తిరుపతి కూట‌మి పార్టీల‌లో నాయకుల మధ్య విభేదాలు వివాదాలు మరింతగా పెరుగుతున్నాయా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. గత ఎన్నికల సమయంలో తిరుపతి అసెంబ్లీ టికెట్‌ను జనసేనకు కేటాయించారు. వైసీపీ నుంచి వచ్చిన ఆరణి శ్రీనివాసులకు అసెంబ్లీ టికెట్ దక్కింది. ఆయన విజయం కూడా ద‌క్కించుకున్నారు, అయితే, ఆరణి శ్రీనివాసులు విజయానికి కేవలం జనసేన మాత్రమే దోహద‌ పడిందా అంటే కాదు టిడిపి నాయకులు కూడా బలంగా పనిచేశారు. అయితే గత ఏడాదికాలంగా టిడిపి నాయకులు జనసేన నేతలకు మధ్య కొన్ని అంతర్గత విభేదాలు కొనసాగుతున్నాయి.


ముఖ్యంగా బ్యూటీఫికేషన్ కార్పొరేషన్ చైర్ పర్సన్ గా ఇటీవల నియమించబడిన సుగుణమ్మకు ఇతర నాయకులకు మధ్య అంతర్గతంగా కుమ్ములాటలు కొనసాగుతున్నాయి. వాస్తవానికి నియోజకవర్గంపై పట్టు కోసం చాలామంది నేతలు ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా జనసేనలోని ఒక వర్గం నియోజకవర్గంలో పట్టు బిగిస్తోంది. ఈ పరిణామాలను టిడిపి నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. మరోవైపు టిడిపిలోనే నాయకుల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. ఈ మొత్తం పరిణామాల నేపథ్యంలో ఇటీవల తిరుపతి పార్లమెంటు బాధ్యతలను మాజీ ఎంపీ కేంద్ర మాజీ మంత్రి పన‌బాక లక్ష్మికి అప్పగించారు.



ఇది మరింతగా టిడిపి నేతలకు ఇబ్బందికర పరిణామంగా మారింది. స్థానికంగా ఉన్న బలమైన నాయకులను వదిలేసి వేరే జిల్లా నుంచి పనబాక లక్ష్మిని తీసుకురావడం పట్ల నాయకుల్లో అసంతృప్తి కొనసాగుతోంది. మరోవైపు లక్ష్మి కూడా నాయకులను సమన్వయ చేసే దిశగా అడుగులు వేసే ప్రయత్నం చేస్తారన్నది సందేహంగా మారింది. గత పార్లమెంట్ ఎన్నికల్లో తిరుపతి నుంచి పోటీ చేసిన పన‌బాక లక్ష్మికి సమన్వయ లోపం కారణంగానే ప్రరాభ‌వం ఎదురయిందన్న వాదన వినిపించింది.



నాయకులతో కలువుడిగా ఉండకపోవడం, స్థానికంగా టిడిపి నేతలు పట్టించుకోని కారణంగానే గత ఎన్నికల్లో లక్ష్మీ పరాజయం పాలయ్యారు. ఇప్పుడు అవే విభేదాలు మరింతగా కొనసాగుతున్నాయి. పైగా ప్రస్తుతం రెండు పార్టీల మధ్య ఆధిప‌త్య‌ రాజకీయాలు పెరిగాయి. ఈ నేపథ్యంలో పనబాక లక్ష్మిని తీసుకొచ్చి ఇన్చార్జిగా నియమించడంతో ఇప్పుడు నాయకులు ఏ మేరకు ఆమెతో కలిసి ముందుకు సాగుతారు అన్నది చూడాలి. ఏదేమైనా తిరుపతిలో మాత్రం కూటమి నేతల మధ్య సఖ్యత లేదన్నది వాస్తవం.

మరింత సమాచారం తెలుసుకోండి: