సినీ పరిశ్రమలో కలిసి పనిచేసిన ఎంతోమంది నటీనటులు నిజ జీవితంలో కూడా వారి స్నేహ బంధాన్ని కొనసాగిస్తుంటారు. అలాంటి వారిలో మెగాస్టార్ చిరంజీవి మరియు నటుడు శ్రీహరి కూడా ఉన్నారు. శ్రీహరి నటనా జీవితం ప్రారంభం కాకముందు నుంచి చిరుతో పరిచయం ఉంది. వీరు చాలా మంచి స్నేహితులు, శ్రీహరి నా కుటుంబం లో ఒకడు అని, నా తమ్ముడి లాంటి వారని చిరు పలు సందర్భాల్లో ప్రస్తావించారు కూడా, అటువంటి శ్రీహరి అనారోగ్యంతో హఠాత్తుగా మరణించాడు అన్న వార్త విన్న మెగాస్టార్ దిగ్భ్రాంతికి గురయ్యారు. నిజంగా నేను ఒక తమ్ముని పోగొట్టుకున్నాను అంటూ ఆందోళన వ్యక్తం చేశారు. శ్రీహరితో తనకున్న అనుబంధాన్ని గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు చిరు. అంతగా నటుడు శ్రీహరి అంటే స్పెషల్ గా అభిమానం ఉంది చిరుకి. ఈ అభిమానంతోనే శ్రీహరి బయోపిక్ ని తెరకెక్కించాలని చిరు యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
శ్రీహరి జీవిత చరిత్ర ఎంతోమంది నటీనటులకు ఒక స్ఫూర్తిదాయకం. ఆయన ఒక రోల్ మోడల్ ఇటువంటి వ్యక్తి జీవితాన్ని అందరికీ తెలియజేయాలనే ఉద్దేశ్యంతో చిరు ఈ  బయోపిక్ చెయ్యాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ రియల్  హీరో బయోపిక్ కోసం ప్రముఖ డైరెక్టర్ తేజతో చిరు ఇప్పటికే సంప్రదింపులు కూడా చేసినట్లు టాక్. చిన్నతనం నుండే శ్రీహరి కష్టజీవి. ఓ వైపు అన్న షెడ్ లో మెకానిక్ గా పని చేస్తూనే మరో వైపు శారీరక దారుఢ్య  పోటీలలో పాల్గొనేవాడు. అలా మిస్టర్ హైదరాబాద్ గా  ఏడుసార్లు అవార్డును సొంతం చేసుకున్నాడు.  శ్రీహరి జిమ్నాస్టిక్స్ అథ్లెట్ కూడా... కానీ నటన పై ఉన్న మక్కువతో సినీ రంగం వైపు అడుగులు వేశారు.  స్టంట్ మాస్టర్ గా కెరీర్ ను ప్రారంభించిన శ్రీహరి హీరోగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తన సత్తా చాటి రియల్ స్టార్ గా ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నారు.
 మెగాస్టార్ చిరంజీవికి ఎంతో సన్నిహితుడు అయిన ఈయన అల్లుడా మజాకా, ముఠామేస్త్రి, బావగారు బాగున్నారా వంటి సినిమాలలో చిరుతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. పవర్ ఫుల్ క్యారెక్టర్ అంటే డైరెక్టర్లకు ముందుగా  శ్రీహరే మొదటి ఆప్షన్, అంతగా ప్రఖ్యాతి పొందారు. కామెడీ పండించడంలోనూ, హీరోయిజం చూపించడంలోనూ, సీరియస్ రోల్స్ లో పవర్ ఫుల్ గా కనిపించడం లోనూ, క్యారెక్టర్ ఏదైనా తన నటనతో పాత్రకు ప్రాణం పోస్తారు శ్రీహరి.  మరణించేంత వరకు కూడా సినిమాల్లో కొనసాగుతూనే ఉన్నారు. ఇంతటి గొప్ప వ్యక్తి జీవిత చరిత్రను తెరకెక్కించాలని చిరు ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో పూర్తి వివరాలు తెలియాలంటే మరి కొన్ని రోజులు వేచి చూడక తప్పదు.

మరింత సమాచారం తెలుసుకోండి: