అందరికీ తెలిసినట్లుగా పుచ్చకాయ వేసవిలో ఒక వరప్రసాదం. ఇందులో 90 శాతానికి పైగా నీరు ఉండటమే కాకుండా, లైకోపిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది సూర్యుని అతినీలలోహిత కిరణాల (UV rays) నుండి చర్మాన్ని రక్షించి, ఎండ వల్ల కలిగే డ్యామేజ్‌ను తగ్గిస్తుంది. అలాగే కీరదోసకాయలో ఉండే కూలింగ్ గుణాలు చర్మాన్ని హైడ్రేటెడ్ గా ఉంచి, మంటను తగ్గిస్తాయి. సిట్రస్ జాతికి చెందిన నిమ్మ, నారింజ వంటి పండ్లలో విటమిన్-సి పుష్కలంగా ఉంటుంది. ఇది కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి, చర్మం ముడతలు పడకుండా యవ్వనంగా కనిపించేలా చేస్తుంది.
వీటితో పాటు పెరుగును ప్రతిరోజూ తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడటమే కాకుండా చర్మం కాంతివంతంగా మారుతుంది. టొమాటోలు కూడా చర్మ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని సలాడ్స్ రూపంలో తీసుకోవడం వల్ల సహజసిద్ధమైన సన్‌స్క్రీన్ లా పనిచేస్తాయి. మామిడి పండ్లు మితంగా తీసుకుంటే అందులోని విటమిన్-ఏ చర్మ కణాల పునరుద్ధరణకు తోడ్పడుతుంది. ఎండుద్రాక్ష, బాదం వంటి నట్స్ శరీరానికి అవసరమైన విటమిన్-ఈ ని అందించి చర్మాన్ని మృదువుగా ఉంచుతాయి.
ముఖ్యంగా గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే, రోజూ కనీసం 3 నుండి 4 లీటర్ల నీరు తాగడం. కొబ్బరి నీళ్లు, మజ్జిగ వంటి పానీయాలు శరీరంలోని విషతుల్యాలను బయటకు పంపి చర్మాన్ని తాజాగా ఉంచుతాయి. నూనెలో వేయించిన పదార్థాలు, అతిగా కారం ఉండే ఆహారానికి దూరంగా ఉంటే మొటిమలు, చెమటకాయల సమస్య నుంచి తప్పించుకోవచ్చు. ఈ ఆహార నియమాలు పాటిస్తూ సరైన నిద్రపోతే ఎండకాలంలో కూడా మీ చర్మం మెరిసిపోవడం ఖాయం.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి