అంచనాలకు అందని ఏపీ రాజకీయం
పోటాపోటీగా ఆంధ్రా సంకుల సమరం
రెండు వర్గాల్లోనూ పైకి ధీమా.. లోపల గుబులు..

ఆంధ్రా ఎన్నికల యుద్ధంలో కీలక ఘట్టం ముగిసింది. నామినేషన్ల పర్వం పూర్తయింది. బరిలో నిలిచేదెవరో తేలిపోయింది. నామినేషన్ల ఉపసంహరణ కూడా  పూర్తయితే పూర్తి పిక్చర్‌ కనిపిస్తుంది. అయితే.. మరో 15 రోజుల్లోనే ఎన్నికలు ఉన్నా.. ఇంకా ఏ పార్టీకీ అనుకూలత కనిపించకపోవడం ఈసారి ఎన్నికల ప్రత్యేకత. మరి ఏపీలో గ్రౌండ్‌ రిపోర్ట్‌ ఎలా ఉంది.. ఏ ప్రాంతంలో ఎవరు బలంగా ఉన్నారు.. ఏ సామాజిక వర్గాలు ఎవరికి అనుకూలంగా ఉన్నాయి. యువ, మహిళ, వృద్ధ ఓటర్ల మనోగతం ఏంటి.. ఇలాంటి వివరాలతో ఇండియా హెరాల్డ్‌ ఎక్స్‌క్లూజివ్‌ గ్రౌండ్‌ రిపోర్ట్‌.


ఏపీ ఎన్నికల్లో ఇలాంటి హోరాహోరా పోరు గతంలోనూ చాలాసార్లు సాగింది. హోరాహోరీ పోరాటాలు ఉన్నా.. ఏ పార్టీకి ఎడ్జ్ ఉందో పసికట్టే వీలు ఉండేది. కాస్త గాలి కనిపించేది. కానీ.. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం హోరాహోరీ పోరులో ఎవరు గెలుస్తారో కచ్చితంగా చెప్పలేని పరిస్థితి ఉంది. రాష్ట్రం మొత్తం మీద చూస్తే.. చెరో 70 సీట్లపై రెండు శిబిరాల్లోనూ ధీమా కనిపిస్తోంది. మిగిలిన 35 సీట్లే ఎవరికి అధికారమో తేల్చి చెప్పబోతున్నాయి. చంద్రబాబు ముందుగానే మేల్కొని పవన్‌ కల్యాణ్‌ను బతిమాలో బామాలో ఒప్పించి.. దిల్లీ వెళ్లి బీజేపీ పెద్దల వద్ద సాగిలపడి మరీ కూటమి కట్టినా కూడా గ్రౌండ్‌లో వార్‌ వన్‌ సైడ్‌గా కనిపించట్లేదు. నరాలు తెగే పోరాట దృశ్యాలే ఎక్కడ చూసినా కనిపిస్తున్నాయి.


ఇక ప్రాంతాల వారీగా చూస్తే.. జగన్‌కు రాయలసీమ కంచుకోట. గత అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 54 సీట్లలో ఏకంగా  ఇక్కడ 49 సీట్లు వైసీపీ గెలుచుకుంది. అయితే ఈసారి మాత్రం రాయలసీమలో వైసీపీకి ఆ స్థాయి మద్దతు కనిపించట్లేదు. కొన్ని సీట్లు పోయేలా ఉన్నాయి. అయితే రాయలసీమలో పడే గండిని ఉత్తరాంధ్ర కొంత పూడ్చేలా కనిపిస్తోంది. ఇక్కడ వైసీపీకి సానుకూలత కనిపిస్తోంది. నెల్లూరు, ప్రకాశం వంటి వైసీపీ కంచుకోటల్లోనూ కాస్త తేడా కనిపిస్తోంది. హోరాహోరీ పోరులో కాస్త కూటమికి ఎడ్జ్‌ కనిపిస్తోంది.


ఇక ఉభయ గోదావరి జిల్లాల్లో కూటమికి అనుకూలంగా జనసేన ఎఫెక్ట్ బాగా కనిపిస్తోంది. కృష్ణా, గుంటూరు జిల్లాల్లోనూ రాజకీయ వాతావరణం కూటమికి సానుకూలంగా కనిపిస్తోంది. కృష్ణా, గూంటూరు జిల్లాల్లో రాజధాని మార్పు అంశం ప్రభావితం చూపుతోంది. వైసీపీ అనుకూల ఓటర్లు కూడా కూటమివైపుకు మొగ్గుతున్నారు. ఇలా ప్రాంతాల వారీగా చూసుకుంటే.. హోరాహోరీ పోరు కనిపిస్తున్న ప్రస్తుతానికి ఓవరాల్‌గా వైసీపీపై కూటమి ఓ ఐదు సీట్ల పైచేయిలో కనిపిస్తోంది.

 
ముందుగానే టికెట్లు ప్రకటించి గ్రౌండ్‌ క్లియర్‌ చేసుకోవడం వైసీపీకి ప్లస్‌ అయ్యింది. చివరి నిమిషం వరకూ అభ్యర్థులను మార్చుకుంటూ ఉండటం వల్ల కూటమి అనుకున్నంతగా పాజిటివ్‌ వేవ్‌ను అందుకోలేకపోయింది. ఇక ప్రచారం విషయానికి వస్తే జగన్‌ పూర్తిగా సంక్షేమాన్నే నమ్ముకున్నట్టు కనిపిస్తోంది. సంక్షేమ పథకాల లబ్దిదారులకూ లబ్ది పొందనివారికీ మధ్య పోరాటంగా వర్ణిస్తున్నారు. దీనికే జగన్‌ అందంగా క్లాస్‌ వార్‌ అంటూ ఓ పదం కాయిన్‌ చేశారు. కూటమి పార్టీల విషయానికి వస్తే.. ఎంతసేపు జగన్‌ను వ్యక్తిగతంగా విమర్శించడం తప్ప.. తాము వస్తే ఎలాంటి అభివృద్ధి చేస్తామన్న అంశంపై ఎక్కువగా ఫోకస్‌ చేయకపోవడం మైనస్‌ అవుతోంది.


వయస్సుల వారీగా చూస్తే.. 60 ఏళ్లు పైబడిన వాళ్లు పూర్తిగా వైసీపీ వైపు కనిపిస్తున్నారు. మహిళలు కూడా వైసీపీ వైపే బాగా మొగ్గు చూపుతున్నారు. అయితే యువత, 40 -50 ఏళ్ల ఏజ్‌ గ్రూప్‌ వారు మాత్రం వైసీపీ పాలన పట్ల వ్యతిరేకంగా ఉన్నారు. ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు లేవన్నది వారి వాదనగా వినిపిస్తోంది. ప్రాంతాల వారీగా చూస్తే పట్టణ, నగర ఓటర్లు కూటమి వైపు మొగ్గు చూపుతున్నారు. అలాగని మొత్తం పట్టణ, నగర ఓటర్లు మొత్తం కూటమివైపు కూడా కాదు. అక్కడి మాస్‌ ఓటర్లు మళ్లీ వైసీపీ వైపే ఉన్నారు. ఇక గ్రామీణ ఓటర్లు వైసీపీ వైపు మొగ్గు చూపుతున్నారు.  


చివరగా కులాల వారీగా చూస్తే.. కమ్మలు, వైశ్యులు, క్షత్రియులు, బ్రాహ్మణ వర్గాలు టీడీపీకి అనుకూలంగా ఉన్నారు. రెడ్లు, మైనార్టీలు, క్రిస్టియన్లు, ఎస్సీ, ఎస్టీలు వైసీపీ వైపే మొగ్గు చూపుతున్న పరిస్థితి ఉంది. ఇక బీసీలలో మాత్రం చీలిక కనబడుతోంది. మొత్తం మీద గెలిచేది మేమే అని ఏ పార్టీ కూడా ఆత్మవిశ్వాసంతో చెప్పే పరిస్థితి లేదు. పైకి వైనాట్‌ 175 అని జగన్‌ బీరాలు పలుకుతున్నా.. ఇదిగో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నామని బాబు, పవన్‌ చెబుతున్నా పైపై గాంభీర్య ప్రకటనలే.


ఇంకా పోలింగ్‌కు 15 రోజుల వరకూ సమయం ఉండటంతో ఈ పక్షం రోజులే.. ఏ పక్షం ఏపీని పాలించాలో డిసైడ్‌ చేసే కీలక పక్షంగా మారబోతోంది. ఈ పదిహేను రోజుల్లో ఇరు శిబిరాలు ఎలాంటి వ్యూహాలు అమలు చేస్తాయో చూడాలి. గెలుపు మాదే అంటూ దీమాగా చెబుతున్నా ఫలితం ఏమవుతుందో అన్న గుబులు మాత్రం రెండు శిబిరాల్లోనూ కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: