తెలంగాణ సర్కారు మహిళా సాధికారతను ప్రోత్సహిస్తోంది. మహిళలకు అండగా నిలిచేందుకు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. వాటిలో ఇప్పుడు తాజాగా లేడీ జర్నలిస్టును ప్రోత్సహించేందుకు వారికి ఉచితంగా ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తోంది. మహాళా జర్నలిస్టులందరికీ ఉచితంగా మాస్టర్ హెల్త్ చెకప్ అందించనున్నట్టు తెలంగాణ  సమాచార, పౌర సంబంధాల కమీషనర్ అర్వింద్ కుమార్ ప్రకటించారు.


తెలంగాణ రాష్ట్ర ఐటి , మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్... అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా ఇచ్చిన ఆదేశాల మేరకు మహిళా జర్నిలిస్టులకు ఈ మాస్టర్ హెల్త్ చెక్అప్ కార్యక్రమాన్ని  సీఎస్ ప్రారంభించారు. మొదట కేవలం అక్రిడేషన్ ఉన్న మహిళా జర్నలిస్టులకు మాత్రమే హెల్త్ చెకప్ సేవలు అందించాలని భావించారు. కానీ ఇప్పుడు ప్రతి మహిళా జర్నలిస్టుకు సేవలు అందించనున్నట్టు సర్కారు ప్రకటించింది.


ఏప్రిల్ 9వ తేదీ వరకు నిర్వహించే ఈ మాస్టర్ హెల్త్ చెకప్ లో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన అక్రిడిటేటెడ్ మహిళా జర్నలిస్టులకు, పత్రికా, న్యూస్ ఛానెళ్లలో పనిచేస్తూ ఆర్గనైజేషన్ గుర్తింపు కార్డులు ఉన్న మహిళా జర్నలిస్టులకు చెక్‌ అప్‌ చేస్తారు. ఉదయం 7.00 గంటల నుంచి మధ్యాహ్నం 2.00 గంటల వరకు నిర్వహించే ఈ మాస్టర్ హెల్త్ చెకప్ లో  సీబీపీ, బ్లడ్ షుగర్, డయాబెటిక్ పరీక్షలు, లిపిడ్ ప్రొఫైల్, థైరాయిడ్, కాల్షియం, మూత్ర పరీక్షలు, విటమిన్ బీ12,డీ3,  ఈసీజీ, ఎక్స్-రే, అల్ట్రాసోనోగ్రఫీ, మామోగ్రామ్, పాప్ స్మెర్ పరీక్షలు అందిస్తారు.


వీటితో పాటు మెడికల్ ఆఫీసర్ ఎగ్జామినేషన్, ఐ స్క్రీనింగ్, డెంటల్ పరీక్షలు, గైనకాలజీ పరీక్షలు మొదలైనవి నిర్వహిస్తారు. ఫలితాలు అదే రోజు అందిస్తారు. తెలంగాణలో పని చేసే మహిళా జర్నలిస్టులంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వం కోరుతోంది. మొన్నటి మహిళా దినోత్సవం రోజు కేటీఆర్‌ ఇచ్చిన హామీ ఇంత త్వరగా అమలవుతుందని ఊహించలేదని మహిళా జర్నలిస్టులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: