
నెల్లూరు ఈ జిల్లా మొదట్లో కాంగ్రెస్ కు కంచు కోట లా ఉండేది ఎప్పుడైతే జగన్ పార్టీ పెట్టాడో అప్పటి నుంచి ఈ జిల్లా వైసీపీ కి కంచు కోట లా మారింది. అయితే ఆనం పార్టీలో చేరిన రోజే నెల్లూరు వైసీపీలో లుకలుకలు బైటపడ్డాయి. ఆనం చేరిక సందర్భంగా నెల్లూరు జిల్లా వైసీపీ నేతలంతా అనకాపల్లికి తరలివచ్చారు. తాజా మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి, ఆయన తనయుడు, ఆత్మకూరు ఎమ్మెల్యే గౌతమ్ రెడ్డి మాత్రం ఈ కార్యక్రమానికి డుమ్మాకొట్టారు.
అనకాపల్లికి వచ్చినట్టే వచ్చి.. సరిగ్గా కండువా పడే సమయానికి కార్యక్రమానికి ముఖం చాటేశారు మరో ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్. దీంతో వైసీపీలో ఆనం చేరిక స్థానిక నేతల్ని కొంత కలవరపెడుతోందనే వాస్తవం బహిరంగంగానే చర్చకు వచ్చింది. వచ్చే ఎన్నికల్లో ఆనం రామనారాయణ రెడ్డి ఆత్మకూరు నుంచి పోటీ చేయాలనుకుంటున్నారు. ఆయనకు ఆ నియోజకవర్గంలోనే బలం ఎక్కువ, అనుచరులంతా అక్కడే ఉన్నారు.
అయితే అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్ రెడ్డికి ఇది ఇష్టంలేదు. ఆనం కోసం తాము నియోజకవర్గం ఖాళీ చేయాల్సి వస్తుందేమోనని ఆయన అనుమానం. ప్రస్తుతానికి జగన్, రామనారాయణ రెడ్డికి నియోజకవర్గంపై మాటివ్వలేదు కానీ, ఒకవేళ ఆత్మకూరు ఇస్తే మాత్రం గౌతమ్ వేరే చోటకి వలస వెళ్లాలి. మొత్తానికి నెల్లూరు జిల్లాలో ఓ బలమైన నాయకుడు, ఆయన వర్గం వైసీపీలో చేరిందన్న సంతోషం ఓవైపు, అదే సమయంలో అసంతృప్తి జ్వాలలు మరోవైపు.. జగన్ ఈ రెండిటినీ ఎలా మేనేజ్ చేస్తారో చూడాలి. నెల్లూరే కాదు, ఎన్నికలు సమీపించే కొద్దీ.. ఇలాంటి తలనొప్పులు, సర్దుబాట్లు జగన్ చాలానే ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే, మునిగే నావలా ఉన్న టీడీపీ నుంచి బయటపడేందుకు చాలామంది ఇప్పుడు వైసీపీ వైపు చూస్తున్నారు.