ఇప్పటి వేగవంతమైన జీవన శైలిలో, మొబైల్ ఫోన్లను చార్జ్ చేస్తూ చార్జర్‌ను కరెంట్ ప్లగ్‌కి వేలాడదీసి అలాగే వదిలేయడం చాలా మందికి అలవాటైపోయింది. చాలా ఇళ్లలో, ఆఫీసుల్లో రోజూ కనిపించే ఈ అలవాటు చాలా మంది దృష్టిలో చిన్న విషయంలాగే అనిపించినా, నిపుణుల ప్రకారం ఇది అసలు తేలికగా తీసుకోవాల్సిన విషయం కాదు. స్విచ్ ఆన్‌లో ఉన్నా, ఫోన్ కనెక్ట్ చేయకపోయినా, చార్జర్‌ను ప్లగ్‌లో అలాగే వదిలేయడం వల్ల పలు రకాల ప్రమాదాలు, అనారోగ్యకర పరిస్థితులు, విద్యుత్ వృథా మరియు పర్యావరణంపై ప్రతికూల ప్రభావాలు ఏర్పడతాయి.


*ఫాంటమ్ పవర్ వినియోగం – ‘వాంపైర్ ఎనర్జీ’ ప్రమాదం:

చార్జర్‌కు ఫోన్ కనెక్ట్ చేయకపోయినా కూడా, చార్జర్‌లోకి చిన్న స్థాయిలో విద్యుత్ ప్రవాహం కొనసాగుతూనే ఉంటుంది. దీనినే ఫాంటమ్ పవర్ వినియోగం లేదా వాంపైర్ ఎనర్జీ అని అంటారు. సాధారణంగా ఒక చార్జర్ 0.1–0.5 వాట్స్ వరకు విద్యుత్‌ను నిరంతరం వృథా చేస్తుంది. ఇది రోజులు, నెలలు, సంవత్సరాలగా లెక్కిస్తే గణనీయమైన విద్యుత్ యూనిట్లు వృథా అవుతాయి. ఒక్కొక్కరి ఇంట్లో కాదు… దేశవ్యాప్తంగా ఈ అలవాటు వల్ల భారీగా విద్యుత్ వృథా జరుగుతుంది. ఈ విద్యుత్ వృథా చివరకు మన జేబులోని డబ్బునే కాదు, పర్యావరణంపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతుంది.



చార్జర్ జీవితకాలం తగ్గిపోవడం:

చార్జర్‌ను నిరంతరం ప్లగ్‌లో ఉంచటం వల్ల..చార్జర్‌లోని సర్క్యూట్లు, అంతర్గత ఎలక్ట్రానిక్ భాగాలు అతి స్వల్ప వేడి కారణంగా దెబ్బతింటాయి. దీని ప్రభావం కారణంగా చార్జర్ పనితీరు క్రమంగా తగ్గిపోతుంది. ఉత్తమ నాణ్యత చార్జర్లు కూడా దీర్ఘకాలికంగా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది.



ఓవర్‌హీటింగ్ – అగ్ని ప్రమాదాల ప్రమాదం:

నిపుణుల ప్రకారం, స్విచ్ బోర్డుల్లో చార్జర్లను అలాగే వదిలేయడం సురక్షితం కాదు, ముఖ్యంగా నాసిరకం చార్జర్ల విషయంలో..నిరంతరం విద్యుత్ ప్రవాహం ఉంటే చార్జర్ వేడెక్కే అవకాశం ఉంది. ఓవర్‌హీట్ అయిన చార్జర్ వల్ల ఫోన్ పూర్తిగా పాడైపోవడం..చార్జర్ పేలిపోవడం..షార్ట్ సర్క్యూట్..వాటి వల్ల అగ్ని ప్రమాదాలు కూడా సంభవించే ప్రమాదం ఉంది...చిన్న నిర్లక్ష్యం పెద్ద నష్టంగా మారే అవకాశం ఉన్నందున, జాగ్రత్తలు అత్యంత ముఖ్యమైనవి.



పర్యావరణంపై ప్రభావం:

ఇలాంటివి చిన్న అలవాటుల్లా కనిపించినా, ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ఇదే తప్పు చేస్తుంటారు. ఫోన్ చార్జర్లు ప్లగ్‌లో అలాగే వదిలేయడం వల్ల వృథా అవుతున్న విద్యుత్ మొత్తం పర్యావరణంపై పెద్ద భారంగా మారుతుంది. విద్యుత్ ఉత్పత్తి కోసం ఎక్కువ ఇంధనం అవసరం అవుతున్నందున, కార్బన్ ఉద్గారాలు పెరిగి గ్లోబల్ వార్మింగ్‌కి దోహద పడుతాయి. కాబట్టి విద్యుత్ వృథా చిన్నదైనా… పెద్దదైనా… పర్యావరణానికి నష్టం తప్పదు.



పాటించాల్సిన భద్రతా సూచనలు

*తడి చేతులతో చార్జర్‌ను ఫోన్‌కి కనెక్ట్ చేయకండి..ఓవర్‌కరెంట్, షార్ట్ సర్క్యూట్ ప్రమాదాలు ఎక్కువ.

*ఫోన్ చార్జ్‌లో లేకపోతే చార్జర్‌ను ప్లగ్‌ నుంచి తప్పక తీసేయాలి..ఫాంటమ్ పవర్ వినియోగం, ఓవర్‌హీటింగ్ తగ్గుతుంది.

*నాణ్యమైన, సర్టిఫైడ్ చార్జర్లకే ప్రాధాన్యం ఇవ్వాలి ..లో క్వాలిటీ చార్జర్లు ప్రమాదాలకు ప్రధాన కారణాలు.

*స్మార్ట్ ప్లగ్స్‌ను ఉపయోగించడం ఉత్తమం అవి అవసరం లేకపోతే ఆటోమేటిక్‌గా పవర్‌ను కట్ చేస్తాయి.

*చార్జర్‌ను మంచం, దుప్పటి, దుస్తులు వంటి వాటిపై ఉంచి చార్జింగ్ చేయకండి వేడి ఎక్కువగా నిల్వ ఉండి ప్రమాదం పెరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: