విడుదలైన ‘వారణాసి’ గ్లింప్స్‌ను పరిశీలిస్తే.. ఈ సినిమా పూర్తిగా టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ ఆధారంగా రూపొందుతున్నదని స్పష్టంగా అర్థమవుతోంది. ప్రత్యేకంగా హీరో-విలన్ క్యారెక్టర్ల మధ్య జరిగే కాన్ఫ్లిక్ట్, భవిష్యత్తు నుండి భూతకాలానికి జరగబోయే ప్రయాణం, పురాణ కాలం నేపథ్యంలో నడిచే డ్రామా భారీ స్థాయిలో ఉండబోతోందని అంచనా.ఈ మూవీలో విలన్‌గా నటిస్తున్న పృథ్విరాజ్ సుకుమారన్ ‘కుంభ’ అనే శక్తివంతమైన విలన్  కానీ వికలాంగుడైన పాత్రలో కనిపించనున్నాడు. ప్రపంచాన్ని జయించాలని కలలు కనే కుంభకు శారీరక వైకల్యం పెద్ద అడ్డుగోడగా మారుతుంది. నడవడం మాత్రమే కాదు, నిలబడే శక్తి కూడా లేకపోవడంతో అతడు పూర్తిగా ఒక వీల్‌చైర్‌కే పరిమితమైపోతాడు. తన శరీరాన్ని సరిచేసుకుని పూర్తిస్థాయి శక్తి సంపన్నుడిగా మారాలి అనేది అతని ఆకాంక్ష.


ఇదే సమయంలో హీరో పాత్ర అయిన రుద్ర, దైవాంశ సంభూతుడిగా ఈ లోకానికి అవతరిస్తాడు. అతనిలో దివ్య శక్తులు నిక్షిప్తమై ఉంటాయి. రుద్రలోని శక్తులను ఉపయోగించుకుంటే, తాను కూడా సాధారణ మనిషిలా జీవించగలనని కుంభ నమ్ముతాడు. ఆ దిశగా రుద్రను ఒప్పించి, ఇద్దరూ కలిసి త్రేతా యుగానికి టైమ్ ట్రావెల్ చేస్తారు. త్రేతా యుగంలో మనందరికీ తెలిసినట్లుగానే, లక్ష్మణుడు మూర్చపోయిన సమయంలో హనుమంతుడు సంజీవని పర్వతాన్ని తెచ్చి ప్రాణాలు నిలిపిన ఘట్టం జరుగుతుంది. ఆ సంజీవని ద్వారా తన శరీర పరిస్థితిని మార్చుకోవచ్చని కుంభ కోరుకుంటాడు. ఈ కారణంగానే టైమ్ ట్రావెల్ జరగడం మొదట్లో సహకారంగా కనిపించినప్పటికీ, అక్కడికి చేరిన తర్వాత అనుకోని పరిణామాలు, భవిష్యత్తు–భూతకాలాల మధ్య ఏర్పడే ప్రమాదకర పరిస్థితులు కథలో కీలక మలుపులుగా మారతాయి.



అత్యంత పెద్ద సర్ప్రైజ్‌గా, మహేష్ బాబు శ్రీరాముడి అవతారంలో సుమారు 30 నిమిషాలపాటు కనిపించే సీక్వెన్స్ ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో బలమైన టాక్ వినిపిస్తోంది. ఇది నిజమైతే, రాజమౌళి విజువలైజేషన్‌తో ఆ ఎపిసోడ్ ఇండియన్ సినిమా స్క్రీన్‌పై సరికొత్త అనుభూతిని అందించకుండా ఉండదు. రాముడు–ఏపిక్ నేపథ్యం–టైమ్ ట్రావెల్—ఈ కాంబినేషన్‌ ఒక్కదానితోనే థియేటర్లు విపరీతమైన రిస్పాన్స్‌తో కళకళలాడే అవకాశముంది. ఈ కథ నిజంగానే సినిమా యొక్క అసలు పాయింట్ అయితే, ‘వారణాసి’ బాక్సాఫీస్ వద్ద సునామీ లాంటి ప్రభావం చూపడం ఖాయం. ప్రపంచవ్యాప్తంగా 3,000 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించే సామర్థ్యం ఈ సినిమాకు ఉందని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: