడా స్వార్థ రాజ‌కీయాలు చేస్తున్న‌ట్లేన‌న్నారు. ద‌ళారుల నుంచి రైతుల‌ను ర‌క్షించ‌డం కోసం చ‌ట్టాలు తీసుకువ‌చ్చామ‌ని, పండించిన పంట‌ను ఎక్క‌డైనా అమ్ముకోవ‌డానికి రైతుకు అవ‌కాశం క‌ల్పించామ‌ని, వీట‌న్నింటినీ వ‌దిలేసి సంస్క‌ర‌ణ‌ల‌ను స్వాగ‌తించ‌కుండా ఏపీ ప్ర‌భుత్వం ఇష్టానుసారం వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని మండిప‌డ్డారు. న‌ష్టాల్లో న‌డుస్తున్న ప్ర‌భుత్వ రంగ సంస్థ‌ల్లో ప‌నిచేస్తోన్న ఉద్యోగులు, కార్మికుల‌ను కాపాడేందుకే ప్ర‌యివేటు ప‌రం చేస్తున్నామ‌ని, విశాఖ ఉక్కు క‌ర్మాగారం కూడా అందుకే ప్ర‌యివేటుప‌రం చేస్తున్నామ‌న్నారు. ఇవేమీ అర్థం చేసుకోకుండా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై మండిప‌డ‌టం అంద‌రికీ సాధార‌ణ‌మైపోయింద‌ని విమ‌ర్శించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: