గత మూడు రోజుల క్రితం ఉత్తరప్రదేశ్‌లో కలకలం సృష్టించిన స్నాప్‌డీల్ ఉద్యోగిని దీప్తి సర్నా కిడ్నాప్ వ్యవహారం సుఖాంతమైంది!   బుధవారం రాత్రి ఘజియాబాద్ నుంచి ఇంటికి ఆటోలో వెళ్తుండగా తనను కిడ్నాప్ చేశారని దీప్తి పోలీసులకు చెప్పింది. తన కళ్లకు గంతలు కట్లి, గుర్తుతెలియని ప్రాంతానికి తీసుకెళ్లారని తెలిపింది.   కిడ్నాపర్ల చెరనుంచి క్షేమంగా శుక్రవారం ఆమె తన ఇంటికి చేరుకుంది! దుండగులు తనను ఎందుకు కిడ్నాప్ చేశారో తెలియదని, సుమారు 40గంటలు బంధించిన వారు భోజనం పెట్టారని, వారే డబ్బిచ్చి రైలెక్కించారని తెలిపింది.  గుర్గావ్‌లోని స్నాప్‌డీల్ సంస్థలో పనిచేసే దీప్తి సర్నా (24) బుధవారం సాయంత్రం విధులు ముగించుకొని ఘజియాబాద్‌లోని తన ఇంటికి బయలుదేరింది.

ఎప్పుడూ మెట్రో రైల్లో వచ్చే దీప్తి.. ఆ రోజు ఆటో ఎక్కింది. మార్గమధ్యంలో ఆటోను డ్రైవర్ దారి మళ్లించాడు.  అప్పటినుంచి దీప్తి సెల్‌ఫోన్ పనిచేయడం మానేసింది. దీంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటనను యూపీ సీఎం అఖిలేశ్ యాదవ్ సీరియస్‌గా తీసుకొని దర్యాప్తును వేగవంతం చేయాలని పోలీసులను ఆదేశించారు. ఇంతలో దీప్తి నుంచి శుక్రవారం తండ్రికి ఫోన్ వచ్చింది. తాను హర్యానాలోని పానిపట్‌లో ఉన్నట్టు ఆమె చెప్పడంతో నేరుగా ఢిల్లీకి రావాలని ఆయన సూచించారు. ఇందులో ట్విస్టు ఏంటంటే..కిడ్నాపర్లు తనను చాలా బాగా చూసుకున్నారని, సమయానికి భోజనం కూడా పెట్టారని.. అందువల్ల వాళ్లను ఏమీ చేయొద్దని స్నాప్ డీల్ ఉద్యోగిని దీప్తి సర్నా చెబుతోంది.

తన నుంచి గానీ, తన తండ్రి నుంచి గానీ డబ్బులు కూడా ఏమీ డిమాండ్ చేయలేదని.. అంతే కాదు శుక్రవారం ఉదయం పానిపట్ రైల్వేస్టేషన్‌లో వదిలి.. రైల్వే చార్జీలు కూడా ఇచ్చారని ఆమె పేర్కొంది.  అందుకే వాళ్ల మీద కేసులు కూడా ఏమీ పెట్టొద్దని అంటోంది.  కాగా, కిడ్నాప్ వ్యవహారంపై పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆమె కిడ్నాప్‌నకు గురైందా? లేకా ఎక్కడికైనా వెళ్లిందా అన్న కోణంలో దర్యాప్తు సాగిస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: