అమెరికా అగ్రరాజ్యంగా ఏక ధ్రువ ప్రపంచం కొనసాగుతున్న ఈ రోజుల్లో మళ్లీ అంతర్జాతీయ ఉద్రిక్తతలు కొన్ని నెలలుగా మొదలయ్యాయి. ఉక్రెయిన్‌ పై రష్యా దాడులు.. తైవాన్‌లో అమెరికా కవ్వింపు చర్యలు, ఉత్తర కొరియాకు అమెరికా హెచ్చరికల వంటి ఘటనలు అంతర్జాతీయ ఉద్రిక్తతలకు కారణంగా మారాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు రష్యా మరోసారి ఉత్తర కొరియాతో దోస్తీ చేస్తూ.. అమెరికాకు కన్ను కుట్టేలా చేస్తోంది. తాజాగా ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌కు రష్యా అధ్యక్షుడు పుతిన్ రాసిన లేఖ అంతర్జాతీయంగా సంచలనం సృష్టిస్తోంది.


రష్యా, ఉత్తర కొరియా ద్వైపాక్షిక సంబంధాలను మరింతగా విస్తరించాలని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ఆ లేఖలో ఆకాంక్షించారు. కొరియా విమోచన దినోత్సవం నేపథ్యంలో రాసిన ఈ లేఖలో ఇరు దేశాల ప్రయోజనాల కోసం సన్నిహిత సంబంధాలు కొనసాగిద్దామన్నారు. కొరియా ద్వీపకల్పం, ఈశాన్య ఆసియా ప్రాంత భద్రత, స్థిరత్వాన్ని బలోపేతం చేయడంలో రష్యా, ఉత్తర కొరియా స్నేహం సహాయపడతాయని పుతిన్‌ తన లేఖలో రాసుకొచ్చారు.


రష్యా అధ్యక్షుడు పుతిన్ లేఖ రాయడం.. దానికి ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ కూడా అదే స్థాయిలో స్పందించడం చర్చనీయాంశంగా మారాయి. రెండో ప్రపంచ యుద్ధంలో కొరియా ద్వీపకల్పాన్ని ఆక్రమించిన జపాన్‌పై విజయంతోనే రష్యా, ఉత్తర కొరియాల మధ్య స్నేహం ఏర్పడిందంటూ పాత విషయాలను కిమ్‌ గుర్తు చేసుకున్నారు. రష్యా, ఉత్తర కొరియా మధ్య వ్యూహాత్మక సహకారం కొత్త శిఖరాలకు చేరుకుందని కిమ్‌ తన లేఖలో పేర్కొన్నారు.


పరోక్షంగా అమెరికాను ప్రస్తావిస్తూ.. శత్రు దేశాల బెదిరింపులు, రెచ్చగొట్టే చర్యలను ఉమ్మడిగా ఎదుర్కొందామని కిమ్‌ పిలుపు ఇచ్చారు. రష్యా ఉక్రెయిన్‌ పై చేస్తున్న దాడులను కూడా ఇటీవల ఉత్తర కొరియా పరోక్షంగా సమర్థించింది. అంతే కాదు.. ఉక్రెయిన్‌లో రష్యా ప్రకటించిన డొనెట్స్క్‌, లుహాన్స్క్‌ స్వతంత్ర రాష్ట్రాలను కూడా ఉత్తర కొరియా గుర్తించింది. అవసరమైతే అమెరికాపై అణు బాంబు వేయడానికి కూడా వెనుకాడబోమంటూ ఇటీవల ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ ప్రకటించిన నేపథ్యంలో రష్యా, ఉత్తర కొరియాల లేఖాయణం అంతర్జాతీయంగా ఆసక్తిరేపుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: