వెళ్లిపోతున్న కాలం విసిరేసిన జ్ఞాప‌కం
ఒక్క‌టే అన్న‌ది అన్వ‌యార్థం
య‌వ్వ‌న ప్రాయాల‌కు అన్వ‌యార్థం ఆ కానుక‌లు
చ‌లి గాలుల కోరిక‌ల చెంత ఈ జ్ఞాప‌కాలు
అర్థం నుంచి భావం నుంచి ప్ర‌తిపాదిత ఆనందం నుంచి
విస్తృతం అయి ఉంటాయి.. ఆ ప్రేమ క‌థ సుకృతం
కాలం రాసిన ప్రేమ క‌థ‌కు ల‌క్ష‌ణం చెప్ప‌డంలో
అర్థం క‌న్నా భావం క‌న్నా మ‌రొక తెలియ‌ని అనుభూతి
అనిర్వ‌చ‌నీయం కావొచ్చు..


కాలం కొద్దిగా వింత‌గా ఉంటుంది. మ‌న పుట్టుకకు కార‌ణం అయిన కాలం ద‌గ్గ‌ర నివ్వెర పోవ‌డంలో అర్థం ఉంది. అన్వ‌యం కూడా ఉంది అని తాత్విక ప‌ర‌మార్థం ఒక‌టి విన్నవించి వెళ్తుంద‌ని చదివేను. మ‌న‌కు చాలీ చాల‌ని నిమిషాలు,చాలీ చాల‌ని గంట‌లు వీటి నిడివిలో దాక్కోవ‌డం ఓ చాలీచాల‌ని త‌నానికి సంకేతం..అవును! మ‌నం నిమిషాల్లో గంట‌ల్లో జీవితాల‌ను చ‌లి కాల‌పు రాత్రుల్లో వెచ్చ‌ని ప‌రదాల్లో దాక్కుంటున్నాం..అవి దేహ సంబంధ కోరిక‌ల తిరుగుబాటు అయితే బాగుంటుంది.. కానీ అవి ఆ క్ష‌ణాలు దేహ సంబంధ కోరిక‌ల చిత్త‌గింపు అని నిర్థారించాలి.. కాలం ఎక్క‌డో ఒక ద‌గ్గ‌ర నిమిత్త మాత్రుడ‌వి నీవు అని ఓ తార్కికం విన్న‌వించి, ఆదేశించి మ‌రీ!వెళ్తుంది. క‌నుక న‌గ్న పాదాల ముద్దుల‌లో కాలం ఎలా ఉంటుంది అన్న‌ది ఏ తీరం నిర్ణ‌యించ‌గ‌ల‌ద‌ని! ఇది కూడా చ‌దువ‌రి జ్ఞాప‌క‌మే! మ‌నం ఎక్క‌డో సోయ‌గాల వాకిట ఆగి ఊహా స్ర‌వంతికి దేహాల అప్ప‌గింత‌ను చేయ‌డం కూడా కాల‌మే చేసే మాయ.. మాయాన్వితం ఒక‌టి మ‌హిమాన్వితం ఒక‌టి.. కాలం రాసిన ప్రేమ క‌థ‌లో మాయా, మ‌హిమా రెండూ కూడా క్ష‌ణికాలే!
 
విషాదాన్ని కానుక‌గా చేసిన కాలంలో నేనున్నాను. మీరున్నారు. మ‌నుషుల‌కు వ‌ర‌ద ఉద్ధృతిని ప‌రిచ‌యం చేసి మృత్యువును వ‌రంగా మార్చిన కాలంలోనూ నేనున్నాను. నాతో పాటూ ఇంకొంద‌రు. కాలం ఇవాళ మంచు సోనల న‌డుమ ప్రేమ క‌బుర్లే చెబుతోంది. ప్రేమ క‌థ‌లే విన్న‌విస్తుంది. కానీ క‌సి తీరా మ‌నం ఏం చేయాల‌నుకున్నా కొన్ని స‌వాళ్ల‌ను విసిరిపోతోంది అని చ‌దివేను. క‌నుక కాలం ఒక్క‌టే మ‌నం ఏం చెప్పినా వింటుంది అని అనుకోవ‌డం త‌ప్పు! విన‌డం కాదు మ‌న‌కు అనుగుణం అయిన కొన్నింటిని వ‌రంగా మార్చి వెళ్లాలి. మ‌నుషుల‌కు ప్ర‌య‌త్నాలే వ‌రాలు అని చెప్పి వెళ్లాలి. అదృష్టాలు, అదృష్ట సంఖ్య‌లు అన్న‌వి జీవితాన్ని మార్చ‌వు కానీ న‌మ్మ‌కాల స‌డిలో కొట్టుకుపోకుండా ఉండండి అని మాత్రం హెచ్చ‌రించి వెళ్తాయి.

కొద్ది రోజుల్లో మారిపోయే క్యాలెండ‌ర్..కొద్ది రోజుల్లో మారిపోయే కాలం తీరు..ఇవ‌న్నీ కొన్నంటే కొన్ని విష‌యాలు చెప్పిపోతాయి. కాలం జ‌గ‌మంత కుటుంబంలో  ఉంటుంది.. కానీ ఏకాకిత‌నం మిగిల్చి వెళ్తుంది అన్న‌ది ఓ క‌వి భావ‌న. అవును కాలం ఎక్క‌డో పుట్టి మ‌న మ‌ధ్యకు వ‌చ్చిందా లేదా మ‌న‌తో పుట్టి దాని పుట్టు పుర్వోత్త‌రాలు తెలుసుకోవాల‌నుకుంటుందా? ఏమ‌యినా గ‌డిచిన కాలంలో వివాదాలున్నాయి. తీవ్ర తుఫానులు ఉన్నాయి. వీటిని దాట‌లేని అసక్త‌త కానీ అస‌మ‌ర్థ‌త కానీ మ‌న‌లోనే ఉంది. మ‌నం అన‌గా మ‌న ప్ర‌భుత్వాల్లో.. మనం అన‌గా మ‌న‌నం చేయ‌ద‌గ్గ విష‌యాల్లో!

- హ్యాపీ సండే టు ఆల్
 
ర‌త్న‌కిశోర్ శంభుమ‌హంతి
 

మరింత సమాచారం తెలుసుకోండి: