సంగీత ప్రపంచంలో మరో బాల మేధావి ఉద్భవించాడు! అనిరుధ్ రవిచందర్, జీవీ ప్రకాష్ వంటి దిగ్గజాలు టీనేజ్ వయసులోనే ఇండస్ట్రీని షేక్ చేసినట్టే, ఇప్పుడు సాయి అభ్యంకర్ తన అద్భుతమైన టాలెంట్‌తో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - అట్లీల భారీ క్రేజీ ప్రాజెక్ట్ ‘రాకా’కు సంగీతం అందిస్తూ ఇప్పుడు టాలీవుడ్ టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారాడు ఈ 21 ఏళ్ల కుర్రాడు.


సాయి అభ్యంకర్ టాలెంట్ వెనుక బలమైన నేపథ్యం ఉంది. ప్రముఖ గాయకులు టిప్పు మరియు హరిణిల కుమారుడైన అభ్యంకర్‌కు సంగీతం రక్తంలోనే ఉంది. అయితే, కేవలం ఆరో తరగతిలోనే (11 ఏళ్ల వయసులో) పాటలు కంపోజ్ చేయడం మొదలుపెట్టడం సామాన్యమైన విషయం కాదు. ఆ వయసులో పిల్లలు ఆటపాటల్లో మునిగిపోతే, అభ్యంకర్ మాత్రం సృజనాత్మకతతో కొత్త ట్యూన్స్‌ను సృష్టించి తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్క్ సెట్ చేసుకున్నాడు.



సంగీత దర్శకుడిగా మారకముందే అభ్యంకర్ వద్ద దాదాపు వెయ్యి పాటల నిధి ఉంది. ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. "నా దగ్గర వెయ్యి ట్యూన్స్ ఉన్నాయి, కానీ వాటిని ఇప్పుడు వాడటం లేదు. కథ అవసరానికి తగ్గట్టుగా కొత్తగా కంపోజ్ చేస్తున్నాను. ఆ వెయ్యి పాటలను నా 60 ఏళ్ల వయసు దాటాక వాడుకుంటాను" అని సరదాగా చెప్పాడు. అంటే, అతడి వద్ద ఉన్న స్టాక్ చూస్తుంటే భవిష్యత్తులో ఎన్ని మ్యూజికల్ హిట్స్ ఇస్తారో అర్థం చేసుకోవచ్చు.



గత ఏడాది ‘డ్యూడ్’ సినిమాతో తన సత్తా చాటిన అభ్యంకర్, ఇప్పుడు ‘రాకా’ కోసం భారీ ప్లాన్స్ వేస్తున్నాడు. అట్లీ విజన్ మరియు బన్నీ మాస్ టేస్ట్‌కు తగ్గట్టుగా క్రేజీ ట్యూన్స్ రెడీ చేశారట. ముఖ్యంగా ఈ సినిమా పాటల కోసం అంతర్జాతీయ సింగర్స్‌ను రంగంలోకి దింపాలని ప్లాన్ చేస్తున్నారు. దీనివల్ల తెలుగు సినిమా పాటలు గ్లోబల్ లెవల్‌లో వైరల్ అవ్వడం ఖాయం. బన్నీ స్టెప్పులకు అభ్యంకర్ ఇచ్చే బీట్స్ తోడైతే థియేటర్లలో పూనకాలు రావాల్సిందే!



చిన్న వయసులోనే ఆడియన్స్ పల్స్‌ను పట్టేసిన అభ్యంకర్, తన పాటలకు ఆరంభంలో మిక్స్‌డ్ రెస్పాన్స్ వచ్చినా తర్వాత అవి ఎలా చార్ట్ బస్టర్స్ అవుతాయో నిరూపించాడు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినిమాతో అభ్యంకర్ కెరీర్ మరో మెట్టు ఎక్కబోతోంది. ఈ యంగ్ సెన్సేషన్ సృష్టించే మ్యూజికల్ మ్యాజిక్ కోసం నందమూరి, మెగా అభిమానులతో పాటు యావత్ భారతీయ సినీ ప్రేమికులు ఎదురుచూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: