పంచ్ డైలాగులతో సెటైర్లతో కామెడీ సీన్స్ ను రక్తికట్టించడంలో శ్రీనువైట్లది ఒక ప్రత్యేక బాణీ. ‘దూకుడు’ ఘన విజయానికి శ్రీనువైట్ల క్రియేట్ చేసిన కామెడీ ట్రాక్ బాగా సహకరించింది అని విమర్శకులు కూడ అంగీకరిస్తారు. ఈసెటైర్ల కామెడీ శృతిమించడంతో ప్రేక్షకులు అసహనానికిలోనై శ్రీనువైట్ల తన ప్రాభవాన్ని కోల్పోయాడు.
అయితే తిరిగి తనసత్తాను చాటుకోవడానికి శ్రీనువైట్ల తన పద్ధతిని మార్చుకుని వరుణ్ తేజ్ తో ‘మిస్టర్’ సినిమాను తీసాడు. ఒక డిఫరెంట్ లవ్ స్టోరీగా వచ్చేవారం విడుదలకాబోతున్న ఈమూవీ విషయమై ఒక ఆసక్తికర న్యూస్ ఇప్పుడు లీక్ అయింది. ఈసినిమాలో కూడ శ్రీనువైట్ల ఒక టాప్ హీరో పై సెటైర్లు వేసినట్లు వార్తలు వస్తున్నాయి.
‘దుబాయ్ శీను’ లో సూపర్ స్టార్ కృష్ణను పోలిన పాత్రను ఎమ్మెస్ నారాయణతో చేయించి బోలెడన్ని నవ్వులు పంచిన వైట్ల ‘కింగ్’ సినిమాలో జయసూర్య పాత్ర మ్యూజిక్ డైరెక్టర్ చక్రిని ఉద్దేశించి పెట్టాడన్న అభిప్రాయాలు వినిపించిన నేపధ్యం తెలిసిందే. గతంలో నందమూరి బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ ప్రకాష్ రాజ్ ల పై తన సినిమాలలో సెటైర్లు వేసిన శ్రీనువైట్ల ఇప్పుడు తన లేటెస్ట్ మూవీ ‘మిస్టర్’ లో వెంకటేష్ ను టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది.
ఈమూవీలో కమెడియన్ పృథ్వీ చేస్తున్న పాత్ర వెంకీని ఉద్దేశించిందే అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పృథ్వీ చేస్తున్న పాత్ర పేరు ‘లక్ష్మీ తులసి’ కావడం విశేషం. ఈరెండూ వెంకీ సినిమాల పేర్లు అవ్వడంతో వెంకటేష్ ను టార్గెట్ గా చేసుకుని ఏవో కొన్ని డైలాగులు పృథ్వీ చేత పలికించినట్లు టాక్. అయితే గతంలో శ్రీనువైట్ల వెంకీతో ‘నమో వెంకటేశ’ అనే సినిమా తీసిన నేపధ్యంలో ఆ విషయాలను మరిచిపోయి ఇలాంటి సాహసం శ్రీనువైట్ల చేస్తాడా ? అన్న అనుమానాలు కొందరు వ్యక్తం చేస్తున్నారు.
‘బాహుబలి 2’ సునామీకి ముందు కేవలం రెండువారాల గ్యాప్ తో విడుదల అవుతున్న ‘మిస్టర్’ సినిమాను రక్షించడానికి శ్రీనువైట్ల ఇలాంటి సాహసం ఎదోఒకటి చేసి ఉంటాడనే అనిపిస్తోంది. ఈసినిమా విజయవంతం కాకపోతే శ్రీనువైట్ల పేరును టాలీవుడ్ ఇండస్ట్రీ పూర్తిగా మరిచిపోయే ఆస్కారం ఉంది..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి