తెలుగు చలనచిత్ర పరిశ్రమలో విజయాల శాతం దారుణంగా పడిపోయిన తరుణంలో కొందరు దర్శకులు మాత్రమే బాక్సాఫీస్ వద్ద తమ సత్తా చాటుతున్నారు. ఏడాదికి కేవలం మూడు నాలుగు భారీ విజయాలు రావడం కూడా కష్టంగా మారిన ప్రస్తుత పరిస్థితుల్లో దర్శకుడు అనిల్ రావిపూడి అరుదైన ఘనత సాధించారు. వరుసగా తొమ్మిది విజయాలతో ట్రిపుల్ హ్యాట్రిక్ నమోదు చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. దర్శక ధీరుడు రాజమౌళి తర్వాత అపజయమెరుగని దర్శకుల జాబితాలో చేరి తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. ప్రతి సినిమాతోనూ వాణిజ్యపరంగా నిర్మాతలకు లాభాలు తెచ్చిపెట్టడమే కాకుండా ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంలో ఆయన సఫలీకృతం అవుతున్నారు. సినిమా ఫలితం ఎలా ఉంటుందో ఊహించలేకపోతున్న రోజుల్లో అనిల్ రావిపూడి ఒక భరోసాగా నిలిచారు.


అనిల్ రావిపూడి సినీ ప్రయాణం గమనిస్తే పటాస్ మొదలుకుని సంక్రాంతికి వస్తున్నాం వరకు ప్రతి సినిమా ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. సుప్రీమ్, రాజా ది గ్రేట్ వంటి సినిమాలతో మాస్ ప్రేక్షకులకు దగ్గరైన ఆయన, ఎఫ్ 2 మరియు ఎఫ్ 3 సినిమాల‌తో కుటుంబ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించారు. సూపర్ స్టార్ మహేష్ బాబుతో తీసిన సరిలేరు నీకెవ్వరు, బాలకృష్ణతో రూపొందించిన భగవంత్ కేసరి సినిమాలు ఆయన కెరీర్‌లో మైలురాళ్లుగా నిలిచాయి. తాజాగా మెగాస్టార్ చిరంజీవి పేరు స్ఫురించేలా మన శంకర వరప్రసాద్ గారు అనే చిత్రంతో కూడా తన సక్సెస్ పరంపరను కొనసాగిస్తున్నారు. ఇన్ని విభిన్నమైన కథలను కమర్షియల్ ఫార్మాట్‌లో మలచి వరుస హిట్లు కొట్టడం సామాన్యమైన విషయం కాదు.


అయితే అనిల్ రావిపూడి సాధించే ప్రతి విజయం వెనుక తీవ్రమైన విమర్శలు కూడా కనిపిస్తుంటాయి. ఆయన సినిమాలు విడుదలైన తొలి రోజున మిశ్రమ స్పందన రావడం సర్వసాధారణం అయిపోయింది. ముఖ్యంగా మేధావి వర్గం విమర్శకులు ఆయన సినిమాల్లో లాజిక్ లేద‌ని.. కామెడీ పేరుతో అతి చేస్తున్నారని విమర్శిస్తుంటారు. బఫూన్ చేష్టలు, క్రింజ్ కంటెంట్ అంటూ సామాజిక మాధ్యమాల్లో రకరకాల ప్రచారాలు జరుగుతుంటాయి. కానీ విమర్శలకు భిన్నంగా సాధారణ ప్రేక్షకులు మాత్రం ఆయన సినిమాలకు బ్రహ్మరథం పడుతున్నారు. థియేటర్ కు వచ్చిన ప్రేక్షకుడు ఒత్తిడి మర్చిపోయి హాయిగా నవ్వుకోవాలని కోరుకుంటాడని, అదే విషయాన్ని అనిల్ బలంగా నమ్ముతారు. ఆ నమ్మకమే విమర్శకుల నోళ్లు మూయిస్తూ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది.


కేవలం అదృష్టం వల్లనో లేక గాలివాటంగానో ఇన్ని విజయాలు రావడం అసాధ్యం. అనిల్ రావిపూడి తెలుగు ప్రేక్షకుల నాడిని పక్కాగా పట్టుకున్నారు. సామాన్య ఆడియన్స్ థియేటర్ నుంచి ఏం ఆశిస్తున్నారో గ్రహించి దానికి తగినట్లుగా కథనాలను సిద్ధం చేసుకుంటున్నారు. ఒకప్పుడు ఆయన విజయాలను చూసి అదృష్టం అన్నవారే ఇప్పుడు ఆయన ప్రతిభను అంగీకరిస్తున్నారు. సినిమా మేకింగ్‌లో తనకంటూ ఒక ప్రత్యేకమైన కిటుకును కనిపెట్టిన అనిల్ రావిపూడికి ఇప్పట్లో తిరుగులేదనిపిస్తోంది. కమర్షియల్ హంగులతో పాటు వినోదాన్ని సరైన పాళ్లలో రంగరించడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. ఈ పట్టు ఉన్నంత కాలం ట్రిపుల్ హ్యాట్రిక్ మాత్రమే కాదు, మరిన్ని రికార్డులు ఆయన ఖాతాలో చేరడం ఖాయం.

మరింత సమాచారం తెలుసుకోండి: