ప్రతి దేశం కూడా తన పౌరుల కోసం జాగ్రత్తలు తీసుకుంటుంది. ఆ పౌరులు తమ దేశంలో ఉన్నా సరే.. లేదా విదేశాల్లో ఉన్నా సరే.. వారి జాగ్రత్త బాధ్యతను ఆ దేశమే చూసుకుంటుంది. అందుకే విదేశాంగ శాఖ ఈ విషయంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఎప్పుడైనా ప్రపంచంలో ఏదైనా ప్రాంతంలో శాంతి భద్రతలు లేకపోయనా.. విపత్కర పరిస్థితులు తలెత్తినా.. చాలా దేశాలు ఆ ప్రాంతాలకు తమ పౌరులు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటాయి. ఒక వేళ ఆ దేశంలో ఆ ప్రాంతంలో తమ దేశస్థులు ఉండాల్సి వస్తే.. ఇప్పటికే ఉంటే.. వారికి కొన్ని సూచనలు చేస్తాయి.


ఇప్పుడు అమెరికా కూడా అదే చేస్తోంది. కాకపోతే.. ఇక్కడ అమెరికా భారత్‌, పాకిస్తాన్ వెళ్లే తన పౌరులను హెచ్చరిస్తోంది. ప్రత్యేకించి ఇండియాలోని జమ్ము కశ్మీర్‌కు వెళ్లొద్దని తన పౌరులకు అమెరికా సూచిస్తోంది. భారత్‌, పాక్‌ సరిహద్దులో ఉగ్రవాదం పట్ల అప్రమత్తంగా ఉండాలని అమెరికా తన దేశస్తులకు సూచించింది. అదే సమయంలో అమెరికా పాకిస్తాన్‌ పైనా ఇలాంటి ఆదేశాలే తన పౌరులకు ఇచ్చింది. పాకిస్తాన్ వెళ్లేవారు పునరాలోచించుకోవాలని తన పౌరులకు సూచించిన అమెరికా.. పాక్‌లో ఉగ్రవాదం, కిడ్నాప్‌ల వంటి ఘటనలు అధికంగా ఉన్నాయని హెచ్చరిస్తోంది.


పాక్‌లో ఉగ్ర సంస్థలు దాడులకు కుట్ర పన్నినట్లు యూఎస్‌ విదేశాంగ శాఖ హెచ్చరిస్తోంది. ఉగ్ర సంస్థలు దౌత్య కేంద్రాలను లక్ష్యంగా చేసుకున్నాయని అమెరికా తన పౌరులను అప్రమత్తం చేస్తోంది. బహుశా అమెరికా తొలిసారి ఇండియా గురించి ఇలాంటి సూచనలు చేయాల్సి రావడం ఆందోళన కలిగించే విషయమే. గతంలో ఇండియాలో కరోనా విజృంభించిన సమయంలోనూ
అమెరికా తన పౌరులను హెచ్చరించింది.


ప్రపంచంలోనే అత్యంత సుందరమైన వాతావరణం, ప్రకృతి అందాలను కలిగి ఉన్న కాశ్మీరం తీవ్రవాదుల కారణంగా ఇలా జనం బిక్కుబిక్కుమని బతకాల్సిన పరిస్థితి దాపురించింది. అమెరికా వంటి ఓ దేశంలో అక్కడికి వెళ్తే జాగ్రత్త అని వార్నింగ్ ఇప్పించుకోవాల్సిన దుస్థితి తలెత్తింది. మరి ఈ పరిస్థితులు చక్కబడేదెన్నడో.. అందాల కాశ్మీరం ప్రపంచ పర్యాటక ప్రాంతంగా విలసిల్లేదెన్నడో.. ఎంత దూరంఉందో ఆ శుభ సమయం.

మరింత సమాచారం తెలుసుకోండి: