వరుస సమీక్షలు
నూతన పాలక మండలి నియామకం జరుగుతున్న వేళ తిరుమల తిరుపతి దేవస్థానాల కార్య నిర్వహణాధికారిి కె ఎస్ జవహర్ రెడ్డి బుధవారం వరుసగా సమీక్షలు నిర్వహించారు. ఉదయం టీటీడీ పరిపాలనా భవనం లోని తన చాంబర్లో , సాయంత్రం శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో వివిధ శాఖల అధికారులతో వరుస సమీక్షలునిర్వహించారు. అధికారులకు పలు సూచనలు చేశారు.
మందుల విక్రయం ఆరంభించాలి.
 ఆయుర్వేద ఫార్మసీ లో ఇప్పటికే  115  రకాల మందులు తయారు చేస్తున్నట్లు ఈవో చెప్పారు. వీటిని త్వరలో విక్రయించేందుకు చర్యలు చేపట్టాలని అధికారులకు సూచనలుచేశారు. ఆయుష్ శాఖ నుంచి పంచగవ్య ఉత్పత్తులకు లైసెన్సులు పొందే ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు ఈ లోపు  ఉత్పత్తుల అమ్మకాలకు సంబంధించిన డిజైన్ లు కూడా సిద్ధం చేసుకోవాలని ఆయన చెప్పారు.  ముడి పదార్థాల సేకరణ,  యంత్రాలను సిద్ధం చేసుకుని యంత్రాల ఏర్పాటుకు అవసరమయ్యే విద్యుత్,  ఇంజనీరింగ్ పనులను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
గిర్ ఆవుల కొనుగోలు కోసం కమిటీ ఈనెలాఖరు లోపు  గుజరాత్  వెళ్లి గిర్ ఆవుల కొనుగోలుకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలన్నారు.  తిరుపతిలోని  గోశాల నుంచి భాకరాపేట, పలమనేరు లోని గోశాలలకు గోవుల తరలింపు ప్రక్రియ పది రోజుల్లో పూర్తి కావాలని జవహర్ రెడ్డి  గోశాల అధికారులకు అదేశాలు జారీ చేశారు.
ప్రకృతి వ్యవసాయానికి పెద్దపీట
ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకు టిటిడి సహాయసహకారాలు అందిస్తుందని  ఈవో తెలిపారు.  టి.టి.డి ఆలయాలకు సంబంధించి నిరుపయోగంగా ఉన్న భూములను లీజుకు ఇచ్చేందుకు నోటిఫికేషన్ విడుదల చేయాలని సూచించారు. మిగిలిన భూములు ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకు లీజుకు ఇవ్వవచ్చునన్నారు. ప్రతి ఆలయానికి సంబంధించిన సమాచారం టీటీడీ వెబ్సైట్ లో పొందుపరచాలని ఈవో సూచించారు.
టి.టి.డి నిర్వహణలో ఉన్న ప్రముఖ శివాలయం కపిలతీర్థంలో  శ్రీ కాళహస్తి , వారణాసి ఆలయాల తరహాలో సేవలు ప్రవేశ పెట్టాలని చెప్పారు. టీటీడీ ఆధీనం లోకి వచ్చిన ఆలయాల్లో  భక్తులు గోపూజ,వేద ఆశీర్వచనం చేసుకునే అవకాశం కల్పించాలని అధికారులను అదేశించారు.
కొత్తగా పాలక మండలి ఏర్పాటవుతున్న వేేళ  టిటిడి ముఖ్య కార్యనిర్వహణాధికారి బుధవారం వివిధ శాఖల అధికారులను పరుగులు పెట్టించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: