కార్తిక్ శివకుమార్.. ఈ పేరు ఎవరిదా అని ఆలోచనలో పడకండి. మనందరికీ తెలిసిన తమిళ హీరో కార్తి పూర్తి పేరిది. స్టార్ హీరో సూర్య తమ్ముడిగా.. ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గొప్ప గుర్తింపు తెచ్చుకున్న నటుడు కార్తి. అటు కోలివుడ్, ఇటు టాలీవుడ్ ఇండస్ట్రీల్లో తన విలక్షణమైన నటనతో మినిమం గ్యారెంటీ హీరో అనిపించుకున్నాడు. 2019లో వచ్చిన ఖైదీ సినిమాతో తనలోని నటుడిని సైతం కార్తి బయటపెట్టాడు. తాజాగా సుల్తాన్‌తో తెలుగు ప్రేక్షకులను పలకరించిన కార్తి మంచి హిట్ అందుకున్నాడు. కాగా.. నేడు(మే 25) కార్తి బర్త్ డే సందర్భంగా స్పెషల్ స్టోరీ మీ కోసం.

తండ్రి శివకుమార్(పళనిస్వామి) తమిళంలో సీనియర్ నటుడు. అన్న సూర్య స్టార్ హీరో. దీంతో కార్తి కూడా సినిమాల్లోకి అడుగుపెట్టాడు. అయితే మొదట హీరోగా కాకుండా అసిస్టెంట్ డైరెక్టర్‌గా స్టార్ డైరెక్టర్ మణిరత్నం వద్ద పని చేశాడు. 2004లో మణిరత్నం డైరెక్షన్‌లో సూర్య హీరోగా వచ్చిన యువ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేశాడు. కానీ ఆ తర్వాత హీరోగా ఛాన్స్‌లు రావడంతో నటనవైపు మళ్లాడు. 2007లో పరుత్తివీరన్ సినిమాతో తెరంగేట్రం చేశాడు.

తొలి సినిమానే మంచి హిట్ కొట్టింది. దీంతో కార్తి వెనక్కి తిరిగి చూడాల్సిన పనిలేకుండా పోయింది. తొలి సినిమాతోనే హీరోగా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నాడు. కార్తి చేసిన ప్రతి సినిమా తెలుగులోనూ దాదాపు డబ్ అయింది. తొలి సినిమా పరుత్తివీరన్‌ను తెలుగులో ‘మల్లిగాడు’గా డబ్ చేసి రిలీజ్ చేశాడు. కానీ ఈ సినిమాకి అంత గుర్తింపు దక్కలేదు. అయితే ఆ తర్వాత వచ్చిన యుగానికొక్కడు(అయరతిల్ ఒరువాన్) సినిమాతో తెలుగులో హీరోగా గుర్తింపు సంపాదించాడు. అదే ఏడాది ఆవారా(పయ్యా), నా పేరు శివ(నాన్ మమాన్ అల్లా) సినిమాలను కూడా వరుసగా తెలుగులో రిలీజ్ చేసి హిట్‌లు కొట్టాడు. దీంతో కార్తికి తెలుగులో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది.  

కార్తి సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా అవసరం ఉన్నవారికి సాయం చేడం అలవాటు. అందుకే మక్కల్ నాల మండ్రం అనే సేవా సంస్థను స్థాపించి పేద విద్యార్థులకు సైకిళ్లు, స్కూల్ బ్యాగులు వంటి వాటిని అందిస్తుంటాడు. అలాగే ఫ్యాన్స్‌తో కలిసి రక్తదానం వంటి కార్యక్రమాలను నిర్వహిస్తుంటాడు. అలాగే వాండలూర్ జూలో ఓ తెల్ల పులిని సైతం కార్తి దత్తత తీసుకున్నాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: