అమ్మ మాటిస్తే సినిమా హిట్టు. అమ్మ జోలపాట పాడితే సూపర్‌ హిట్టు. అమ్మ పగసాధిస్తే.. బంపర్‌ హిట్టు. అమ్మ సెంటిమెంట్‌ పక్కాగా పండితే రికార్డులు ఖాయం.బాలీవుడ్‌ టు టాలీవుడ్‌ సినిమాకు అమ్మ రక్ష. సినిమాకు అండగా ఉన్న అమ్మ పాత్రల్లో కొందరు నటీమణులు మకుటాయమానంగా నిలిచారు. మాతృదినోత్సవం సందర్భంగా వెండితెర బంగారు తల్లులను గుర్తుచేసుకుందాం.. 'ఆజ్‌ మేరే పాస్‌ బిల్డింగ్స్‌ హై.. ప్రాపర్టీ హై.. బ్యాంక్‌ బ్యాలెన్స్‌ హై.. బంగ్లా హై.. గాడీ హై.. క్యా హై తుమ్హారే పాస్‌…' అమితాబ్‌ డైలాగ్‌! దానికి శశికపూర్‌ చెప్పిన ఒక్కమాట 'మేరే పాస్‌ మాఁ హై' అమితాబ్‌ ధరించిన పాత్ర అహంకారం బద్దలైంది. అంతకన్నా థియేటర్లలో సౌండ్‌ బాక్సులు బద్దలయ్యాయి. 'దీవార్‌’ సినిమా కలెక్షన్లు రికార్డులు బద్దలుకొట్టాయి. ఆ ఒక్క డైలాగ్‌తో 'దీవార్‌’ హీరో అమితాబ్‌కు వచ్చిన క్రెడిట్‌కు పదింతలు శశికపూర్‌ ఖాతాలో పడింది. దటీజ్‌ పవర్‌ ఆఫ్‌ మదర్‌.'నీ అమ్మ కాదురా.. నా అమ్మ.. నాకు మాత్రమే అమ్మ' అని వస్సకొల్ల మాటలకు ఛత్రపతి అభిమానులు కకావికలమయ్యారు. కండ్లెదుటే ఉన్న కన్నతల్లిని అమ్మ అని పిలువలేక, ఆమె కొడుకు తానే అని చెప్పలేక విలవిల్లాడుతున్న 'ఛత్రపతి' పాత్ర వెన్నంటే ఉన్నారు ఆడియన్స్‌ అంతా,కొడుకు కోసం ఆ తల్లి తల్లడిల్లినప్పుడల్లా ప్రభాస్‌ కన్నా ఎక్కువగా బాధపడ్డారు. ైక్లెమాక్స్‌లో 'ఒట్టేసి ఒక మాట.. వేయకుండా ఒకమాట చెప్పనమ్మా!' అని మాటలు చెవిన పడగానే.. హాలంతా ఈలలే, తన పెద్దకొడుకు బతికే ఉన్నాడని ఆ తల్లి పొందిన ఆనందానికి అవధుల్లేవ్‌. ఛత్రపతి కలెక్షన్లకు హద్దుల్లేవ్‌.సినిమా సక్సెస్‌ ఫార్ములాలో అమ్మ పాత్రకు ఉన్న ప్రాధాన్యం అలాంటిది. కథానాయకుడికి కర్తవ్య బోధ చేయాలంటే అమ్మ రంగప్రవేశం చేయాల్సిందే,విలన్‌ అరాచకాలకు కళ్లెం వేయాలన్నా అమ్మ అడ్డుపడాల్సిందే! ఎన్ని బ్లాక్‌ అండ్‌ వైట్‌ సినిమాల్లో చూడలేదు. ైక్లెమాక్స్‌లో జగ్గయ్య తుపాకీ పట్టుకొచ్చి.. హీరోకు గురిపెడతాడు. జగ్గయ్యకు అసలు తల్లి, హీరోకు పినతల్లి అయిన శాంతకుమారి పాత్ర అడ్డుపడుతుంది. అది గమనించకుండా జగ్గు ట్రిగ్గర్‌ నొక్కేస్తాడు. బుల్లెట్‌ తల్లికి తాకుతుంది. రక్తపు మడుగులో విలవిల్లాడుతున్న తల్లిని చూసి విలన్‌ మారిపోతాడు. కథ సుఖాంతం అవుతుంది. ఈ రోజుల్లో కాస్త కృతకంగా అనిపించినా… ఆ రోజుల్లో ఈ తరహా మదర్‌ సెంటిమెంట్‌ హిట్‌ ఫార్ములా.

ఆనాటి 'రోజులు మారాయి' సినిమా నుంచి నిన్నమొన్నటి 'సలార్‌’ వరకు అమ్మ పాత్రను అందలం ఎక్కించి.. వేడుక చేసుకున్న సినిమాలెన్నో ఉన్నాయి. ఆ తల్లి పాత్రల కోసమే పుట్టిన నటీమణులూ ఉన్నారు. సాధారణంగా 'నిన్నటి కథానాయికలు.. నేటి కథానాయకుల తల్లులు' అనే సంప్రదాయం ఇండస్ట్రీలో ఉంది. మహానటి సావిత్రి కూడా ఇందుకు మినహాయింపు కాదు. జమున, కృష్ణకుమారి, షావుకారు జానకి, అంజలీదేవి తదితర తొలితరం కథానాయికలు.. కృష్ణ, శోభన్‌బాబు సినిమాల్లో తల్లులుగా నటించి మెప్పించారు.రెండో తరంలో హీరోయిన్లుగా వెలుగొందిన శారద, వాణిశ్రీ, లక్ష్మి తదితర కథానాయికలు తర్వాతి జనరేషన్‌ నాయికానాయకులకు తల్లులయ్యారు. వీరిలో సెకండ్‌ ఇన్నింగ్‌లో వరుస విజయాలు సాధించిన
అమ్మ పాత్రధారి మాత్రం శారదే! కెరీర్‌ మొదటో ్ల పద్మనాభం, చలం లాంటి హాస్యనటుల పక్కన పెంకి పిల్లగా నటించిన శారద.. కథానాయికగా 'ఊర్వశి' అనిపించుకుంది.తెలుగు సినిమా ఈస్ట్‌మన్‌ కలర్‌ నుంచి పూర్తి రంగులు సంతరించుకునే వేళకు పూర్తిస్థాయి అమ్మగా అవతారమెత్తింది. ఎనభై, తొంభైల్లో తిరుగులేని మాతృమూర్తిగా ఇండస్ట్రీకి రక్షగా నిలిచింది. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్‌ లాంటి అగ్రహీరోల సినిమాల్లో తల్లిగా తన మార్కు నటన కనబరిచింది. 'అమ్మ రాజీనామా!' చిత్రం సంచలన విజయానికి కారణం శారద పాత్రే! 'అడవిదొంగ', 'కొండవీటి దొంగ', 'మదర్‌ ఇండియా', 'జగన్నాటకం' తదితర చిత్రాలు శారదలోని అమ్మదనాన్ని చిక్కగా చూపించాయి. ప్రభాస్‌ హీరోగా నటించిన 'యోగి' కలెక్షన్ల పరంగా విఫలమైనా.. శారద పాత్ర కలకాలం గుర్తుండిపోతుంది.1980ల్లో నటి అన్నపూర్ణ రూపంలో తెలుగు వెండితెరకు నిండైన అమ్మ అండ దొరికింది. సినిమా సినిమాకు నాయికా నాయకులు మారినా, దర్శకులు మారినా.. అమ్మ పాత్రలో మాత్రం అన్నపూర్ణే దర్శనమిచ్చేది. సగటు ప్రేక్షకుడు ఆమెలో సొంత తల్లిని చూసుకునేంతగా జీవించేది. హీరోయిన్‌గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన అన్నపూర్ణ ఒకట్రెండు సినిమాల తర్వాత వదిన, అక్క, అమ్మ పాత్రలకు షిఫ్ట్‌ అయింది. 'ముందడుగు' సినిమాలో కృష్ణ తల్లిగా ఆమె నటించింది. కథలో చాలా బరువైన ఆ పాత్ర కోసం ముందుగా శారదను అనుకున్నారట. చివరికి ఆ అవకాశం అన్నపూర్ణకు దక్కింది. సినిమా విడుదలయ్యాక రెండు వారాలకు వెలసిన పోస్టర్లలో అన్నపూర్ణ నిలువెత్తు ఫొటో వేయడంతో ఆమె వెండితెర తల్లిగా ఫిక్సయింది. వందల సినిమాల్లో తల్లి పాత్ర వేసినా.. ప్రతిసారీ తన ప్రత్యేకతను నిరూపించుకుంది.

శారద, అన్నపూర్ణ తర్వాత ఆ స్థాయిలో స్థిరమైన సిల్వర్‌ స్క్రీన్‌ మదర్‌గా జయసుధ పేరు తెచ్చుకుంది. 'అమ్మ నాన్నతమిళ అమ్మాయి' సినిమాలో సహజనటి తన మాతృత్వంతో ప్రేక్షకులకు మరింత చేరువైంది. 'బొమ్మరిల్లు'లో కొడుకు కోసం తపన పడే తల్లిగా ఆమె పెర్ఫార్మెన్స్‌కు జనమంతా జై కొట్టారు. జోవియల్‌ మదర్‌, సీరియస్‌ మదర్‌ ఇలా ఏ తరహా తల్లి పాత్రకైనా జయసుధ 'ద బెస్ట్‌’ అనిపించుకుంది. 'సీతమ్మ వాకిట్లో..', 'శతమానం భవతి' తరహా ఫ్యామిలీ బేస్డ్‌, సంప్రదాయ చిత్రాల్లో బరువైన అమ్మపాత్ర ఉంటే దర్శక నిర్మాతలు ముందుగా జయసుధనుసంప్రదిస్తుంటారు.పైన చెప్పుకొన్నట్టు.. వీరంతా అమ్మ పాత్రను బలంగా పండించి సినిమా భారాన్ని భుజానికెత్తుకున్న వాళ్లే! 'మదర్‌ ఇండియా', 'కడప రెడ్డమ్మ' సినిమాల్లో శారద పెర్ఫార్మెన్స్‌ కోసం రిపీటెడ్‌ ఆడియెన్స్‌ ఉండేవారు. 'అమ్మ నాన్నతమిళ అమ్మాయి' సినిమాలో జయసుధ సీన్లు రిపీటెడ్‌గా చూసే అభిమానులు ఉన్నారు. 'సాగర సంగమం', 'సీతాకోకచిలుక' చిత్రాల్లో తల్లిగా డబ్బింగ్‌ జానకి ఎంత సహజంగా నటించిందో ఇప్పటికీ గుర్తుంటుంది. మొన్నటికి మొన్న బాహుబలిలో అమ్మదనానికి కొత్త నిర్వచనం ఇచ్చిన శివగామి పాత్రను ఎలా మర్చిపోగలం. ఆ పాత్ర, దాన్ని రమ్యకృష్ణ పండించిన తీరు రెండూ ఆ సినిమా విజయంలో ఎంతోకొంత పాత్ర పోషించాయని చెప్పక తప్పదు.ఇటీవల సలార్‌లో ఈశ్వరీరావు పోషించిన తల్లి పాత్ర.. ప్రభాస్‌ లాంటి స్టార్‌డమ్‌ ఉన్న నటుణ్ని ఎలివేట్‌ చేయడానికి పనికొచ్చిందంటే.. అమ్మకున్న పవర్‌ ఏంటో తెలుస్తుంది. ఎలాగైతే అమ్మ గురించి ఎంత చెప్పినా సరిపోదో… వెండితెర తల్లుల గురించి కూడా ఎంత చెప్పినా కొంత మిగిలే ఉంటుంది. మదర్‌ సెంట్రిక్‌గా వచ్చిన కథలు ఎప్పుడూ హిట్టే! అమ్మ పాత్రను హీరోచితంగా చూపించిన సినిమాలూ హిట్టే! దటీజ్‌ ద పవర్‌ ఆఫ్‌ మదర్‌.

మరింత సమాచారం తెలుసుకోండి: