తాజాగా తమిళ ఇండస్ట్రీలో ఒక నటుడు మహిళా యాంకర్ తో అనుచితంగా ప్రవర్తించడం సోషల్ మీడియాలో ఎంతలా వైరల్ అవుతుందో తెలిసిందే. తమిళ నటుడు కూల్ సురేష్ స్టేజ్ పై యాంకర్ తో అనుచితంగా ప్రవర్తించడంతో ఆయనను తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు. 'సరక్కు' సినిమా మ్యూజిక్ లాంచ్ ఈవెంట్ కు అటెండ్ అయిన కూల్ సురేష్ స్టేజిపై మాట్లాడుతూనే పక్కనే ఉన్న మహిళా యాంకర్ మెడలో పూలమాల వేశాడు. ఇది ఊహించని యాంకర్ ఐశ్వర్య ఆ దండను విసిరేసి తన ఆవేదన వ్యక్తం చేసింది.  సదరు నటుడిపై ఓ రేంజ్ లో విమర్శలు రావడంతో తాజాగా కూల్ సురేష్ తన చర్యలకు క్షమాపణ చెబుతూ ఓ వీడియోని సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు.

 "సినిమా ప్రమోషన్ కోసమే అలాంటి పని చేశానని చెబుతూ తాను ఒకరిని బాధ పెట్టినందుకు చింతిస్తున్నానని, నిజంగానే తాను చేసింది చాలా పెద్ద తప్పు అని ఒప్పుకున్నాడు. అందుకు బహిరంగంగా క్షమాపణలు కోరాడు. ఇకపై అలాంటి తప్పులు చేయనని" తాజా వీడియోలో పేర్కొన్నాడు. తాజాగా యాంకర్ ఐశ్వర్య సైతం ఈ సంఘటన పై స్పందించింది. ఈ మేరకు ఐశ్వర్య మాట్లాడుతూ.." ఆ సంఘటన గురించి తలుచుకుంటే ఇప్పటికీ షాక్ అవుతున్నాను. ఎవరు ఊహించని సమయంలో తను నా భుజాన్ని బలవంతంగా నొక్కి అలా ప్రవర్తించాడు.ఎవరైనా అకస్మాత్తుగా బహిరంగంగా ఇలా ప్రవర్తిస్తే మీరేం చేస్తారు? చెంప పగలగొడతారు కదా! అలాగే ఇప్పుడు నేను అతని చెంప మీద ఎందుకు కొట్టలేదని ఆశ్చర్యపోతున్నాను.

 మొరటుగా ప్రవర్తించడంలో కూడా కొన్ని పరిమితులు ఉంటాయి. ఆ ప్రవర్తన వ్యక్తిగతంగా ఎవరిని ప్రభావితం చేయకూడదు. ఇంతకుముందు కూడా కూల్ సురేష్ షోలో నాపై రచ్చ చేశాడు. సాధారణంగా అతను చేసే పనులు నాకు నచ్చవనే మాట వాస్తవమే. అందుకే అతన్ని స్టేజ్ పైకి పిలిచే ముందు నేను నటుడు కూల్ సురేష్ అని సింపుల్ గా పిలుస్తా. కానీ అది అతనికి ఇష్టం ఉండదు. అతనిని అలా పిలవకూడదని కూడా కండిషన్ పెడతాడు. ఎందుకంటే తనకు యూట్యూబ్ సూపర్ స్టార్ అనే బిరుదు ఉంది. అలా తనను ఎందుకు పిలవరని పలుమార్లు గొడవ కూడా పెట్టుకున్నాడు. కానీ అతని ప్రవర్తన సరిగా లేదు కాబట్టి నేను అలా పిలువనని చెప్పాను" అని ఐశ్వర్య తెలిపారు. అంతేకాకుండా దాన్ని మనసులో పెట్టుకొని ఈసారి దాన్ని మెడలో దండ వేసి అవమానించాలని కూల్ సురేష్ ప్లాన్ చేసినట్లు ఐశ్వర్య చెప్పింది.


మరింత సమాచారం తెలుసుకోండి: