ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన  వ్యవహారంపై పెద్ద చర్చ జరుగుతోంది. ఏపీ ప్రభుత్వం అప్పట్లో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లేందుకు ఇష్టపడకపోగా , ఏపీ ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ జారీ చేసిన నోటిఫికేషన్  పైన కోర్టుకు వెళ్లి మరి అడ్డుకునేందుకు ప్రయత్నించారు. హై కోర్టు నిమ్మగడ్డకు అనుకూలంగా తీర్పు ఇవ్వడం వంటివి జగన్ ప్రభుత్వానికి చాలా ఇబ్బందికరంగా మారింది. కోర్టు తీర్పుతో ఇప్పుడు సుప్రీం కోర్టుకు వెళ్లే ఆలోచనలో ఉన్నారు. అయితే జగన్ స్థానిక సంస్థల ఎన్నికలకు ఎందుకు భయపడుతున్నారు అనేది అందరికీ సందేహాలు కలిగిస్తోంది. 2019 తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ముందుకు వెళ్తున్నారు. ఎప్పటికప్పుడు సరికొత్త పథకాలను అమలు చేస్తూ వస్తున్నారు.





 కేవలం మేనిఫెస్టో లోని అంశాలను మాత్రమే కాకుండా , అనేక కొత్త పథకాలు ప్రకటిస్తూ, ప్రజలకు మరింత దగ్గరయ్యారు. ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి గా పనిచేసిన వారు ఎవరూ ఇంత తక్కువ సమయంలో ఎక్కువ పథకాలను అమలు చేసిన చరిత్ర లేదు. ఈ క్రెడిట్ జగన్ ప్రభుత్వం కు వస్తుంది. ఇంతగా జగన్ ప్రభుత్వానికి అనుకూలంగా పరిస్థితి ఉన్నా, ఎందుకు స్థానిక సంస్థల ఎన్నికలకు జగన్ భయపడుతున్నారు అనేది ప్రశ్నగా మారింది. అసలు జగన్ కు ఉన్నది ఎన్నికల భయమా లేక ఏపీ ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ భయమా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే నిమ్మగడ్డ రమేష్ కుమార్ మార్చిలో పదవీ విరమణ చేయబోతున్నారు. ఆ తర్వాత మాత్రమే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలనేది జగన్ అభిప్రాయం. 




నిమ్మగడ్డ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తారు అనే భయం తో పాటు, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత కీలకమైన శాఖలు నియమించిన వ్యక్తులను ఇప్పుడు క్రమశిక్షణ పేరుతో నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను బదిలీ చేస్తారనే భయం జగన్ ఉంది ఒకవేళ ఆ భయమే నిజం అయితే రాజకీయంగా ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే నిమ్మగడ్డ పదవి విరమణ తర్వాత మాత్రమే జగన్ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలనే అభిప్రాయంలో ఉన్నట్టుగా  కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషను వేసేందుకు సిద్ధం అవుతున్నా, సుప్రీం లోనూ ఏపీ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వస్తుందా అనేది అనుమానమే.




 ఎందుకంటే గతంలో ఈ తరహా వ్యవహారాలపై కోర్టుల్లో చాలా రాష్ట్రాల ప్రభుత్వాలు పిటిషన్ వేసినా, ఎన్నికల సంఘానికి అనుకూలంగా తీర్పు వెలువడింది. ఇప్పుడు ఏపీ విషయంలోనూ అదే రిపీట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. అంటే జగన్ ఇప్పుడు భయం భయంగానే ఎన్నికలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: