అనంతపురం జిల్లా...టీడీపీకి కంచుకోట అనే విషయం తెలిసిందే. ఇక్కడ ఎప్పుడు ఎన్నికలు జరిగినా టీడీపీకి మంచి ఫలితాలు వచ్చేవి. కానీ 2019 ఎన్నికల్లో మాత్రం జగన్ వేవ్‌లో టీడీపీ చిత్తుగా ఓడిపోయింది. మొత్తం 14 సీట్లలో 2 మాత్రమే గెలుచుకుంది. ఇంకా టీడీపీ కంచుకోటలు అనుకునే స్థానాల్లో కూడా ఓటమి పాలైంది. ఇదే క్రమంలోనే కదిరి స్థానంలో కూడా వైసీపీ హవా నడిచింది.

కానీ ఇది కేవలం జగన్ గాలి వల్లే జరిగిందని తెలుస్తోంది. జగన్ ఇమేజ్ వల్ల వైసీపీ తరుపున పోటీ చేసిన పెదబల్లి వెంకట సిద్ధారెడ్డి విజయం సాధించారు. టీడీపీ అభ్యర్ధి కందికుంట వెంకట ప్రసాద్‌పై దాదాపు 27 వేల పైనే మెజారిటీతో గెలిచారు. ఈ స్థాయిలో గెలవడం వల్ల ఎమ్మెల్యేపై జనం ఎప్పుడు ఎక్కువగానే ఆశలు పెట్టుకుంటారు. కానీ జనం అనుకున్న విధంగా మాత్రం సిద్దారెడ్డి నియోజకవర్గంలో పనిచేయడం లేదని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి.

కాకపోతే ప్రభుత్వ పరంగా జరిగే కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. కొత్తగా గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, హెల్త్ కేర్ సెంటర్లు నిర్మాణాలు జరుగుతున్నాయి. అలాగే జగన్ ఇచ్చే పథకాలు తప్ప కొత్తగా ప్రజలకు ఒరిగిందేమీ లేదని తెలుస్తోంది. అయితే సిద్ధారెడ్డి గెలిచిన మూడు నెలల్లో కదిరి రింగ్ రోడ్ నిర్మిస్తానని హామీ ఇచ్చారు. ఇప్పుడు సంవత్సరం దాటిన దాని ఊసులేదు. అండర్ డ్రైనేజ్ పరిస్తితి కూడా అంతే.

అలాగే మిగిలిన సామాజికవర్గాలని వదిలేసి కేవలం సొంత సామాజికవర్గానికే ప్రాధాన్యత ఇచ్చుకుంటున్నారని తెలుస్తోంది. అటు నియోజకవర్గంలో త్రాగునీటి సమస్య ఎక్కువ ఉంది. ఇక టీడీపీ నేత కందికుంట వెంకట ప్రసాద్ ఈ ఏడాదిలో ఫుల్‌గా పుంజుకున్నారని తెలుస్తోంది. 2004లోనే టిక్కెట్ దక్కపోయిన ఇండిపెండెంట్‌గా బరిలో దిగి 40 వేల ఓట్లు తెచ్చుకుని రెండోస్థానంలో నిలిచిన కందికుంట...2009 ఎన్నికల్లో టీడీపీ తరుపున ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక 2014 ఎన్నికల్లో మాత్రం 900 ఓట్ల తేడాతో అప్పటి వైసీపీ అభ్యర్ధి అత్తర్ చాంద్ బాషా చేతిలో ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో జగన్ గాలిలో 27 వేల తేడాతో ఓడిపోయారు.

ఇక ఓడిపోయినా సరే కందికుంట ఎప్పుడు ప్రజల్లోనే ఉంటున్నారు. ప్రజా సమస్యలపై నిత్యం పోరాటం చేస్తూనే ఉన్నారు. అయితే ఇక్కడ స్థానికంగా వైసీపీ మీద వ్యతిరేకిత పెరగడంతో కందికుంటకు ప్లస్ అవుతుందని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: